
సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ అధికారులు
రామవరప్పాడు /సాక్షి, అమరావతిబ్యూరో/నందిగామ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌బాబును ఆయన ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారించింది. పలు అంశాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. రెండు అంతస్తుల్లోని బెడ్‌రూమ్‌లు, హాల్, బీరువా, సీక్రెట్ లాక్‌లను ఓపెన్ చేసి సోదాలు నిర్వహించింది. 9 గంటల పాటు సాగిన విచారణ, సోదాల్లో పలు వస్తువులను, కంప్యూటర్ హర్డ్ డిస్క్, ఫోన్ లిస్టుల బుక్, సీడీ, డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, ఇంట్లో పనివారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ల్యాండ్‌లైన్ల ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. కాగా తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమేనని సతీష్‌బాబు అన్నారు.
బలవంతంగా ఒప్పించారు: సత్యంబాబు
తనను బెదిరించి నేరం ఒప్పించారని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి నిర్దోషిగా విడుదలయిన సత్యంబాబు పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం కంచికచర్ల మండలం అనాసాగరంలోని ఆయన ఇంట్లో సత్యంబాబును, కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను నిర్దోషినని, అసలు ఆయేషా ఎవరో తనకు తెలియదని, హత్య ఎలా జరిగిందో తెలియదని, కేవలం విచారణ పేరుతో రాత్రి సమయంలో వచ్చి తనను తీసుకెళ్లారని చెప్పాడు. నేరం అంగీకరించాల్సిందిగా బలవంతం చేశారని, తాను అంగీకరించకపోవడంతో తన తల్లిని, చెల్లిని చంపేస్తామంటూ బెదిరించి మరీ ఒప్పించారని తెలిపాడు. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా పోలీసులు వేధించారని, నేరం అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదరించడంతో మరో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించానని సత్యంబాబు సీబీఐ అధికారుల వద్ద వాపోయాడు. సత్యంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత ఆయేషా హత్యకు గురయిన ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీదుర్గ హాస్టల్‌ను పరిశీలించారు. ఇప్పటికే ఆయేషామీరా కేసులో కీలకమైన సాక్ష్యాలు ధ్వంసం అయిన ఘటనలో ముగ్గురు విజయవాడ మహిళా కోర్టు సిబ్బందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment