clemency
-
Bilkis Bano Case: వారి విడుదల దేనికి సంకేతం?
గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపైనా, ఆమె కుటుంబం పైనా సామూహిక లైంగిక దాడి, హత్యాచారం కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. ఆ ఖైదీలకు మనువాదులు స్వాగత సత్కారాలు చేయడం సభ్య సమాజానికి పుండు మీద కారం చల్లినట్టయ్యింది. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంలో మనువాద మూకల దాడులను తప్పించు కోవడానికి ప్రయత్నించిన ముస్లిం కుటుంబాన్ని పొలాల్లో వేటకుక్కల్లా వేటాడారు. ఒకే కుటుంబంలో ఏడుగురిని క్రూరంగా చంపేశారు. తల్లీ బిడ్డలను లైంగిక దాడి చేసి హత్య చేశారు. అదే ఘటనలో లైంగిక దాడికి గురైన ఐదు నెలల గర్భవతి బిల్కిస్ బానో చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. బిల్కిస్ బానో సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసింది. ఈ కేసు విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ముందు జాగ్రత్తలో భాగంగా గుజరాత్ నుంచి మహారాష్ట్రకు కేసు బదిలీ అయింది. సీబీఐ కోర్టు ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసి 2008 జనవరి 21న ఈ అమానవీయ కాండలో పాల్గొన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది. దీనిని ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పట్టించుకోలేదు. సీబీఐని సంప్రదించలేదు. సలహాలు తీసుకోలేదు. ఈ ఖైదీల విడుదలను మూక దాడులు చేసే విచ్ఛిన్నకర, ఉన్మాద శక్తులకు భరోసా కల్పించే చర్యల్లో భాగంగా చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలను నయానో భయానో లొంగదీసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నమే ఇది. జైలు నుంచి విడుదలైన ఉన్మాద మూకను విశ్వహిందూ పరిషత్ వాళ్లు, ఇతర మనువాదులు పూలమాలలతో స్వాగతించారు. సన్మానాలు చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలతో రాఖీలు కట్టించారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఎర్రకోట నుంచి ఏలికలు నారీ శక్తి గురించి ప్రగల్భాలు పలుకుతున్న సమయంలోనే ఈ నేరస్థుల విడుదల దేనికి సంకేతంగా నిలుస్తోంది? (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇప్పటికే ఆరు వేల మంది పౌరులు, మహిళ సంఘాలు, హక్కుల కార్య కర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ‘న్యాయం పట్ల మహిళల విశ్వాసాన్ని పెంపొందిస్తూ 11 మంది దోషులకు రెమిషన్ రద్దుచేయాలనీ, వారిని తిరిగి జైలుకు పంపాల’నీ ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని బిల్కిస్ బానో కలలో కూడా ఊహించి ఉండదు. బాధితురాలి ప్రాణాలకు, ప్రశాంతతకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ‘నా ఒక్క దాని కోసమే కాదు, న్యాయ స్థానాల్లో న్యాయం కోసం పోరాడు తున్న మహిళలందరి కోసం... ప్రశాంతంగా, నిర్భయంగా జీవించే నా హక్కును తిరిగి ఇవ్వాలి’ అని వేడుకుంటోంది. ఆమె కోరిక అత్యాశ అవుతుందేమో!? – మామిండ్ల రమేష్ రాజా తెలంగాణ కార్యదర్శి, సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్ -
కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్ (బాల్కొండ): కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో కువైట్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న, చిల్లర నేరాలకు పాల్పడిన విదేశీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారందరినీ వారి మాతృదేశాలకు పంపేందుకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కువైట్ ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనికోసం వివిధ దేశాలవారికి వేర్వేరు తేదీలను కేటాయించగా, భారతీయులకు 11 నుంచి 14వ తేదీలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారత్‌లో 14వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన క్రమంలో ప్రత్యేక అనుమతి కోసం భారత ప్రభుత్వంతో కువైట్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. -
ఒకే ఒక్కడు
కడప అర్బన్: శిక్ష ముగియక ముందే సత్ప్రవర్తన కింద కడప కేంద్ర కారాగారం నుంచి ఒక ఖైదీ విడుదలకు అవకాశం లభించింది. గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు మంచి నడవడిక గలిగిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేయటం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఈఏడాది ఈ విధంగా కారాగారాల్లో తక్కువ శిక్షను అనుభవిస్తూ, సత్ప్రవర్తన కల్గిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలోని వివిధ కారాగారాలలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీల జాబితాను రూపొందించాలని కేంద్రం కోరింది. ఈమేరకు రాష్ట్రంలోని కొందరు ఖైదీల పేర్లను జైలు అధికారులు నివేదించారు. కడపజైలు నుంచి ఇరువురి పేర్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో పదిమంది ఖైదీలను విడుదల చేయాలని మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో కడప కేంద్ర కారాగారంలో సుమారు 5నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నాగలూరి గాంధీ ఒకరు. ఇతడు గుంటూరు జిల్లా వినుకొండకు చెందినవాడు. ఇతనికి ఒక కేసులో 14నెలల జైలు శిక్ష కోర్టు విధించిందని జైలు అధికారులు చెప్పారు. స్వల్ప కాల వ్యవధిలోనే గాంధీ కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్నాడు. ఇతని వయసు 26 సంవత్సరాలు. -
నిష్క్రమణం
నార్జిస్ కటకటాల వెనుక నుంచి తల్లిని చూసింది. ఆమె పండిన జుత్తునీ, ధారాపాతంగా కురుస్తున్న కన్నీటినీ చూసింది. ఆమె పక్కనే నిల్చుని ఉన్న సోదరుణ్ణి చూసింది. అతని తల విషాదంతో అవనతమై ఉండటాన్ని చూసింది. అయినా నార్జిస్‌కు అతని ఖిన్న వదనం స్పష్టంగానే కనపడింది. నార్జిస్‌తో పాటు జైల్లో పెరుగుతున్న ఆమె కొడుకు మెహెదీ అమాయకంగా నవ్వుతున్నాడు. చప్పట్టు కొడుతూ మేనమామ వైపు చాక్లెట్ కోసం చెయ్యి చాచాడు. అప్పుడతను వొంచిన తల ఎత్తాడు. కటకటాల లోంచే పిల్లవాడి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. మామయ్య కన్నీరు మేనల్లుడి చేతిలో పడ్డది. మురికి తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ చేతుల్ని తుడిచాడు. ఈ దృశ్యం నార్జిస్ జ్ఞాపకాల పెన్నిధిలో ముద్రితమైపోయింది. ఆమెలో ఒక ఉపశమన భావం కలిగింది. ప్రస్తుతం వార్ధక్యంలో ఉన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా మెహెదీని చూసుకోవడానికి తన సోదరుడు ఉన్నాడనే భరోసా నార్జిస్‌కు కలిగింది. అతడు ఈ పిల్లవాణ్ణి పెంచగలడు. విద్యాబుద్ధులు చెప్పించగలడు. వాడి జీవితానికి మార్గదర్శి కాగలడు.క్షమాభిక్ష కోసం అర్జీపై సంతకం పెట్టమని ఆమె సోదరుడు ఎంతో ఒత్తడి చేశాడు. కానీ నార్జిస్ సుతరామూ ఇష్టపడలేదు. మిలటరీ పాలనలో నేరమేమీ చెయ్యకుండానే కేవలం ఆలోచనా విధానానికే ఉరిశిక్ష విధిస్తారు.అటువంటి స్థితిలో క్షమాభిక్ష అర్థించడం అనవసరమని నార్జిస్ దృఢంగా విశ్వసించింది. అభ్యర్థన సమర్పించడానికి గడువూ ముగిసిపోయింది. ఇప్పుడామె మృత్యు ముఖద్వారం వద్ద వేచి ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చేయూతనిచ్చినట్టు ఆమె తల్లి నార్జిస్ చెయ్యి పట్టుకుంది. నార్జిస్‌కు తన వారితో ఇదే చివరి సమాగమం. ఇక ఈ క్షణంలో వారు విడిపోవడమంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకోవడమే. ఈ క్షణం దుర్భరమైనదీ, అత్యంత దుఃఖభరితమైనదీ. ఈ క్షణంతోనే ఆమెకు అందమూ అనాకారితనమూ, మంచీ చెడూ, ప్రేమా ద్వేషమూ మిళితమై ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోనున్నది. పసివాడు మెహెదీ నవ్వుతూ తన మామతో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఊచల మధ్య నుంచి తల దూర్చి మామని ముద్దు పెట్టుకున్నాడు. తన చిన్ని చేతివేళ్లని అమ్మమ్మ పండు జుత్తులో చొప్పించాడు. ‘‘అమ్మా! ఇక మెహెదీకైనా స్వేచ్ఛ లభిస్తుంది. సంతోషించు. ఈ ఇనుప గొలుసులు, చేతి సంకెళ్లూ, నిర్బంధాలు ఇవే వాడి ప్రపంచమైపోయాయి. వాడూ ఈ బ్యారెక్స్‌లోనే పుట్టాడు. ఇంతవరకు ఇక్కడే పెరిగాడు. ఇక వాడు విడుదలవుతాడు. బడికి వెళ్లగలడు. బజారుకెళ్లగలడు. పార్కులో ఆడుకోగలడు. తమ్ముడూ! ఇక ముందు వీడిని పెంచే బాధ్యత నీదే.’’ ‘‘అక్కా! అక్కా! అలా మాట్లాడకు.’’ అంటూ నార్జిస్ సోదరుడు ఒక్కసారిగా భోరుమన్నాడు. అప్పుడామె మౌనం వహించింది. తల్లి వేదనా సోదరుడి దుఃఖం అర్థమయ్యాయి. కాని ఇతరులకు జీవితాన్ని ఇవ్వడానికి వేరొకరు మరణాన్ని ఆహ్వానించక తప్పదని, వారికి వివరించలేకపోయింది. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలంటే కొన్ని జీవితాలు ఉరికంబానికి బలి చెయ్యక తప్పదని వారికి విశదీకరించలేకపోయింది. నార్జిస్, ఆమె భర్త హుస్సేన్ ఒకేసారి అరెస్టయ్యారు. అప్పటికే ఆమె గర్భిణి. ఇంటరాగేషన్ సమయంలో హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు పుట్టించారు. మిలటరీ నిర్బంధంలో ఇవన్నీ సర్వసాధారణం. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయిన వారి శవాల్ని కుటుంబాలకు అప్పగించరు. కనీసం తెలియజెయ్యరు. మిలటరీ వారే పూడ్చిపెట్టేస్తారు. ఆ హత్యలని ఆత్మహత్యలుగా ప్రచారం చేస్తారు.హుస్సేన్‌పై ఆమెకు గల విశ్వాసం రవ్వంత కూడా చలించలేదు. ఆమెలానే అతడు కూడా అంతరాత్మ గల వ్యక్తి. అటువంటి ఖైదీలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కారు. వారు క్షమాభిక్షనూ అర్థించరు.ఈ చివరిచూపుల పర్వం ముగియగానే నార్జిస్ తల్లి ఒకవిధమైన నిర్వేదంలో పడిపోయింది. సోదరుడు కటకటాల్లోంచే ఆమె చేతిని ముద్దాడాడు. జుత్తు నిమిరాడు. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కాదు, వారైవెళ్లలేదు. వారిని బయటకు తీసుకుపోయారు. నార్జిస్ ఒక్కసారి సోదరుణ్ణి దగ్గరకు తీసుకోవాలనుకుంది. కౌగిలించుకోవాలనుకుంది. కానీ ఇద్దరి మధ్య కఠినాతి కఠినమైన కటకటాలు అడ్డు నిలిచాయి. జైలు నియమాలను మనుషులే తయారు చేస్తారు. కానీ వాటిలో కాస్తంత కూడా మానవత్వం పాలు ఉండదు. తన మామ అటు వెళ్లగానే మెహెదీ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన కథల్లోని లోకాలనూ స్థలాలనూ చూడాలని వాడు కలలు కంటున్నాడు. కానీ అమ్మ ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు. ‘‘నువ్వు రేపు వెళ్దువుగాని నాన్నా! మామయ్య నిన్ను రేపు బయటకు తీసుకెళ్తాడు.’’ అని నెమ్మదిగా అంటూనే నార్జిస్ మెహెదీ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది.జైలు వార్డెన్ మరియమ్ తల్లీ కొడుకుల వైపు ఒక్కసారి చూసింది. తర్వాత చూడలేక తన కళ్లను కిందకు దించుకుంది. ‘ఈమె ఎటువంటి మహిళ? ఉరిశిక్ష రద్దు కోసం క్షమాభిక్ష అర్జీనైనా పెట్టుకోలేదు. రేపు ఉదయం శిక్ష అమలు చేస్తారని తెలిసినా ఒక్క కన్నీటి బొట్టు కూడా విడువలేదు. ఏడవలేదు. భగవంతుడిని తిట్టుకోవడం లేదు. కనీసం జైలరునైనా తూలనాడటం లేదు’ అనుకుంది. నిజానికి నార్జిస్ ఒక విచిత్రమైన మహిళ. ఆమె చేతికి ఖురాన్ ఇచ్చినా, ఆమె దాన్ని కళ్లకు అద్దుకుని పక్కన పెట్టేసింది. తన పిల్లవాడ్నే ముద్దులతో ముంచెత్తింది. మౌల్వీ ప్రార్థన చేయించడానికి వచ్చాడు. సర్వవ్యాపి అయిన దయామయుడైన దేవుడిని తన పాపాలను ప్రక్షాళనం చేయమని కోరమన్నాడు. కాని ఆమె చిన్న చిరునవ్వే నవ్వింది. ఆ చిరునవ్వులో నేనేమీ చెయ్యలేదు అన్న అర్థం దాగి ఉంది. మౌల్వీ అటు వెళ్లగానే ప్రార్థనాసనమైన చాపని దిండు కింద పెట్టుకుంది. తన తలని దిండు మీద పెట్టుకుంది. పసివాడికి కథలు చెప్పడం మొదలుపెట్టింది.మహిళా వార్డులో అనేక రకాలైన నేరాలు ఆరోపించబడిన వారూ, నేరాలు నిరూపించబడిన వారూ ఉన్నారు. కానీ వారెవ్వరూ నార్జిస్‌ను తమతో పాటుగా ఒక దోషి అని పరిగణించలేదు. గత నాలుగేళ్లలో ఈ ‘చెడ్డ’ స్త్రీలంతా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించారు.నార్జిస్ ఎవరి జుత్తు గానీ, ముక్కుగానీ కొయ్యలేదు. ఎవరి పశువుల్నీ సంపదనీ దొంగిలించలేదు. గంజాయిలాంటి మాదకద్రవ్యాలనీ అమ్మలేదు. ఎవర్నీ గాయపరచలేదు. హత్య చెయ్యలేదు. మరి ఇటువంటితీవ్రమైన శిక్షకు ఎందుకు గురి అవుతున్నదో ఆ స్త్రీలెవరికీ అర్థంకావడం లేదు.‘‘బీబీ! మిమ్మల్ని తప్పించలేదా?’’ ‘మృత్యుక్రమం’లోనికి నార్జిస్‌ని మార్చిన కొద్ది రోజుల్లోనే వార్డెన్ మరియమ్ అడిగింది. ‘‘దేని నుంచి తప్పించాలి?’’ నార్జిస్ కంఠంలో ఒక పవిత్రత ధ్వనించింది. ‘‘మరణం నుంచి’’‘‘లేదు. చావు మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో వారు దాని నుంచి తప్పించుకోరు. అంతేకాదు, మెహెదీ ఉన్నాడు.నా తర్వాత వాడు జీవిస్తాడు. నేను వాడిలో జీవిస్తాను. వాడి తర్వాత వాడి పిల్లల్లో జీవిస్తాను.’’ఆ తర్వాత మరియమ్ మరే ప్రశ్నలూ వేయలేదు. ‘మరణ క్రమం’లో ఉన్న బీబీ ఒక గొప్ప తత్వవేత్త అని బ్యారెక్స్‌లో వ్యాపించిపోయింది. మరణం తర్వాత కూడా ఆమె పునరుత్థానం చెందుతుందనీ జీవావిష్కరణ పొందుతుందనీ అందరూ చెప్పుకున్నారు. ఆమెను గొప్ప మనోబలం గల వ్యక్తిగా అందరూ భావించారు. ఆ సంఘటన తర్వాత ఆమె వద్దకు వార్డెన్ ఎవరు వచ్చినా వినయంతో కిందకు చూసి నడుస్తుంటారు. జైలు సూపరింటెండెంట్ వచ్చినా వెంటనే ఆమె గది నుంచి పారిపోతాడు. ప్రతిరోజూ ఆమెనురెండుసార్లు గది నుంచి వెలుపలికి తీసుకు వెళ్లేటప్పుడు ఒక హఠాత్ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వారిలో వ్యాపిస్తుంది. అప్పటి వరకు అరుస్తూ పోట్లాడుకుంటున్న స్త్రీలు కూడా ఒక్కసారిగా మౌనం వహిస్తారు. ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారు. నార్జిస్ ఊర్ధ్వలోకం నుంచి ఊడి వచ్చినట్టుగా గౌరవిస్తారు.ఆ చివరి భోజనం ఒక పండుగ విందు మాదిరిగా జరిగింది. ‘ది లాస్ట్ సప్పర్’ గొప్ప చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ చిత్రపటం ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ భోజనంతో మెహెదీ ఎంతో ఆనందపడిపోయాడు. ‘‘అమ్మా! తిండి బాగుందమ్మా!’’ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేశాడు.‘‘ఔను నాన్నా! నీ మాట నిజం!’’ నార్జిస్ అతడి నోటిలో ముద్ద పెడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూపు మరల్చుకున్నది. ఆమె కన్నీరు ఆ చిన్నవాడి కంటపడటం ఆమెకు ఇష్టం లేదు. రాత్రి అయింది. మెహెదీ నిద్రలో మునిగిపోయాడు. కానీ నార్జిస్ వాడితో గుండె నిండుగా కబుర్లు చెప్పుకోవాలనుకుంది. వాడి మాటలు వినాలనుకుంది. బాగా పొద్దు పోయే వరకు వాడిని మెలకువగా ఉంచాలనుకుంది. ఉదయాన్నే ఆమెను తీసుకుపోవడానికి వారు వచ్చేసరికి వాడు గాఢనిద్రలో మునిగి ఉండాలనుకుంది.నార్జిస్ వాడి కళ్ల వైపు చూసింది. వాడి అందమైన నుదుటి వైపు చూసింది. వాడి కళ్లు హుస్సేన్ కళ్లలా ఉంటాయి. వాడి నుదురు హుస్సేన్ నుదురులాగా విశాలంగా ఉంటుంది. వాడి శరీరం కూడా హుస్సేన్ శరీరపు పరిమళమే వేస్తుంది. ఆ సుగంధంలో పుష్పాల సౌందర్యమూ, అనంతమైనజీవేచ్ఛా ఉంటాయి.హుస్సేన్! ఇప్పుడు ఇక్కడ నువ్వు లేవు. ఇంకా ఎక్కడో ఉన్నావా? భూమ్యాకాశాల మధ్య సంచరిస్తున్నావా? లేక నీ జీవకణాలను పంచుకు పుట్టిన ఈ నీకుమారుడిలోఉన్నావా? నార్జిస్ రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. మెహెదీని ఆప్యాయంగా పెనవేసుకుంది.‘‘అమ్మా! నాకు నిద్రొస్తుంది’’ అన్నాడు మెహెదీ.‘‘నాన్నా! మరికొద్ది సేపే మెలకువగా ఉండు.ఆతర్వాత నిద్రపోదువుగాని. ఇంకాసేపు నాతో మాట్లాడు నాన్నా!’’ నార్జిస్ గొంతులో చిన్న కంపం చోటు చేసుకుంది. ‘‘రేపు మావయ్య నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. కథలు చెబుతాడు. బజార్నీ చూపిస్తాడు.వెళ్తావు కదా!’’‘‘తప్పకుండా వెళ్తావమ్మా! నువ్వు కూడా మాతో బజారుకు వస్తావు కదా!’’ మెహెదీ నిద్ర మరచి కూర్చున్నాడు.‘‘నేను మీతో రాలేను నాన్నా!’’‘‘అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా?’’‘ఉండను నాన్నా! నీకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తాను.’’వరండాలో ఏదో శబ్దం వినబడింది. నార్జిస్ పైకి చూసింది. వార్డెన్ మరియమ్ కటకటాలు పట్టుకొని కబుర్లు చెప్పకొంటున్న తల్లీబిడ్డల వైపు చూస్తోంది. ఆమె అశ్రునయనాలతో ఉంది.‘‘మా అమ్మ రేపు నాకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తోంది’’ అంటూ మెహెదీ ఉత్సాహంగా మరియమ్‌తో చెప్పాడు. వాడెప్పుడూ సీతాకోక చిలుకల్ని చూడలేదు. కాని తల్లి వాడికి వాటిని గురించి చాలా కథలు చెప్పింది. ‘‘ఔను రాజా! నువ్వు మీ అమ్మతో ఎక్కువ సేపు మాట్లాడు. ఆమెకు కుప్పలు తెప్పలుగా కౌగిలింతలూ ముద్దులూ ఇవ్వు’’ మరియమ్ స్వరం బొంగురుపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.‘‘అమ్మానువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తావు కదా!’’‘‘లేదు నాన్నా! సీతాకోక చిలుకలు చాలా వేగంగా ఎగురుతుంటాయి. నేను వాటిని వెంబడిస్తున్న కొద్దీ మరింత దూరం పోతుంటాయి. కాబట్టి వాటి కోసం నేను చాలా చాలా దూరం పోతాను.’’‘‘అమ్మా! నువ్వు ఎలాంటి సీతాకోకచిలుకల కోసం చూస్తావు?’’నార్జిస్ ఒక్క క్షణం ఆగింది. ‘‘నేనా? స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే సీతాకోక చిలుకల కోసం చూస్తాను నాన్నా!’’ ఆమె కుమారుడి జుత్తుని ముద్దుపెట్టుకుంది.నిజానికి వాడికి ఆ మాటలకు అర్థం తెలీదు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏ రంగులో ఉంటాయమ్మా!’’‘‘హరివిల్లుకుండే అన్ని రంగుల్లోనూ ఉంటాయి.’’‘‘హరివిల్లు ఎలా ఉంటుంది?’’‘‘ఈసారి వర్షం కురిసినప్పుడు హరివిల్లుని చూపించమని మావయ్యని అడుగు.’’‘‘అప్పుడు నేను కూడా హరివిల్లు రంగుల సీతాకోక చిలుకల కోసం వెళ్తాను.’’‘‘నువ్వు వెళ్లొద్దు నాన్నా! ఆ సీతాకోక చిలుకలు వాటికవే నీ వద్దకు వస్తాయి. నేను వాటి కోసమే పైకి వెళ్లి వెతుకుతాను. కాబట్టి మరి నువ్వు వెళ్లనవసరం లేదు.’’ నార్జిస్‌లో చిన్న వొణుకు ప్రారంభమైంది. మనఃపూర్వకంగా తీవ్రమైన అనురాగంతో మెహెదీ మురికిపట్టని మెడని గట్టిగా ముద్దుపెట్టుకుంది.ఈ వారంలో మొదటిసారిగా ఆమె కన్నుల్లో నీరు ఉబికి ప్రవహించసాగింది. మెహెదీ నిద్రపోయిన తర్వాత నార్జిస్ వాడిని పైకి ఎత్తి తన గుండెపై పడుకోబెట్టుకుంది. వాడిలో ఆమెకొక ఆశాకిరణం కనబడింది. ఈ ఆశే ఆమెలో హిమాలయమంత ఎత్తుకు ఎగురుతోంది. భవిష్యత్తులో తన జీవ చైతన్యాన్ని వాడు కొనసాగించగలడని, ఒక ఆవిష్కరణా భావం ఆమెకు కలుగుతోంది.చుట్టుపక్కల బ్యారెక్స్ నుంచి ప్రార్థనా గీతాలు వినిపించడం మొదలైంది. ఎవరో ఒకామె ‘నూరా రెహమాన్’ అంటూ శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈ రోజు బీబీ శాశ్వత నిష్క్రమణం అని వారికి తెలుసు. అందకోసమే ఈ సన్నద్ధత.నార్జిస్ గుండెలో ఏదో పోటు మొదలైంది. జైలు ప్రధాన ద్వారం వెలుపల తన సోదరుడు మట్టిలో ధూళిలో కూర్చుని వేచి ఉంటాడు. అతడు స్టాటిస్టిక్స్‌లో పెద్ద డిగ్రీ తీసుకున్నాడు. కాని ఆ గణిత జ్ఞానంతో తన అక్క అస్తమయానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలను లెక్కించవలసి వస్తుందని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. తమ తల్లి కన్న ఇద్దరిలో తనొక్కడే మిగిలిపోతాడని భావించి ఉండడు. తన మేనల్లుణ్ణి పెంచి పెద్దచేసే బరువు బాధ్యతలు తన మీదనే పడతాయని యోచించి ఉండడు.నార్జిస్ మనస్సులో చాలా ముఖాలు, ప్రియమైనవీ అప్రియమైనవీ, దయగలవీ క్రూరమైనవీ, బాగా పరిచయమైనవీ కానివీ పరిభ్రమించసాగాయి. తన అంతిమయాత్ర బాధారహితంగా సాగడానికి తమ నిద్రను త్యాగం చేసి ప్రార్థనాగీతాలను ఆలపిస్తున్న వారి పట్ల ఆపుకోలేని ప్రేమాభిమానాలు కలిగాయి. వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది. ఆయా గొంతుల వారితో ఒక వారం క్రితం తనకు కలిసే ఉండేది. కాని వారెప్పుడూ తనని అర్థం చేసుకోలేదు. అంతేకాదు, వారికి తన గురించి ఏమీ తెలీదు. క్షమాభిక్ష కోసం అర్థించే గడువు దాటిన తర్వాత ఆ వార్త బయటికి పొక్కింది. జైలు అధికారులు ఆమెను బ్యారెక్స్ నుంచి ‘మరణక్రమం’లోనికి మార్చడానికి వచ్చారు. పరిసరాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. నార్జిస్‌తో పాటు మెహెదీ కూడా బ్యారెక్స్‌ని వీడేటప్పుడు కొందరు స్త్రీలు తలలు వంచుకుని కళ్లు తుడుచుకోవడం ఆమెకు కనపడింది. ఈ స్త్రీల ఏ చిన్న గడబిడ సన్నివేశానికైనా ఒకర్నొకరు తిట్టుకుంటారు. దుస్తులు చించుకుంటారు. దాంతో వారిని మ్యాట్రన్, వార్డెన్ బలవంతంగా విడదీస్తుంటారు. ఈరోజు వారి ప్రవర్తన భిన్నంగా ఉంది.నార్జిస్‌కు ఒక తాత్కాలికమైన నిద్రమత్తు వంటిది ఆవహించింది.ఆమె హృదయం కృంగిపోనారంభించింది. గుండె ఒక తీవ్రమైన అనునాదంతో కొట్టుకుంటోంది. ఈ హృదయ స్పందనే మృత్యు ముఖద్వారం వద్ద ఆమె ఘనవిజయంగా నిలుస్తుంది. ఆమె మరణం తర్వాత జీవిస్తుందా? మరి జీవచైతన్యం అంటే ఏమిటి? శరీరాన్ని వీడిన తర్వాత అది ఎక్కడకు పోతుంది? హుస్సేన్ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. లేనే లేడు. అంతా సర్వనాశనమైంది. నాశనమంటే అర్థమేమిటి? ఆ మాటకు భాషాపరమైన అర్థం మాత్రమే ఆమెకు తెలుసు. మరికొద్ది సేపట్లో తనే ఆ అనుభవాన్ని పొందనుంది.‘‘బీబీ’’ మరియమ్ కటకటాల వద్దకు వచ్చి మృదువుగా పిలిచింది. ‘‘చెప్పమ్మా!’’‘‘బీబీ! ఆ చిన్నరాజుని పరుపు మీదనే ఉంచండి. వాళ్లు వచ్చేస్తున్నారు.’’ మరియమ్ మాట తడబడుతోంది.ఒక్క క్షణం నార్జిస్‌కు తన పాదాల కింద నేల ప్రకంపిస్తున్నట్లు అనిపించింది. కానీ నిలదొక్కుకుంది. తన మెడ చుట్టూ ఉన్న మెహెదీ చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంది. వాడిని ఆ కఠినమైన పరుపు మీదనే వదిలి పెట్టింది. ‘వాడు నా ముఖాన్ని గుర్తుంచుకోలేడు. వాడి జ్ఞాపకాలలో కేవలంనా పేరు, నా ఊహ, నా స్మృతి మాత్రమే మిగులుతాయి.’‘‘నన్ను క్షమించండి బీబీ! కటకటాలకు తాళాలు వేసి తీసే నా ఈ చేతులే నాకు తిండి పెడుతున్నాయి.’ మరియమ్ ఊచలపై తలపెట్టుకునిఏడవనారంభించింది.నార్జిస్ నులక మంచం మీద నుంచి లేచింది. కటకటాల్లోంచి మరియమ్ భుజాల మీద చేతులేసింది. మాటలకు నిర్వచనాలు లేవు.బరువైన అడుగుల చప్పుడు వినపడింది. నార్జిస్ మరియమ్ మోచేతిని నెమ్మదిగా తట్టింది. మరియమ్ తలెత్తి తన కన్నీటి తెరలలోంచే నార్జిస్‌ను చూసింది. తన కళ్లని తెల్లని మస్లిన్ దుపట్టాతోతుడుచుకుంది. ‘ఎటెన్షన్’లో నిలబడింది.తాళంలో చెవిని తిప్పి వీలైనంత నెమ్మదిగా తలుపు తెరిచింది. జైలు సూపరింటెండెంటు ఇనుప తలుపుని గట్టిగా గోడకు తగిలి పెద్దగా ధ్వని వచ్చేటట్టు తీశాడు.‘‘సర్! పిల్లవాడు నిద్రపోతున్నాడు. మేల్కొనగలడు’’ మరియమ్ నమ్రంగానే అంది. ‘‘నోర్ముయ్యి! వాడు నీ పిల్లవాడు కాడు’’ సూపరింటెండెంట్ అసహనంతో అన్నాడు.‘‘సర్! బిగ్గరగా మాట్లాడవద్దు. ప్లీజ్’’ యువ మేజిస్ట్రేట్ నిద్రపోతున్న మెహెదీ వైపు చూస్తూ, కనుబొమలు తుడుచుకుంటూ అన్నాడు.సూపరింటెండెంట్ భృకుటి ముడివేస్తూ చిరాగ్గా చూశాడు. ‘ఈ కొత్త ఆఫీసర్లు తమ గురించి ఏమనుకుంటారు?’ అనుకుంటూ పొంగి వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు. తన అధికారిక విధానాన్ని మెదలుపెట్టాడు. మొదట నార్జిస్‌ని ఫొటోతోనూ పుట్టుమచ్చలతోనూ సరిపోల్చి గుర్తించాడు. యధావిధిగా ఒక పత్రాన్ని తెరిచి, దాన్ని బిగ్గరగా చదివాడు: ‘‘నేను.. క్షేమకరుడూ.. దయామయుడూ అయిన అల్లా పేరున ప్రారంభిస్తున్నాను..’ అని మొదలుపెట్టి ఇలా ముగించాడు. ‘‘మరణం ధ్రువీకరించబడేంత వరకు నేరస్తురాలిని ఉరితియ్యాలి.’’మెడికల్ ఆఫీసర్ ముందుకు వచ్చాడు. నార్జిస్ నాడినీ, గుండె కొట్టుకోవడాన్నీ పరీక్షించాడు. నిశ్శబ్దంగా తల ఊపాడు. సూపరింటెండెంట్ అతని చేత కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించాడు. యువ మేజిస్ట్రేట్ ఆ సంతకాలను ధ్రువీకరించాడు. సూపరింటెండెంట్ గదిని విడిచి వెళ్లాడు.డిప్యూటీ సూపరింటెండెంట్ మరియమ్‌కు సంజ్ఞ చేశాడు. ఆమె ముఖం కంచులా కఠినంగా ఉన్నట్లనిపించింది. ఆమె కళ్లు నేలవైపు చూస్తున్నాయి. నార్జిస్ చేతుల్ని వెనక్కు వంచి ఒక చర్మపు తాటితో కట్టింది. మరియమ్ వేళ్ల వెచ్చదనం నార్జిస్‌కు తగిలింది. ఆమె ఒంటరిగా లేదు. లోపలా బయటా చాలామందే ఉన్నారు.సాయుధులైన రక్షకులు బ్యారెక్స్‌ని ఈసరికే కాపలా కాస్తుంటారు ప్రధాన ద్వారం వద్ద పన్నెండు మంది వార్డెన్లు ఈసరికే వారి వారి స్థానాల్లో ఉంటారు ప్రతివారి తుపాకీలోనూ పది బుల్లెట్లు ఉంటాయి నార్జిస్ సోదరుడు జైలు గోడల వెలుపల బయలులో కూర్చొని ఉంటాడు. నార్జిస్‌కు మెహెదీ ముఖం కనపడుతోంది. ఆమె వాడినే కన్నార్పకుండా చూస్తోంది. మేట్రన్ నుంచి సంజ్ఞ అందుకుని మరియమ్, నార్జిస్‌ను ‘‘పద బీబీ’’ అంది.నార్జిస్ ఒక్క అడుగు ముందుకు వేసింది వెనక్కు తిరిగి మెహెదీ వైపు చూసింది. వాడు నిద్రలోనే కదిలాడు. చిన్నగా మూలిగాడు వాడికేదో పీడకల వచ్చి ఉంటుంది. నార్జిస్ గుండెను ఏదో పిండేసినట్లయింది. ఆమె తన కళ్లలో ఉబుకుతున్న కన్నీటిని అతి ప్రయాస మీద ఆపుకుంది. ఆమె తన ఆశల్నీ తనవంటి వారి ఆశయాల్నీ భగ్నం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వారి ముందుంది. కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. ఈ చివరి క్షణాల్లో తాము గెలిచిన సంతృప్తి వారికెందుకివ్వాలి?యువ మేజిస్ట్రేట్ కళ్లు ఆమె దృష్టిని వెంబడించాయి. ‘‘ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు?’’ అని మేట్రన్‌ని అడిగాడు. నార్జిస్‌కు తన ఊపిరి తోడివేసినట్లయింది. తన సోదరుణ్ణి అగ్నిపరీక్షకు గురిచేస్తోంది.మేజిస్ట్రేట్ కనుబొమలు ముడిపడ్డాయి. నార్జిస్ వైపు పరీక్షగా చూశాడు. వరండాలో ఉన్న వార్డెన్‌ను పిలిచాడు. ‘‘సర్’’ అంటూ వార్డెన్ ముందుకొచ్చాడు.‘‘ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా ఎత్తుకో’’ అన్నాడు.‘‘సర్. నేను వాడిని ఎత్తుకోవచ్చా?’’ అంది మరియమ్.‘‘సరే, వాణ్ణి బీబీతో పాటు అక్కడి వరకు తీసుకురా...’’‘‘కానీ, సర్! జైలు మాన్యువల్ అందుకు అంగీకరించదు’’ డిప్యూటీ సూపరింటెండెంట్ కలగజేసుకున్నాడు.‘‘నీ జైలు మాన్యువల్ తగలబెట్టు’’ అంటూ యువ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మరియమ్ ముందుకొచ్చి మెహెదీని ఎత్తుకుంది. వాడు కదిలాడు. త్వరలోనే తిరిగి గాఢనిద్రలోకి జారుకున్నాడు.డిప్యూటీ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉరి ఖైదీ బిడారు బయల్దేరింది. ఇద్దరు పోలీసులు దారి చూపుతున్నారు. మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. నార్జిస్ మధ్యలో ఉంది. ఆమెకు కుడివైపున ఒక వార్డెన్, రెండోవైపున మరియమ్ ఉన్నారు. మరియమ్ భుజాన మెహెదీ ఉన్నాడు.నార్జిస్ చూపు మెహెదీపై స్థిరంగా ఉంది. అందరూ ముందుకు నడిచారు. ఆరుబయట అందమైన చల్లని రాత్రి నిష్క్రమించనుంది. నింగీనేలా కలసిన సుదూర తీరంలో ఉదయభానుడు ప్రభవించనున్నాడు. వెలిసిపోతున్న వెన్నెలలో వధ్యశిలా వేదిక నార్జిస్ కంటబడింది. పైకి దారితీసే మెట్లు కూడా స్పష్టంగా కనపడసాగాయి. మరణం భూమి లోతుల్లోనికి కృంగిపోతోంది. అధఃపాతాళాన్ని చేరడానికి పైవైపు మెట్లని ఎందుకెక్కాలో ఆమెకు అర్థం కాలేదు. ఉరిశిక్ష అమలు చేసే తలారివైపు చూసింది. అతడి పిల్లలు ఈరోజు ఉరివల్ల తండ్రి తెచ్చిన రాబడితో సంతోషిస్తారు. ఒక ఉరికి పది రూపాయలు చెల్లిస్తారు. నిజంగా అది వారికి ఎక్కువ మొత్తమే. ఆ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు.‘‘మరియమ్!’’ నార్జిస్ గొంతు ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక మెరుపులా మెరిసింది. ‘‘బీబీ! మీ సేవలోనే ఉన్నాను.’’ వార్డెన్ మరియమ్ గొంతు కన్నీటితో గద్గదమైంది.ఇక్కడ ఈ స్థితిలో యజమాని ఎవరో, సేవకులెవరో చెప్పడం కష్టం. మృత్యువు అందర్నీ ఒకే పంక్తిలో నిలుపుతుంది. నార్జిస్ మరియమ్‌ను దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసింది. మరియమ్ ముందుకు వంగింది. ఆమె భుజం మీద నిద్రపోతున్న మెహెదీ ఉన్నాడు. నార్జిస్ బంధనాలున్న చేతులతోనే మెహెదీని తాకే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతలోనే ఆగిపోయింది.మెహెదీ నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. బహుశా దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడు. నార్జిస్ తన జీవనఫలం, తన ప్రతిమ అయిన మెహెదీ వైపు నీరు నిండిన కళ్లతో చూసింది. వాడి నుదుటినీ, బుగ్గల్నీ ముద్దాడటానికి వంగింది.ఒక జీవితం మరో జీవితానికి వీడ్కోలు చెబుతోంది. నార్జిస్ వధ్య శిల మెట్లు ఎక్కింది. తలారి ఆమె ముందు వంగాడు. ఆమె కాళ్లను బంధించాడు. ఆమె ఛిద్రమవుతున్న ప్రపంచ దృశ్యాన్ని కడసారి చూపు చూసింది. దాన్ని మనసులోనే పదిలపరచుకుంది.కళ్లు మూసుకుంది. ఆ దృశ్యం ఆమెలో ముద్రించబడింది.చంద్రుడు అస్తమించిపోతున్నాడని ఆమెకు తెలుస్తోంది. ధ్రువనక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తోందని తెలుస్తోంది. మెహెదీ దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడని తెలుస్తోంది. సూర్యుడు ఉదయించబోతున్నాడని తెలుస్తోంది.దేవుడి పవిత్రమైన పేరు మీద నిర్దేశించబడిన నిర్ణయం అమలు కాబోయే క్షణం ఆసన్నమైంది. ఉర్దూ మూలం : జహీదా హీనా, పాకిస్తాన్ అనువాదం: టి.షణ్ముఖరావు -
దుబాయ్ వీధుల్లో దుర్భర జీవితం
దుబాయ్ నుంచి జనార్దన్‌రెడ్డి : ఎడారి దేశం దుబాయ్‌లో తెలంగాణ జిల్లాల కార్మికులు కొందరు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కల్లివెల్లి కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని ఇంటికి చేరుకోవాలంటే తమకు మొదట్లో వీసా జారీ చేసిన కంపెనీలకు వలస కార్మికులు జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించే స్థోమత లేక ఎంతో మంది కార్మికులు ఇంటికి చేరుకోలేకపోతున్నారు. వలస కార్మికులు నివాసం ఉన్న చోట ఉండాలంటే గదికి అద్దె, భోజనానికి కొంత పైకం చెల్లించాలి. అయితే.. చేతిలో చిల్లిగవ్వ లేక బల్దియా పార్కులు, ట్రక్కుల మెకానిక్ షెడ్లను ఆవాసంగా మార్చుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. కొందరు కార్మికులైతే నిలచి ఉన్న ట్రక్కుల పైభాగంలో సేద తీరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఇంటికి వెళ్లడానికి ఔట్‌పాస్ కోసం 500 ధరమ్స్ నుంచి 1,000 ధరమ్స్ వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంది. మన కరెన్సీలో రూ.7,500 నుంచి రూ.19 వేల వరకు అన్నమాట. కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లిస్తేనే వారికి గతంలో వీసా జారీ చేసిన కంపెనీలు ఔట్‌పాస్ జారీకి ఆమోదం తెలుపుతాయి. అయితే.. క్షమాభిక్ష కార్మికులకు విమాన టిక్కెట్లను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ.. కార్మికులు చెల్లించాల్సిన జరిమానా విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేక పోయింది. నిబంధనలు సవరిస్తేనే కార్మికులకు విముక్తి యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు జరిమానా చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం విమాన టికెట్లు ఉచితంగా పంపిణీ చేయడానికి విమానయాన సంస్థలకు చెక్కు రూపంలో చెల్లింపులు జరిపారు. అయితే.. కల్లివెల్లి కార్మికులు చెల్లించే జరిమానాలకు నగదు రూపంలో ప్రభుత్వం సహాయం అందించాల్సి ఉంది. కానీ.. నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులకు అనుమతి లేదని ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి చిట్టిబాబు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యూఏఈలో కల్లివెల్లి కార్మికులు జరిమానా చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సి ఉంది. గల్ఫ్‌లో పని చేసి ఇంటికి డబ్బులు పంపించాల్సింది పోయి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులు చేసి దుబాయ్‌కి ఎంతో ఆశతో వచ్చిన తాము నిరాశతో వెనుదిరుగుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలను సవరించి కార్మికుల తరఫున జరిమానాను చెల్లించడానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎండలో ఎండుతూ.. చలికి వణుకుతూ.. పార్కులు, ట్రక్కులు, షెడ్లలో తలదాచుకుంటున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పగటి పూట ఎండ వేడిమికి, రాత్రిపూట చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. కాగా.. బయట ఉంటున్న వారిపై కొందరు విదేశీ వ్యక్తులు ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన దుండగులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల వద్ద ఉన్న బ్యాగులను దుండగులు అపహరిస్తున్నారు. దీంతో కార్మికులు ఆదమరిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనాలు ఏర్పాటు చేసిన నర్సింలు యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోవాలనుకునే కార్మికులకు మెదక్ జిల్లాకు చెందిన గుండేటి నర్సింలు అందించిన సహకారం ఎంతో ఉంది. ఒకప్పుడు కల్లివెల్లి కార్మికునిగా దుబాయ్‌లో పనిచేసిన నర్సింలు ఇప్పుడు ఒక కంపెనీకి యజమాని అయ్యాడు. కార్మికుల కష్టాలను గుర్తెరిగిన ఆయన.. వారి కష్టాలను తన కష్టాలుగా భావించి తన కంపెనీ వాహనాలను క్షమాభిక్ష కార్మికుల కోసం వినియోగించాడు. క్షమాభిక్ష పొందిన కార్మికులు లేబర్ క్యాంపుల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి నర్సింలు వాహనాలను తిప్పాడు. అంతేకాక రాయబార కార్యాలయంలో కార్మికులకు అవసరమైన సేవలను అందించాడు. కార్మికులకు ఎన్నో విధాలుగా సేవలు అందించిన నర్సింలును అందరూ అభినందిస్తున్నారు. 