
సాక్షి, విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ పలువురిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా అయేషా మీరా కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులను ప్రశ్నించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తనను కావాలనే ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్షపడి విడుదలైన సత్యంబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక హత్య జరిగి 11 ఏళ్లు గడవటం.. కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావటంతో సీబీఐ అధికారులు అప్పటి పోలీసులను విచారణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీసు అధికారుల జాబితాను సిద్ధం చేసిన సీబీఐ.. ఫిబ్రవరి తొలి వారంలో వారిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిచ్చే సమాచారం కేసు పురోగతికి పనికొస్తుందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment