నెలరోజుల్లో క్షమాభిక్ష తెచ్చుకో..!
ఆర్మూర్: ‘నెల రోజుల్లో క్షమాభిక్ష తీసుకురాకపోతే నీ కేసు ఆబూదాబి కోర్టుకు వెళ్తుంది.. అక్కడ హత్యా నేరంపై ఉరిశిక్ష పడటం ఖాయం’ అని దుబాయ్ కోర్టు జడ్జి మాకూరి శంకర్‌కు సూచించినట్లు దుబాయ్ జైలు నుంచి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఉపాధి వేటలో దుబాయ్ వెళ్లి అక్కడ చేయని హత్యకు తొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న తన భర్తను కాపాడాలంటూ శంకర్ భార్య భూదేవి, కుమారుడు రాజు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన వీరి సమస్యను పరిష్కరించడానికి స్థానికుడైన టీడీపీ నాయకుడు దేగాం యాదాగౌడ్ తనవంతు ప్రయ త్నాలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్ వ్యవసాయ కూలీ. భార్య భూదేవి గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్ వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో ఫోర్‌మన్‌గా పనిలో చేరాడు. 2009లో అక్కడే తాపీ పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాద వశాత్తు కిందపడి చనిపోయాడు. దీంతో ఫోర్‌మన్‌గా ఉన్న శంకర్‌పై పోలీసులు హత్యా నేరం మోపి ఫుజీరా జైలుకు పంపించారు. దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారు. తొమ్మిదేళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు. కొడుకు పుట్టినా కనీసం ఇప్పటి వరకు శంకర్ చూడలేదు. తన పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, రక్షించాలని శంకర్ సమాచారం అందించాడు. మృతుడి కుటుంబ సభ్యులు శంకర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు లేఖ ఇస్తే జైలు నుంచి విడుదలయ్యే అవకా శాలున్నాయి.
రాయబార కార్యాలయానికి లేఖ
శంకర్ దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి తనను కాపాడాలని లేఖ రాయడంతో అధికా రులు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. యాదాగౌడ్ గతేడాది రాజస్తాన్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రూ.6.5లక్షల పరిహారం ఇస్తే బాధిత కుటుంబం క్షమాభిక్ష లేఖ ఇచ్చేందుకు అంగీకరించింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో దిక్కుతోచక శంకర్ కుటుంబం సాయం చేయాలని దాతలు, ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.