84 మందికి విముక్తి కలిగించాం యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకున్న 84 మంది కార్మికులను రెండు దశల్లో ఇంటికి చేర్పించాం. కొంత మంది కార్మికులు స్వచ్ఛందంగానే ఇంటికి చేరుకున్నారు. మరికొంత మందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాం. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కేటీఆర్‌కు విన్నవించాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. –కొటపాటి నర్సింహానాయుడు, ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి -
‘యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోండి’
సాక్షి, హైదరాబాద్: యూఏఈలో ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నారై, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గల్ఫ్ ప్రవాసీయులకు ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారని మంత్రి తెలిపారు. గల్ఫ్‌లో అక్రమంగా నివాసముంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవడం, ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మళ్లీ కావాంటే వీరు రెండేళ్ల నిషేధం తర్వాత చట్టబద్ధంగా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్షమాభిక్ష సంద ర్భంగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను కేటీఆర్ ఆదే శించారు. ఎన్నారై శాఖ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్‌లైన్ నం బర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్‌డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
13 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారం నుంచి 13 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. వీరంతా క్షమాభిక్షపై కొద్ది రోజుల్లో విడుదల కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శుక్రవారం సాయంత్రం విశాఖ కేంద్రకారాగారం అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడి నుంచి 13 మంది జీవిత ఖైదీలు విడుదల కానున్నారని జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నట్లు చెప్పారు. అయితే వీరిని ఎప్పుడు విడుదల చేయాలో అనే తేదీ ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది జనవరిలో క్షమాభిక్ష జీవో విడుదలైందన్నారు. దానిలో నిబంధనలు ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలతో కూడిన జాబితాను జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఆ జాబితాను స్క్రూటినీ చేసిన అనంతరం వారిలో 13 మందిని అర్హులుగా గుర్తించారని చెప్పారు. ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ ఖైదీలు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఖైదీలకు క్షమాభిక్ష
ఉగాది పర్వదినం జీవిత ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు సత్ప్రవర్తన పేరుతో క్షమాభిక్ష పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీఓ ద్వారా ఉత్తర్వులు ఇచ్చేందుకు మార్గం సుగమం చేశారు. జిల్లా జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 17 మంది స్వేచ్ఛావాయువులు పీల్చనున్నారు. వీరిలో ఒక మహిళా ఖైదీ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల, మంత్రుల లాబీయింగ్‌తో మొద్దు శీను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లెల ఓం ప్రకాష్ పేరు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కారాగారాల్లో జీవితఖైదు అనుభవిస్తూ సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ఈ ఏడాది జనవరి 23వ తేదీన మార్గదర్శకాల (జీఓ నంబర్ 8)ను ప్రభుత్వం జారీచేసింది. వీటిని అనుసరించి జిల్లా కేంద్రకారాగార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్ 17 మందితో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. జాబితాను పరిశీలించిన హైలెవల్ కమిటీ 17మంది ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అయితే జాబితా గణతంత్ర దినోత్సవ సమయంలో ఆమోదం పొందినా పలు సాంకేతిక కారణాలతో విడుదల కాలేదు. అధికారపార్టీ ఒత్తిడితో ఓంప్రకాష్ విడుదల రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మొద్దుశీను హత్యకేసులో నిందితుడు మల్లెల ఓంప్రకాష్ క్షమాభిక్ష పొందిన ఖైదీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. 2008 నవంబర్ 9వ తేదీన అనంతపురం జైలులో టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి శ్రీనివాసులురెడ్డి అలియాస్ మొద్దు శీనును ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్‌తో కొట్టి హత్యచేసిన విషయం విదితమే. దీంతో జైలు అధికారులు ఆయనను అక్కడ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014మే 18న ఆయన్ను నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటినుంచి ఓం ప్రకాష్ జిల్లా కేంద్రకారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఆయన విడుదలకు రాష్ట్ర మంత్రితో పాటు అధికారపార్టీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఓంప్రకాష్ విడుదలకు మార్గం సుగమమైంది. విడుదలయ్యే వారి జాబితా ఇదే.. 2016 జనవరి 26వ తేదీన జిల్లా కేంద్రకారాగారంలోని 22 మందిని, కడప నుంచి వచ్చిన ఎనిమిది మందిని మొత్తం 30 మంది ఖైదీలను విడుదల చేశారు. రెండేళ్ల అనంతరం తిరిగి సత్ప్రవర్తన కల్గిన జీవితఖైదీలను విడుదల చేసేందుకు జైళ్లశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 17మంది ఖైదీలు జిల్లా కేంద్రకారాగారం నుంచి విడుదల కానున్నారు. తాజాగా ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాలో 17మందిలో ఒక మహిళాఖైదీ ఉన్నారు. 2013లో విడుదలకు నోచుకోని ఓ జీవితఖైదీ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో కోర్టు విడుదలకు ఆదేశాలు జారీచేసింది. టి.సురేష్, వి.నరసింహ, జి.శ్రీనివాసులు, ఎం.మల్లికార్జున, ఐ.సుబ్బారావు, ఎం.ఓంప్రకాష్, ఆర్.సుధాకర్‌రెడ్డి, టి.నారాయణరెడ్డి, పి.విజయశేఖర్‌రాజు, ఎస్.శ్రీను అలియాస్ శ్రీనివాస్ అలియాస్ సన్నికాంతి, ఎన్.చిన్నబ్బాయి, డి.గొట్టం వీరన్న, డి. చిన్నవీరన్న, షేక్ చిన్న మౌలాలి, జి.శ్రీను అలియాస్ దొంగ శ్రీను, ఎం.మంజుల, పి.సుబ్బారావు విడుదలఅయ్యే వారి జాబితాలో ఉన్నారు. -
మంత్రికి వైఎస్ఆర్సీపీ సభ్యుల వినతి పత్రం
కువైట్ : వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారికి ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్రకు వినతి పత్రం అందించారు. కువైట్ ప్రభుత్వం జనవరి 29న ఆఖమా లేని వారు ఏజంట్ల చేతిలో మోసపోయి పాస్ పోర్ట్ లేనివారిపై ఎటువంటి కేసులు, జరిమానా లేకుండా వెళ్లి మళ్ళి కొత్త వీసాలకు అవకాశం కల్పించింది. దీంతో కువైట్‌లో ఉన్న తొమ్మిది వేల మంది అభాగ్యులు ఏడు సంవత్సరాల తరవాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు. వారిలో టికెట్లకు డబ్బులు లేక అవస్ధలు పడుతున్న అభాగ్యలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి అభాగ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో పత్రిక ముఖంగా గల్ఫ్, కువైట్ ప్రతినిధులు ఏపీఎన్ఆర్టీ, ప్రభుత్వం పై విమర్శించగా ఎట్టకేలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్ఆర్ఐ మంత్రి కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు చైర్పర్సన్ వేమూరి రవి ఈ నెల 20న కువైట్ విచ్చేసిన సందర్బంగా తెలుగు వారి తరుపున వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తెలుగువారి కష్టాలపైన వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. క్షమాబిక్ష సమయంలో ఇండియా వచ్చిన అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ఇక్కడ నుంచి వెళ్లే పేద వారిని ప్రభుత్వ తరుపున టికెట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే మన తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు దిగేటట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనవి చేశారు. కో కన్వినర్లు గోవిందు నాగరాజు ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో పని చేస్తున్నపుడు అకస్మాత్తుగా మరణించిన వారి పార్ధవ శరీరాన్ని భారత దేశం లోని విమానాశ్రయం తమ స్వస్థలికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కువైట్ వచ్చిన పేద బడుగు వర్గాల వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను రద్దు చేయవద్దని కోరారు. ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిది మాట్లాడుతూ.. కువైట్ ప్రమాదంలో మరణించిన వారికీ, ప్రమాదంలో వికలాంగులు అయిన వారికీ భీమా ద్వారా ఆదుకోవాలన్నారు. దొంగ ఏజంట్ల నుంచి అమాయక ప్రజలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు అబుతురాబ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ విభాగం లీడర్ రమణ యాదవ్, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, ఎస్సీ, ఎస్టీ విభాగం బీఎస్ సింహ, పిడుగు సుబ్బారెడ్డి, షేఖ్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీల్లో చిగురించిన ఆశలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): అర్థరాత్రి క్షమాభిక్ష గంట మోగింది. ఖైదీల్లో ఆశలు చిగురింపజేసింది. ఎన్నో ఏళ్లుగా నాలుగు గోడల నడుమ మగ్గుతున్న ఖైదీలు కొందరు బయటపడే మార్గం సుగమమైంది. దీంతో వారిలో ఆనందం వెల్లువిరుస్తోంది. కారాగారాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్షపై విడదుల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మంగళవారం తీసుకొంది. అందులో భాగంగా అదేరోజు రాత్రి జీవో నంబరు 8ని విడుదల చేసింది. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారం జైళ్లలో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధంచేసి జైల్ అధికారులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. 14 మంది అర్హులతో జాబితా జీవో నంబరు 8లోని నిబంధనల ప్రకారం విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలలో అర్హుల జాబితాను అధికారులు బుధవారం సిద్ధం చేశారు. ప్రభుత్వం విడదుల చేసిన జోవో ప్రకారం ఈ నెల 26 నాటికి అర్హులైన సత్ప్రవర్తన కలిగిన 14 మంది జాబితా సిద్ధం చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు ఎక్కువమందికాగా అనంతపురం, కర్నూలుకు చెందిన ఇద్దరు ఖైదీలున్నట్లు చెప్పారు. వారిలో విశాఖకు చెందిన ఓ మహిళ విడుదలకు అర్హులైనట్లు వివరించారు. ఈ జాబితా ఇక్కడ రెండుసార్లు స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి పంపిస్తామని, అక్కడ స్క్రీనింగ్ జరిగిన అనంతరం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తారన్నారు. వారు మరో రెండుసార్లు ఈ జాబితాను స్క్రీనింగ్ చేసిన అనంతరం అర్హులను ప్రకటిస్తారని తెలిపారు. అంతవరకు ఈ జాబితా గోప్యంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ఖైదీలు ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను ఫిబ్రవరి 2న జైళ్లశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఇవీ నిబంధనలు ♦ పురుషులు రిమాండ్‌తో పాటు ఏడేళ్లు వాస్తవ జైలు శిక్ష, మరో మూడేళ్లు రెమిషన్ పీరియడ్‌తో కలసి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ మహిళలు రిమాండ్‌తో పాటు ఐదేళ్లు శిక్ష అనుభవించి రెండేళ్లపాటు రెమిషన్ పీరియడ్‌తో కలిసి మొత్తం ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వెసులుబాటు ఉంది. వారిలో పురుషులకు, మహిళలకు ఒకే విధంగా ఐదేళ్లు శిక్ష, మరో రెండేళ్లు రెమిషన్‌తో కలిపి ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడినవారు అనర్హులు. (పదేళ్ల తర్వాత వీరు విడుదలవుతారు.) ♦ ఐపీసీ 379 నుంచి 402 సెక్షన్లపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, కింది కోర్టులో శిక్షపడి పై కోర్టుకు వెళ్లడం ద్వారా శిక్ష తగ్గిన వారు, ఉరి శిక్ష పడి రాష్ట్రపతిచే శిక్ష మార్చబడినవారు అనర్హులు. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్నుడు క్షమాభిక్ష జీవో విడుదలైంది. 2015 మార్చి 15న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీని ప్రకారం 2016 జూన్‌లో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 41 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి కాలుపెట్టారు. 2013 డిసెంబరు 21న క్షమాభిక్షపై ఇక్కడి నుంచి 37 మంది ఖైదీలను విడుదల చేశారు. వారిలో ఇద్దరు మహిళా ఖైదీలున్నారు. దీంతోపాటు 2009 జనవరి 26న 25 మంది ఖైదీలు విడుదలయ్యారు. రెమిషన్ అంటే... సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు కొన్ని రోజులు శిక్ష పొందినట్లు కలుస్తాయి. ఇలాంటి ఖైదీలకు నెలకు 5 రోజులు చొప్పున కలుస్తాయి(ఏడాదిలో 60 రోజులు). దీంతోపాటు జైలు ఉన్నతాధికారి దృష్టిలో ఉత్తముడుగా గుర్తింపు పొందిన ఖైదీలకు ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇవి కాకుండా రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సైతం ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇలా పొందిన రోజులనే రెమిషన్ పీరియడ్‌గా లెక్కిస్తారు. ఈ కాలాన్ని ఖైదీ శిక్ష అనుభవించిన కాలానికి జతచేస్తారు. ఇలా రెమిషన్ పీరియడ్ పురుషులకు మూడేళ్లు, మహిళలకు రెండేళ్లు ఉంటే క్షమాభిక్షకు ఉపయోగపడుతుంది. -
సౌదీలోని కార్మికులకు క్షమాభిక్ష
ఈనెల 29 నుంచి జూలై ఒకటి వరకు అమలు అతిక్రమిస్తే జైలుశిక్ష, భారీగా జరిమానా రాయికల్(జగిత్యాల): సౌదీలో అక్రమంగా.. ఎలాంటి భతాకా లేకుండా ఉంటున్న కార్మికులకు అక్కడి రాజు క్షమాభిక్ష ప్రకటించారు. మార్చి 29 నుంచి జూలై 1 వరకు అమలులో ఉండేలా ఆమ్నెస్టీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సౌదీలో దొంగచాటుగా ఉంటూ పని చేసుకుంటున్న వారు.. ఎలాంటి భతాకా(గుర్తింపు) లేకుండా ఉంటున్న వారు ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా ఇంటికి రావచ్చు. సౌదీలో ఆరు లక్షల మంది భారతీయులు ఉండగా సుమారు రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు దమామ్, జిద్దా, రియాజ్ వంటి ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఇందులో చాలా మంది వివిధ కారణాలతో వీసాలో ఉన్న పనికాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరికొందరు ఏజెంట్ల మోసాలతో విజిట్ వీసాలపై వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. ఇంటికి తిరిగి రాలేని పరిస్థితుల్లో దొరికిన పని చేసుకుంటూ దొంగచాటుగా ఉంటున్నారు. కొంత కాలంగా సౌదీ పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేసి, జైళ్లలో వేస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ రాజు ఆమ్నెస్టీ చట్టం తీసుకురా వడంతో కార్మికులకు నిజంగా శుభవార్తే. జూలై ఒకటి తర్వాత కూడా కార్మికులు ఎలాంటి అనుమతులు లేకుండా పనిచేస్తే రెండు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు సౌదీకి చెందిన లక్ష రియాళ్లు వంటి జరిమానా విధించారు. కార్మికులతో పాటు పనిక ల్పించే యజమానులకు సైతం ఈ శిక్ష విధించను న్నారు. సౌదీ రాజు తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని విని యోగించుకొని.. అక్రమంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటున్న వారు స్వదేశానికి తిరిగి రావా లని ప్రవాస తెలంగాణ సంఘాలు కోరుతున్నాయి. -
నెలరోజుల్లో క్షమాభిక్ష తెచ్చుకో..!
ఆర్మూర్: ‘నెల రోజుల్లో క్షమాభిక్ష తీసుకురాకపోతే నీ కేసు ఆబూదాబి కోర్టుకు వెళ్తుంది.. అక్కడ హత్యా నేరంపై ఉరిశిక్ష పడటం ఖాయం’ అని దుబాయ్ కోర్టు జడ్జి మాకూరి శంకర్‌కు సూచించినట్లు దుబాయ్ జైలు నుంచి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఉపాధి వేటలో దుబాయ్ వెళ్లి అక్కడ చేయని హత్యకు తొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న తన భర్తను కాపాడాలంటూ శంకర్ భార్య భూదేవి, కుమారుడు రాజు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన వీరి సమస్యను పరిష్కరించడానికి స్థానికుడైన టీడీపీ నాయకుడు దేగాం యాదాగౌడ్ తనవంతు ప్రయ త్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్ వ్యవసాయ కూలీ. భార్య భూదేవి గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్ వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో ఫోర్‌మన్‌గా పనిలో చేరాడు. 2009లో అక్కడే తాపీ పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాద వశాత్తు కిందపడి చనిపోయాడు. దీంతో ఫోర్‌మన్‌గా ఉన్న శంకర్‌పై పోలీసులు హత్యా నేరం మోపి ఫుజీరా జైలుకు పంపించారు. దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారు. తొమ్మిదేళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు. కొడుకు పుట్టినా కనీసం ఇప్పటి వరకు శంకర్ చూడలేదు. తన పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, రక్షించాలని శంకర్ సమాచారం అందించాడు. మృతుడి కుటుంబ సభ్యులు శంకర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు లేఖ ఇస్తే జైలు నుంచి విడుదలయ్యే అవకా శాలున్నాయి. రాయబార కార్యాలయానికి లేఖ శంకర్ దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి తనను కాపాడాలని లేఖ రాయడంతో అధికా రులు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. యాదాగౌడ్ గతేడాది రాజస్తాన్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రూ.6.5లక్షల పరిహారం ఇస్తే బాధిత కుటుంబం క్షమాభిక్ష లేఖ ఇచ్చేందుకు అంగీకరించింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచక శంకర్ కుటుంబం సాయం చేయాలని దాతలు, ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
300 మంది ఖైదీలకు క్షమాభిక్ష!
సర్కారు అనుమతిస్తే జనవరి 26న విడుదల సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్లకేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు త్వరలోనే స్వేచ్ఛ లభించనుంది. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26న) విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఏర్పాటైన జైలు సూపరింటెం డెంట్ల కమిటీ ఓ జాబితాను తయారు చేసింది. జైలు నిబంధనలకు లోబడి సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలతో పాటు వృద్ధులకూ విముక్తి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అర్హత కలిగినవారి జాబితాతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో దాదాపు 250 మంది జీవిత ఖైదీలు, 50 మంది వరకు వృద్ధులకు చోటు దక్కినట్లు సమాచారం. ఈ నివేదికపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వం ఖైదీల విడుదలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఎలాంటి మార్పు చేర్పులు చేయకపోతే జనవరి 26న పెద్ద సంఖ్యలో ఖైదీలు విడుదలయ్యే అవకాశముంది. చివరగా 2011లో కొన్ని తీవ్ర నేరాలకు పాల్పడినవారు మినహా సత్ప్రవర్తన కలిగిన కొద్ది మందిని క్షమాభిక్షపై విడుదల చేశారు. -
ఖైదీలకు ఏపీ సర్కార్ క్షమాభిక్ష
విజయవాడ: సత్ప్రవర్తన కలిగి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు గణతంత్ర దినోత్సవం రోజున క్షమాభిక్ష పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపోందిస్తూ జీవో నెం 163ను బుధవారం విడుదల చేసింది. 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన మహిళలు, పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన పురుషులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. 65 సంవత్సరాల పైబడి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన వృద్ధులకు క్షమాభిక్ష పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్షమాభిక్షకు 20 నుంచి 25 సంవత్సరాల శిక్ష పడిన వారు అనర్హులు. అర్హులైన ఖైదీలను గుర్తించేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. -
సౌదీలో మళ్లీ క్షమాభిక్ష అమలు
చట్టవిరుద్ధంగా ఉన్నవారికి ఊరట మోర్తాడ్: సౌదీ అరేబియాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు మరోసారి వెసులుబాటు కలిగింది. అలాంటి కార్మికులు స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయే అవకాశాన్ని అక్క డి ప్రభుత్వం కల్పించింది. రెండేళ్ల విరామం తర్వాత సౌదీ ప్రభుత్వం క్షమాభిక్షను మరోసారి అమల్లోకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి విజిట్ వీసాపై సౌదీ ఆరేబియా వెళ్లి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్న వారితో పాటు.. కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీల్లో పని నచ్చక బయటకు వచ్చి కల్లివిల్లిగా మారిన కార్మికులు కలుపుకొని సుమారు 30 వేల మందికిపైగా ఉంటారని స్వచ్ఛంద సం స్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, సౌదీలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కిందట నతాఖా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న కార్మికులు రాయభార కార్యాలయంలోగానీ, సౌదీ పోలీసులకు గానీ లొంగిపోయి ఇళ్లకు వెళ్లిపోవాలి. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు సైతం తీరకపోవడం.. వచ్చిన కొద్దీరోజులకే ఇంటికి వెళ్తే పరిస్థితులు పూర్తిగా విషమిస్తాయన్న భయంతో చాలా మంది మొండిధైర్యంతో అక్కడే ఉండి ఏదో ఒక పని చేస్తూ కాలం గడుపుతున్నారు. క్షణక్షణం భయం.. భయంగా బతుకున్న వీరు పోలీసుల కంటపడకుండా ఉండిపోయారు. ఇలాంటి వారి కోసం సౌదీ ప్రభుత్వం మరోసారి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చింది. ఈనెల 3 నుంచి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వచ్చేనెల (సెప్టెంబర్) 30 వరకు గడవు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈసారి స్వచ్ఛందంగా ఇళ్లకు వెళ్లిపోకపోతే కఠిన శిక్షలను అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. పాస్‌పోర్టులు లేని వారు విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో తాత్కాలి పాస్‌పోర్టును జారీ చేయనుంది. అయితే, కార్మికులే విమాన చార్జీలను భరించాల్సి ఉంటుంది. -
ఖైదీలకు క్షమాభిక్ష ఈసారి లేనట్లే..!
* మరోసారి నిరాశకు గురైన ఖైదీలు * ఆశలన్నీ గణతంత్ర దినోత్సవం పైనే సాక్షి, హైదరాబాద్: జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే క్షమాభిక్ష ఈసారి కూడా లభించే అవకాశం లేదు. ఏళ్ల తరబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. ఖైదీలకు రాష్ట్రప్రభుత్వాలు కల్పించే క్షమాభిక్షపై కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుపై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అయితే తీర్పునకు సంబంధించిన ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో విడుదల అనంతరం ఖైదీల అర్హతకు సంబంధించిన లిస్టును జైళ్ల సూపరింటెండెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చని జైళ్లశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీల ఆశలన్నీ గణతంత్ర దినోత్సవంపై పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జై ళ్లలో శిక్షపడిన ఖైదీలు 1,800 మంది వరకు ఉంటారని, గత జీవోల ప్రకారం అయితే వీరిలో వందల సంఖ్యలో విడుదలకు అర్హత కలిగినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా నిరాశే..! కొంతమంది ఆవేశంతో లేక మరే ఇతర వ్యాపకాలతో చేసే నేరాలకు జీవిత ఖైదీగాను, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారు జైళ్లలో కొంత కాలం తర్వాత పశ్చాత్తాపపడి సత్ప్రవర్తన కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించేది. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 17 సార్లు ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీరామారావు హయాంలో చేసిన నేరాలతో సంబంధం లేకుండా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరికీ విముక్తి కల్పించారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడుసార్లు ఖైదీలకు స్వేచ్ఛ ప్రసాదించారు. వైఎస్ మరణానంతరం చివరగా 2011లో మాత్రం కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చి కొంతమంది ఖైదీలను మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశారు. -
బహ్రెయిన్‌లో క్షమాభిక్ష అమలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి ఊరట సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): బహ్రెయిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేస్తోంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది. బహ్రెయిన్‌కు విజిట్ లేదా కంపెనీ వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉన్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమా భిక్షతో ఊరట లభించనుంది. కంపెనీ వీసాలపై వెళ్లి పని నచ్చకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఇతర కంపెనీల్లో చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారు. బహ్రెయిన్‌లో అలాంటి తెలంగాణ కార్మికులు ఆరు వేల మందికి పైగా ఉంటారని అంచనా. ప్రభుత్వం అమలు చేయనున్న క్షమాభిక్షతో కార్మికులకు తమ చేతిలో పాస్‌పోర్టు లేకపోతే లేబర్ మానిటరింగ్ రిక్రూట్మెంట్ అథారిటీ(ఎల్ఎంఆర్ఏ)కి దరఖాస్తు చేసుకోవాలి. వారు కొత్త పాస్‌పోర్టును మన దేశ విదేశాంగ శాఖ ద్వారా జారీ చేయించి కంపెనీ ల్లో పని కల్పిస్తారు. ఒక వేళ పని చేయడం ఇష్టం లేకపోతే, జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా జైలుకు పోకుండా ఇంటికి చేరుకోవచ్చు. చేతిలో పాస్‌పోర్టు ఉం డి వీసా గడువు ముగిసినవారికి ఎల్ఎంఆర్ఏ కొత్త వీసాలను జారీ చేయిస్తుంది. ఆరు నెలల కాలంలో వారు పట్టుబడినా జైలు శిక్ష ఉండదు. బహ్రెయిన్ ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ ఆరు నెలల కాలం దాటితే మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేయనుంది. క్షమాభిక్షతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం దొరికిందని అక్క డి స్టార్ హోటల్లో పని చేస్తున్న తిమ్మాపూర్‌కు చెందిన రామ్మోహన్ తెలిపారు. -
‘క్షమాభిక్ష’ అధికారాలపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత ఆ దోషులకు క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేసే విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలకు సంబంధించిన కీలక విచారణను బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులైన ఏడుగురికి మరణశిక్షను యావజ్జీవశిక్షగా సుప్రీంకోర్టు మార్చిన మర్నాడే.. తమిళనాడు ప్రభుత్వం 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్న ఆ ఏడుగురికి క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దాంతో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై స్పందించాల్సిందిగా జూలై 9న అన్ని రాష్ట్రాలకు నోటీసులను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దోషులకు క్షమాభిక్ష ప్రకటించే నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. అనంతరం బుధవారం ఈ విచారణను ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఇందుకు 2 రోజుల కాలపరిమితిని విధించింది. 2పూర్తి పనిదినాల్లో విచారణ పూర్తికావాలని కోరింది. అయితే, తేల్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందువల్ల రెండు రోజుల్లో విచారణ పూర్తికావడం సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ధర్మాసనానికి విన్నవించారు. బాధితుల హక్కులకు భంగం కలగకపోవడం అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే హక్కు వారికి ఉందా? అనేది ధర్మాసనం తేల్చాల్సి ఉందన్నారు. యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం జైళ్లో గడపడమా? లేక 14 ఏళ్ల జైలుశిక్ష అనంతరం విడుదల చేయమని కోరే హక్కు దోషికి ఉంటుందా? అనే విషయాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేయాలన్నారు. సీబీఐ విచారించిన కేసుల్లోనూ దోషులను విడుదల చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుందా? లేదా? అనేది కూడా విచారించాల్సి ఉందన్నారు. -
నిరాశేనా!
రాజీవ్ హంతకుల విడుదల ఇప్పట్లో లేనట్లే సుప్రీం నిర్ణయంతో నిరాశ మళ్లీ పోరాటం అంటున్న అర్బుతామ్మాళ్ చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు క్షమాభిక్షపై విడుదలవుతారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారు శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నిరాశకు లోనయ్యూరు. కన్నీరుమున్నీరైన పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ మళ్లీ పోరాడుతానని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యూరు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి శిక్ష విధించారు. వారిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినీలకు ఉరిశిక్ష పడింది. తమ శిక్షను రద్దుచేయాలని రాష్ట్రపతికి, కేంద్రానికి వారు విజ్ఞప్తి చేసుకున్నారు. పసి బిడ్డతల్లి అనే మానవీయ కోణంలో నళినీకి పడిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చారు. మిగిలిన వారి విషయూన్ని కేంద్రం 11 ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వారి శిక్షను కూడా యావజ్జీవంగా మారుస్తున్నట్టు 2014 ఫిబ్రవరి 18వ తేదీన తీర్పు ఇచ్చింది. వారికి క్షమాభిక్ష పెట్టే విచక్షణాధికారాన్ని కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమం లో ఆ ముగ్గురితోపాటు మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా హర్షం వెలిబుచ్చాయి. తమిళనాడు ప్రజలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేగాక సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఏడుగురి విడుదలపై స్టే ఇచ్చింది. దీంతో ఆ ఏడుగురి విడుదల ఆగిపోయింది. ఈ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదుల వాదోపవాదాలు గత నెల 27వ తేదీతో పూర్తయ్యాయని, ఈ నెల 25వ తేదీలోగా తీర్పు వెలువడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈ నెల 18వ తేదీన కోవైలో ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైదీల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు నిరాశకు లోనైయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం శుక్రవారం పదవీ విరమణ చేస్తున్నందున మానవతా ధృక్పథంతో చివరి కేసుగా వారికి విముక్తి ప్రసాదిస్తారని అందరూ ఆశించారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు భయంకర ఉగ్రవాదులు కాబట్టి వారికి క్షమాభిక్షపై రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని జస్టిస్ సదాశివం వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఏడు అంశాలపై విచార ణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయూలని ఆదేశించారు. -
41 మంది జీవిత ఖైదీలకు విముక్తి
సాక్షి, హన్మకొండ, వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు జైలు జీవితం నుంచి విముక్తి పొందారు. గాంధీ జయంతి సందర్భంగా వారిని విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం గతంలోనే అంగీకరించినప్పటికీ వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు సర్కార్ అనుమతి మేరకు 220 జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 390 మంది ఖైదీలు విడుదల కాగా... వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులుగా తేలారు. వీరందరినీ శనివారం విడుదల చేస్తున్నట్లు జైళ్ల శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మే రకు రాత్రి 12.30 గంటల సమయంలో 37 మంది జైలు నుంచి బయటకు వచ్చారు. మిగతా వారిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న కొమ్ము రాధ అనే మహిళను 20 రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. ఆమెతోపాటు నసీం ఖాన్, పిట్ల రాజేశ్వర్, ఎండీ.షాన్వాజ్ పెరోల్‌పై బయటనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నలుగురిని ఆదివారం ఉదయం జైలు నిబంధనల మేరకు కేంద్ర కారాగారంలో జైలు అధికారుల ఎదుట సరెండర్ అవుతారని, ఆ తర్వాత క్షమాభిక్ష కింద వారిని వెంటనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రెండున్నరేళ్ల తర్వాత... క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలను ముందుగానే గుర్తించి.. గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయడం ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో చివరిసారి 2011 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖైదీ లను క్షమాభిక్షపై విడుదల చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు. 2013 గాంధీ జయంతి సందర్భం గా కూడా ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలే కా కుండా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తారుు. దీంతో సర్కారు హడావుడిగా అక్టోబరు 1న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించింది. కానీ... నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడంతో గాంధీ జయంతి నాటికి క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష ప్రకటన వెలువడిన తర్వాత జైళ్లశాఖ నియమ నిబంధనల ప్రకారం ఎంతమందికి క్షమాభిక్షకు అర్హులవుతారనే అంశాన్ని గుర్తించేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో 41 మంది ఖైదీ లు అర్హులుగా తేలింది. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అన్ని పరిశీలనలు పూర్తరుున తర్వాత శనివా రం రాత్రి వీరిని విడుదల చేశారు. సాక్షి కార్యాలయానికి లేఖలు ‘మేము వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలుగా వివిధ సెక్షన్ల కింద జీవిత ఖై దీలుగా శిక్ష అనుభవిస్తున్నాం. మేము విముక్తి కోసం ఇక్కడ జీవచ్ఛవాలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాం. తా ము చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతున్నాం. మాకు మరో జీవితాన్ని ప్రసాదించాలి. మా మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి’ అంటూ గతంలో సాక్షి కార్యాలయానికి వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలు పలు మార్లు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించే గణతంత్ర, గాంధీజయంతి సందర్భంగా వీరి బాధలను ‘సాక్షి’ ప్రచురించిం ది. 60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు, 55 ఏళ్లు పైబడిన మహిళా ఖైదీల ప్రవర్తను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్షపై విడుదల చేయాలని కోరుతూ ఆగస్టు 11న వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు ఆమరణ దీక్ష కూడా చేపట్టారు. -
ఖైదీల్లో ఆనంద హేల..
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ కేంద్రకారాగారం జీవిత ఖైదీల్లో ఆనందం నెలకొంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ఎట్టకేలకు క్షమాభిక్ష పెట్టింది. రాష్ట్రంలో క్షమాభిక్షకు అర్హులైన 398 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించింది. దీంతో ఇక్కడ కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో అర్హులైన 37 మంది విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శనివారం రాత్రి ఇక్కడ జైలు అధికారులకు ఉత్తర్వులందాయి. రాత్రికి రాత్రే వారిని విడుదల చేయాలని అదేశాలు రావడంతో అఘమేగాలపై అర్హులైన ఖైదీల రికార్డులు తయారు చేశారు. వారిలో అర్ధరాత్రి దాటిన తర్వాత 36 మంది ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మరో ఖైదీ పెరోల్‌పై ఉన్నాడు. ఆ ఖైదీ వ చ్చిన వెంటనే క్షమాభిక్షపై విడుదల కానున్నాడు. విడుదలైన వారిలో 65 ఏళ్లు దాటిన ఇద్దరు వృద్ధులు, మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎడాది గాంధీ జయంతి సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న క్షమాభిక్ష జీవోను విడుదల చేసింది. గాంధీ జయంతి నాటికి జీవోలో నిబంధనల ప్రకారం జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో అప్పట్లో ఖైదీల విడుదలకు జాప్యం జరిగింది. ఆ జీవో ప్రకారం సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి వారిలో అర్హులైన వారిని వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులకు ఉత్తర్వులు పంపింది. సెప్టెంబరులో జారీ అయిన జీవో ప్రకారం విశాఖ కారాగారంలో విడుదలకు అర్హులైన సుమారు 40 మంది జీవిత ఖైదీల జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వారిలో 37 మం ది అర్హులుగా తేల్చి వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఓపెన్ ఎ యిర్ జైల్‌కు చెందిన వారు 20 మంది, మిగిలిన వారు 17 మంది ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఇదే విడుదల.. గతంలో 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచి 36 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ క్షమాభిక్ష జీవో విడుదల చేకుండా ప్రభుత్వం ఆలస్యం చే సింది. ఇప్పటికైనా విడుదల చేసినందుకు ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటామని అంటున్నారు. జైల్లో పరివర్తనం చెందామని, సమాజంలో నీతిగా మెలుగుతామని వారు తెలిపారు. -
‘క్షమాభిక్ష’ మార్గదర్శకాలపై పిల్
సాక్షి, హైదరాబాద్: క్షమాభిక్ష పేరుతో జీవిత ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ‘వాచ్-వాయిస్ ఆఫ్ ది పీపుల్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పి.నారాయణస్వామి ఈ పిల్‌ను దాఖలు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డేల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రెమిషన్ పేరుతో పదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న జీవితఖైదీలను విడుదల చేస్తోందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వివక్షాపూరితంగా మార్గదర్శకాలు రూపొందించడంతో కొందరు ఖైదీలు మాత్రమే విడుదలవుతున్నారని ఆరోపించారు. మార్గదర్శకాల జారీలో ఎటువంటి వివక్ష లేకుండా చూడాలని, జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలందరికీ వర్తించేలా వీటిని రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి (పెరోల్)ని, జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనపై మరో పిటిషన్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది నారాయణస్వామి ఈ పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అక్టోబర్ 3న ప్రకటించిన కేబినెట్ నోట్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, పెద్ద మనుషుల ఒప్పందానికి లోబడి ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అందులో కోరారు.