సౌదీలోని కార్మికులకు క్షమాభిక్ష
ఈనెల 29 నుంచి జూలై ఒకటి వరకు అమలు
అతిక్రమిస్తే జైలుశిక్ష, భారీగా జరిమానా
రాయికల్(జగిత్యాల): సౌదీలో అక్రమంగా.. ఎలాంటి భతాకా లేకుండా ఉంటున్న కార్మికులకు అక్కడి రాజు క్షమాభిక్ష ప్రకటించారు. మార్చి 29 నుంచి జూలై 1 వరకు అమలులో ఉండేలా ఆమ్నెస్టీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సౌదీలో దొంగచాటుగా ఉంటూ పని చేసుకుంటున్న వారు.. ఎలాంటి భతాకా(గుర్తింపు) లేకుండా ఉంటున్న వారు ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా ఇంటికి రావచ్చు. సౌదీలో ఆరు లక్షల మంది భారతీయులు ఉండగా సుమారు రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు దమామ్, జిద్దా, రియాజ్ వంటి ప్రాంతాల్లో పని చేస్తున్నారు.
ఇందులో చాలా మంది వివిధ కారణాలతో వీసాలో ఉన్న పనికాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరికొందరు ఏజెంట్ల మోసాలతో విజిట్ వీసాలపై వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. ఇంటికి తిరిగి రాలేని పరిస్థితుల్లో దొరికిన పని చేసుకుంటూ దొంగచాటుగా ఉంటున్నారు. కొంత కాలంగా సౌదీ పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేసి, జైళ్లలో వేస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ రాజు ఆమ్నెస్టీ చట్టం తీసుకురా వడంతో కార్మికులకు నిజంగా శుభవార్తే.
జూలై ఒకటి తర్వాత కూడా కార్మికులు ఎలాంటి అనుమతులు లేకుండా పనిచేస్తే రెండు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు సౌదీకి చెందిన లక్ష రియాళ్లు వంటి జరిమానా విధించారు. కార్మికులతో పాటు పనిక ల్పించే యజమానులకు సైతం ఈ శిక్ష విధించను న్నారు. సౌదీ రాజు తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని విని యోగించుకొని.. అక్రమంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటున్న వారు స్వదేశానికి తిరిగి రావా లని ప్రవాస తెలంగాణ సంఘాలు కోరుతున్నాయి.