నిష్క్రమణం | Funday story of the world 27-01-2019 | Sakshi
Sakshi News home page

నిష్క్రమణం

Published Sun, Jan 27 2019 1:08 AM | Last Updated on Sun, Jan 27 2019 1:08 AM

Funday story of the world 27-01-2019 - Sakshi

నార్జిస్‌ కటకటాల వెనుక నుంచి తల్లిని చూసింది. ఆమె పండిన జుత్తునీ, ధారాపాతంగా కురుస్తున్న కన్నీటినీ చూసింది. ఆమె పక్కనే నిల్చుని ఉన్న సోదరుణ్ణి చూసింది. అతని తల విషాదంతో అవనతమై ఉండటాన్ని చూసింది. అయినా నార్జిస్‌కు అతని ఖిన్న వదనం స్పష్టంగానే కనపడింది.  నార్జిస్‌తో పాటు జైల్లో పెరుగుతున్న ఆమె కొడుకు మెహెదీ అమాయకంగా నవ్వుతున్నాడు. చప్పట్టు కొడుతూ మేనమామ వైపు చాక్లెట్‌ కోసం చెయ్యి చాచాడు. అప్పుడతను వొంచిన తల ఎత్తాడు. కటకటాల లోంచే పిల్లవాడి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. మామయ్య కన్నీరు మేనల్లుడి చేతిలో పడ్డది. మురికి తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ చేతుల్ని తుడిచాడు. ఈ దృశ్యం నార్జిస్‌ జ్ఞాపకాల పెన్నిధిలో ముద్రితమైపోయింది. ఆమెలో ఒక ఉపశమన భావం కలిగింది. ప్రస్తుతం వార్ధక్యంలో ఉన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా మెహెదీని చూసుకోవడానికి తన సోదరుడు ఉన్నాడనే భరోసా నార్జిస్‌కు కలిగింది. అతడు ఈ పిల్లవాణ్ణి పెంచగలడు. విద్యాబుద్ధులు చెప్పించగలడు. వాడి జీవితానికి మార్గదర్శి కాగలడు.క్షమాభిక్ష కోసం అర్జీపై సంతకం పెట్టమని ఆమె సోదరుడు ఎంతో ఒత్తడి చేశాడు. కానీ నార్జిస్‌ సుతరామూ ఇష్టపడలేదు. మిలటరీ పాలనలో నేరమేమీ చెయ్యకుండానే కేవలం ఆలోచనా విధానానికే ఉరిశిక్ష విధిస్తారు.అటువంటి స్థితిలో క్షమాభిక్ష అర్థించడం అనవసరమని నార్జిస్‌ దృఢంగా విశ్వసించింది. అభ్యర్థన సమర్పించడానికి గడువూ ముగిసిపోయింది. ఇప్పుడామె మృత్యు ముఖద్వారం వద్ద వేచి ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చేయూతనిచ్చినట్టు ఆమె తల్లి నార్జిస్‌ చెయ్యి పట్టుకుంది.

నార్జిస్‌కు తన వారితో ఇదే చివరి సమాగమం. ఇక ఈ క్షణంలో వారు విడిపోవడమంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకోవడమే. ఈ క్షణం దుర్భరమైనదీ, అత్యంత దుఃఖభరితమైనదీ. ఈ క్షణంతోనే ఆమెకు అందమూ అనాకారితనమూ, మంచీ చెడూ, ప్రేమా ద్వేషమూ మిళితమై ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోనున్నది. పసివాడు మెహెదీ నవ్వుతూ తన మామతో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఊచల మధ్య నుంచి తల దూర్చి మామని ముద్దు పెట్టుకున్నాడు. తన చిన్ని చేతివేళ్లని అమ్మమ్మ పండు జుత్తులో చొప్పించాడు.  ‘‘అమ్మా! ఇక మెహెదీకైనా స్వేచ్ఛ లభిస్తుంది. సంతోషించు. ఈ ఇనుప గొలుసులు, చేతి సంకెళ్లూ, నిర్బంధాలు ఇవే వాడి ప్రపంచమైపోయాయి. వాడూ ఈ బ్యారెక్స్‌లోనే పుట్టాడు. ఇంతవరకు ఇక్కడే పెరిగాడు. ఇక వాడు విడుదలవుతాడు. బడికి వెళ్లగలడు. బజారుకెళ్లగలడు. పార్కులో ఆడుకోగలడు. తమ్ముడూ! ఇక ముందు వీడిని పెంచే బాధ్యత నీదే.’’  ‘‘అక్కా! అక్కా! అలా మాట్లాడకు.’’ అంటూ నార్జిస్‌ సోదరుడు ఒక్కసారిగా భోరుమన్నాడు. అప్పుడామె మౌనం వహించింది. తల్లి వేదనా సోదరుడి దుఃఖం అర్థమయ్యాయి. కాని ఇతరులకు జీవితాన్ని ఇవ్వడానికి వేరొకరు మరణాన్ని ఆహ్వానించక తప్పదని, వారికి వివరించలేకపోయింది. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలంటే కొన్ని జీవితాలు ఉరికంబానికి బలి చెయ్యక తప్పదని వారికి విశదీకరించలేకపోయింది. 

