
కడప అర్బన్: శిక్ష ముగియక ముందే సత్ప్రవర్తన కింద కడప కేంద్ర కారాగారం నుంచి ఒక ఖైదీ విడుదలకు అవకాశం లభించింది. గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు మంచి నడవడిక గలిగిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేయటం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఈఏడాది ఈ విధంగా కారాగారాల్లో తక్కువ శిక్షను అనుభవిస్తూ, సత్ప్రవర్తన కల్గిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలోని వివిధ కారాగారాలలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల జాబితాను రూపొందించాలని కేంద్రం కోరింది.
ఈమేరకు రాష్ట్రంలోని కొందరు ఖైదీల పేర్లను జైలు అధికారులు నివేదించారు. కడపజైలు నుంచి ఇరువురి పేర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో పదిమంది ఖైదీలను విడుదల చేయాలని మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో కడప కేంద్ర కారాగారంలో సుమారు 5నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నాగలూరి గాంధీ ఒకరు. ఇతడు గుంటూరు జిల్లా వినుకొండకు చెందినవాడు. ఇతనికి ఒక కేసులో 14నెలల జైలు శిక్ష కోర్టు విధించిందని జైలు అధికారులు చెప్పారు. స్వల్ప కాల వ్యవధిలోనే గాంధీ కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్నాడు. ఇతని వయసు 26 సంవత్సరాలు.
Comments
Please login to add a commentAdd a comment