విభజనపై వెనక్కి తగ్గాల్సిందే: సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం
సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన సోమవారం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వరసగా రెండోరోజూ వందలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సచివాలయం లోపల, బయట ద్వారాల వద్ద బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు. మురళీకృష్ణ స్పష్టం చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు తమ మద్దతును ప్రకటించారు.
రాష్ట్ర విభజనవల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రభుత్వోద్యోగులేనని, అలాంటిది తమకు మాట మాత్రమైనా చెప్పకుండా యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రకటించడం గర్హనీయమని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడక ముందే సీమాంధ్ర ఉద్యోగులందరూ వెళ్లిపోవాలని కేసీఆర్ హెచ్చరిస్తుంటే ఇక తమకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన రెండు రోజులకే మాట మార్చారని, ఇక తమ భద్రతకు భరోసా ఎలా కల్పిస్తారని నిలదీశారు. సీమాంధ్ర నాయకులను నమ్మి మోసపోయామని లేకుంటే తెలంగాణ ప్రకటనకు ముందే ఉద్యమబాట పట్టేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట పూర్తిగా అవాస్తవమని, అబద్ధపు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలపై తెలంగాణలో వ్యతిరేకభావనను పెంచుతున్నారని ఆ ప్రాంత రాజకీయ నేతలను తప్పుపట్టారు.
1970లో సర్వీస్ కమిషన్ ఏర్పడిన తరవాత 14ఎఫ్, 610 జీవోను అనుసరించే రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలు జరిగాయని, ఇక అన్యాయానికి ఆస్కారమెక్కడుందని ప్రశ్నించారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో 20శాతం మంది నల్గొండ జిల్లా నుంచే ఎంపికయ్యారని, మెరిట్ సాధించిన వారికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు వరకూ పదోన్నతులు ఆపాలని కొందరు కోరుతున్నారని ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదన్నారు. ఈలోగా పదవీ విరమణ చేసే వారికి దీనివల్ల నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అసంబద్ధమైన డిమాండ్ వల్ల ఇరు ప్రాంతాల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదముందన్నారు. తెలంగాణ ప్రకటనను చేసిన దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పరిస్థితులపై కనీస అవగాహన కూడా లేదని ఫోరం నేతలు విమర్శించారు. ప్రణాళికాబద్ధంగా ఉద్యమం కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకూ వెనక్కి తగ్గబోమని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య చెప్పారు.