నార్జిస్, ఆమె భర్త హుస్సేన్‌ ఒకేసారి అరెస్టయ్యారు. అప్పటికే ఆమె గర్భిణి. ఇంటరాగేషన్‌ సమయంలో హుస్సేన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు పుట్టించారు. మిలటరీ నిర్బంధంలో ఇవన్నీ సర్వసాధారణం. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయిన వారి శవాల్ని కుటుంబాలకు అప్పగించరు. కనీసం తెలియజెయ్యరు. మిలటరీ వారే పూడ్చిపెట్టేస్తారు. ఆ హత్యలని ఆత్మహత్యలుగా ప్రచారం చేస్తారు.హుస్సేన్‌పై ఆమెకు గల విశ్వాసం రవ్వంత కూడా చలించలేదు. ఆమెలానే అతడు కూడా అంతరాత్మ గల వ్యక్తి. అటువంటి ఖైదీలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కారు. వారు క్షమాభిక్షనూ అర్థించరు.ఈ చివరిచూపుల పర్వం ముగియగానే నార్జిస్‌ తల్లి ఒకవిధమైన నిర్వేదంలో పడిపోయింది. సోదరుడు కటకటాల్లోంచే ఆమె చేతిని ముద్దాడాడు. జుత్తు నిమిరాడు. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కాదు, వారైవెళ్లలేదు. వారిని బయటకు తీసుకుపోయారు. నార్జిస్‌ ఒక్కసారి సోదరుణ్ణి దగ్గరకు తీసుకోవాలనుకుంది. కౌగిలించుకోవాలనుకుంది. కానీ ఇద్దరి మధ్య కఠినాతి కఠినమైన కటకటాలు అడ్డు నిలిచాయి. జైలు నియమాలను మనుషులే తయారు చేస్తారు. కానీ వాటిలో కాస్తంత కూడా మానవత్వం పాలు ఉండదు.  తన మామ అటు వెళ్లగానే మెహెదీ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన కథల్లోని లోకాలనూ స్థలాలనూ చూడాలని వాడు కలలు కంటున్నాడు. కానీ అమ్మ ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు.

‘‘నువ్వు రేపు వెళ్దువుగాని నాన్నా! మామయ్య నిన్ను రేపు బయటకు తీసుకెళ్తాడు.’’ అని నెమ్మదిగా అంటూనే నార్జిస్‌ మెహెదీ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది.జైలు వార్డెన్‌ మరియమ్‌ తల్లీ కొడుకుల వైపు ఒక్కసారి చూసింది. తర్వాత చూడలేక తన కళ్లను కిందకు దించుకుంది. ‘ఈమె ఎటువంటి మహిళ? ఉరిశిక్ష రద్దు కోసం క్షమాభిక్ష అర్జీనైనా పెట్టుకోలేదు. రేపు ఉదయం శిక్ష అమలు చేస్తారని తెలిసినా ఒక్క కన్నీటి బొట్టు కూడా విడువలేదు. ఏడవలేదు. భగవంతుడిని తిట్టుకోవడం లేదు. కనీసం జైలరునైనా తూలనాడటం లేదు’ అనుకుంది. నిజానికి నార్జిస్‌ ఒక విచిత్రమైన మహిళ. ఆమె చేతికి ఖురాన్‌ ఇచ్చినా, ఆమె దాన్ని కళ్లకు అద్దుకుని పక్కన పెట్టేసింది. తన పిల్లవాడ్నే ముద్దులతో ముంచెత్తింది. మౌల్వీ ప్రార్థన చేయించడానికి వచ్చాడు. సర్వవ్యాపి అయిన దయామయుడైన దేవుడిని తన పాపాలను ప్రక్షాళనం చేయమని కోరమన్నాడు. కాని ఆమె చిన్న చిరునవ్వే నవ్వింది. ఆ చిరునవ్వులో నేనేమీ చెయ్యలేదు అన్న అర్థం దాగి ఉంది. మౌల్వీ అటు వెళ్లగానే ప్రార్థనాసనమైన చాపని దిండు కింద పెట్టుకుంది. తన తలని దిండు మీద పెట్టుకుంది. పసివాడికి కథలు చెప్పడం మొదలుపెట్టింది.మహిళా వార్డులో అనేక రకాలైన నేరాలు ఆరోపించబడిన వారూ, నేరాలు నిరూపించబడిన వారూ ఉన్నారు. కానీ వారెవ్వరూ నార్జిస్‌ను తమతో పాటుగా ఒక దోషి అని పరిగణించలేదు. గత నాలుగేళ్లలో ఈ ‘చెడ్డ’ స్త్రీలంతా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించారు.నార్జిస్‌ ఎవరి జుత్తు గానీ, ముక్కుగానీ కొయ్యలేదు. ఎవరి పశువుల్నీ సంపదనీ దొంగిలించలేదు. గంజాయిలాంటి మాదకద్రవ్యాలనీ అమ్మలేదు. ఎవర్నీ గాయపరచలేదు. హత్య చెయ్యలేదు. మరి ఇటువంటితీవ్రమైన శిక్షకు ఎందుకు గురి అవుతున్నదో ఆ స్త్రీలెవరికీ అర్థంకావడం లేదు.‘‘బీబీ! మిమ్మల్ని తప్పించలేదా?’’ ‘మృత్యుక్రమం’లోనికి నార్జిస్‌ని మార్చిన కొద్ది రోజుల్లోనే వార్డెన్‌ మరియమ్‌ అడిగింది. 

