
సాక్షి, గుంటూరు: పన్నెండు ఏళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు శనివారం ఆమె మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య నేతృత్వంలో అధికారులు గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని ముస్లింల శ్మశాన వాటికలో ఉన్న ఆయేషా సమాధిని తవ్వి, మృతదేహాన్ని వెలికితీశారు. ఆయేషా తండ్రి సయ్యద్ ఇక్బాల్‌బాషా, మత పెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సభ్యులు శవ పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.51 గంటలకు సమాధి వద్దకు చేరుకున్న అధికారులు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పరీక్షలు జరిపారు. సమాధి నుంచి ఎముకలు, ఇతర అవశేషాలను సేకరించారు. వాటితో అస్థిపంజర నిర్మాణం చేసి, అణువణువునూ క్షుణ్నంగా పరిశీలించారు. కేసు దర్యాప్తునకు అవసరమవుతాయన్న భావనతో ఆయేషా మృతదేహం కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి(సీఎఫ్‌ఎస్‌ఎల్) తరలించారు. రీ పోస్ట్‌మార్టానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకుండానే అధికారులు వెళ్లిపోయారు. రీ పోస్ట్‌మార్టం సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
త్వరలో దోషుల గుర్తింపు?
ఆయేషా హత్య కేసులో అసలు దోషులను సీబీఐ అధికారులు త్వరలో గుర్తిస్తారని సీనియర్ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ చెప్పారు. ఏడాది క్రితం కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పటికే పలువురు సాక్షులను విచారించిందని, అంతేకాక న్యాయస్థానంలో కేసును నిరూపించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ సేకరిస్తోందని తెలిపారు. అసలు దోషులను గుర్తించడంలో రీ పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కానుందన్నారు.
దర్యాప్తులో ఆ ఎముకలు కీలకం?
ఆయేషా హత్య కేసు దర్యాప్తులో వైద్య/ఫోరెన్సిక్ నిపుణుల బృందం సేకరించిన ఎముకలు కీలకం కానున్నాయని తెలుస్తోంది. ఆయేషా మృతదేహానికి సంబంధించి పోస్ట్‌మార్టం నివేదిక తప్పుల తడకగా ఉందని, మెడ కింది భాగం, శరీరంపై అనేక గాయాలున్నాయని, వాటిని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడించలేదని, అంతేకాక డీఎన్‌ఏ రిపోర్టు సైతం లోపభూయిష్టమంటూ ఆమె తల్లిదండ్రులు, వారి తరఫు న్యాయవాది ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయేషా తలను తలుపుకేసి మోదడమే కాకుండా కర్ర, ఇతర ఆయుధాలతోనూ దాడి చేశారని వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛాతీ ప్రాంతంలో ఉండే ఉరోస్థి, చేతికి సంబంధించిన హుమెరస్, పుర్రె, దవడ ఎముకలను నిపుణులు సేకరించారు. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షించి నివేదిక రూపొందించనున్నారు. రీ పోస్ట్‌మార్టం నివేదికలో ఈ ఎముకలు కీలకంగా మారనున్నాయి.
ఇప్పటికైనా న్యాయం జరగాలి
మా మత ఆచారాలను పక్కనపెట్టి మరీ రీ పోస్ట్‌మార్టానికి ఒప్పుకున్నాం. 12 ఏళ్లుగా మా పోరాటం కొనసాగిస్తున్నాం. గతంలో ‘సిట్’ దర్యాప్తు దాదాపు ఏడాది పాటు జరిగినా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తుతో మాకు న్యాయం జరగాలి. అసలు దోషులను శిక్షించాలని కోరుతున్నాం.
– శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా, ఆయేషా మీరా తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment