
సినీ ఫక్కీలో బంకులో మోసం
సీసీ కెమెరాలో చిక్కిన నిందితుడు
రావికమతం : రావికమతంలోని ఓ వ పెట్రోల్ బంకులో ఓ అపరిచిత వ్యక్తి సినీ ఫక్కీలో మోసం చేసి రూ.25 వేల అపహరించుకుపోయాడు. దీనిపై బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. రావికమతం సుశీల ఏజెన్సీ ఆధ్వర్వంలో నడుస్తున్న బంకుకు సోమవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. అక్కడ సూపర్ వైజర్ అప్పారావుతో మాట్లాడుతూ.. తనను తహశీల్దార్ కుమార్ పంపించారని, బంకు యజమాని తనకు తెలుసని తెలిపాడు. రూ. 25 వేలకు ఎన్ని లీటర్ల డీజిల్ వస్తుందో అంతటి కి బిల్లు కావాలని, తర్వాత వచ్చి డీజిల్ తీసుకెళ్తామని చెప్పాడు. అత్యవసరంగా రూ. 25 వేలు కావాలని, ఆ మొత్తం చోడవరం పంపించాలని వారిని నమ్మబలికాడు.
మొత్తం రూ.50 వేలు కార్యాలయానికి వస్తే ఇస్తానని వారితో చెప్పాడు. దీంతో వారు బంకు యజ మాని శేషుతో మాట్లాడారు. ఆయన సైతం నమ్మి బిల్లుతో పాటు, రూ.25 వేలు ఆ వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. అతని వెంట వెళ్లి రూ. 50 వేలు తేవాలని సిబ్బందికి సూచించాడు. దీంతో రూ. 25 వేలు తీసుకున్న ఆ వ్యక్తి మరొకరికి ఇచ్చి పంపేశాడు. మొత్తం రూ. 50 వేలు తన వెంట వస్తే ఇస్తానంటూ.. బంకు ఉద్యోగి ఈశ్వరరావును వెంట తీసుకుని రావికమతం ఉన్నత పాఠశాలకు వెళ్లాడు. అక్కడ ఈశ్వరరావును చెట్టుకింద కూర్చొమని చెప్పి.. ఆ వ్యక్తి ఉన్నత పాఠశాలలోకి ప్రవేశించాడు. అక్కడే 20 నిముషాలు వేచి ఉన్న ఈశ్వరరావు.. లోపలికి వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టూ పక్కల వెతికాడు. ఆ వ్యక్తి ఆచూకీ కనిపించ కపోవడంతో ఉపాధ్యాయులను అడిగాడు. ఎవరో వ్యక్తి వచ్చారని,వెనుక గేటు నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించి, బంకు యాజమానికి ఫోన్లో జరిగింది వివరించాడు. వెంటనే బంకు యాజమాని పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని సేకరించి విచారణ చేపడుతున్నారు.