సాక్షి, అమరావతి: నందిగామ వ్యవహారంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై బనాయించిన కేసును ఇంకా బిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎక్కువసేపు ఈ ఘటనపైనే చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలనే దానిపైనే ఎక్కువసేపు మంత్రులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ ఘటనను మంత్రివర్గం తీవ్రంగా ఖండించాలని చంద్రబాబు సూచించడంతో ఆ మేరకు ఒక తీర్మానం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్వహించిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై అనర్హత కొనసాగించాలనే పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.