బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
8 ఏళ్ల క్రితం ఘటనపై విచారణ
బాపట్ల: 8 ఏళ్ల క్రితం కొందరు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి బాపట్ల ఐడీబీఐ బ్యాంకు నుంచి లోన్ల రూపేణా రూ.122 కోట్లు స్వాహా చేశారు. దీనిపై అంతర్గత విచార ణ జరిపిన బ్యాంకు అధికారులు ఎట్టకేలకు 181 మంది రూ.122 కోట్ల మేర బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారని నిర్ధారించుకుని సీబీఐని ఆశ్రయించారు. కేసుకు సంబంధించి మరిన్ని అధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం బాపట్లలో రహస్యంగా విచార ణ జరిపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 28న 40 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. బాపట్ల కేంద్రంగా నడుస్తున్న కామాక్షి డెయిరీ ఫామ్ అధినేత గండూరి మల్లి కార్జునరావుతో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి, రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల సహకా రంతో ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించారు.
గుంటూరులోని చంద్రమౌళి నగర్ ఐడీబీఐ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్‌ను కలుపుకుని ఫైల్స్ కదిలించారు. 2010– 2012లో విడతల వారీగా బ్యాంకు నుంచి లోన్ల రూపేణా సొమ్ము దోచుకున్నారు. ఈ కేసులో చంద్రశేఖర్‌ను ఏ–1గా, మల్లికార్జునరావును ఏ–2గా చేర్చారు. మరో 38మందిపై కేసు నమోదైంది. సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.