‘‘దేని నుంచి తప్పించాలి?’’ నార్జిస్‌ కంఠంలో ఒక పవిత్రత ధ్వనించింది. ‘‘మరణం నుంచి’’‘‘లేదు. చావు మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో వారు దాని నుంచి తప్పించుకోరు. అంతేకాదు, మెహెదీ ఉన్నాడు.నా తర్వాత వాడు జీవిస్తాడు. నేను వాడిలో జీవిస్తాను. వాడి తర్వాత వాడి పిల్లల్లో జీవిస్తాను.’’ఆ తర్వాత మరియమ్‌ మరే ప్రశ్నలూ వేయలేదు. ‘మరణ క్రమం’లో ఉన్న బీబీ ఒక గొప్ప తత్వవేత్త అని బ్యారెక్స్‌లో వ్యాపించిపోయింది. మరణం తర్వాత కూడా ఆమె పునరుత్థానం చెందుతుందనీ జీవావిష్కరణ పొందుతుందనీ అందరూ చెప్పుకున్నారు. ఆమెను గొప్ప మనోబలం గల వ్యక్తిగా అందరూ భావించారు. ఆ సంఘటన తర్వాత ఆమె వద్దకు వార్డెన్‌ ఎవరు వచ్చినా వినయంతో కిందకు చూసి నడుస్తుంటారు. జైలు సూపరింటెండెంట్‌ వచ్చినా వెంటనే ఆమె గది నుంచి పారిపోతాడు. ప్రతిరోజూ ఆమెనురెండుసార్లు గది నుంచి వెలుపలికి తీసుకు వెళ్లేటప్పుడు ఒక హఠాత్‌ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వారిలో వ్యాపిస్తుంది. అప్పటి వరకు అరుస్తూ పోట్లాడుకుంటున్న స్త్రీలు కూడా ఒక్కసారిగా మౌనం వహిస్తారు. ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారు. నార్జిస్‌ ఊర్ధ్వలోకం నుంచి ఊడి వచ్చినట్టుగా గౌరవిస్తారు.ఆ చివరి భోజనం ఒక పండుగ విందు మాదిరిగా జరిగింది. ‘ది లాస్ట్‌ సప్పర్‌’ గొప్ప చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ చిత్రపటం ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ భోజనంతో మెహెదీ ఎంతో ఆనందపడిపోయాడు. ‘‘అమ్మా! తిండి బాగుందమ్మా!’’ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేశాడు.‘‘ఔను నాన్నా! నీ మాట నిజం!’’ నార్జిస్‌ అతడి నోటిలో ముద్ద పెడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూపు మరల్చుకున్నది. ఆమె కన్నీరు ఆ చిన్నవాడి కంటపడటం ఆమెకు ఇష్టం లేదు.

రాత్రి అయింది. మెహెదీ నిద్రలో మునిగిపోయాడు. కానీ నార్జిస్‌ వాడితో గుండె నిండుగా కబుర్లు చెప్పుకోవాలనుకుంది. వాడి మాటలు వినాలనుకుంది. బాగా పొద్దు పోయే వరకు వాడిని మెలకువగా ఉంచాలనుకుంది. ఉదయాన్నే ఆమెను తీసుకుపోవడానికి వారు వచ్చేసరికి వాడు గాఢనిద్రలో మునిగి ఉండాలనుకుంది.నార్జిస్‌ వాడి కళ్ల వైపు చూసింది. వాడి అందమైన నుదుటి వైపు చూసింది. వాడి కళ్లు హుస్సేన్‌ కళ్లలా ఉంటాయి. వాడి నుదురు హుస్సేన్‌ నుదురులాగా విశాలంగా ఉంటుంది. వాడి శరీరం కూడా హుస్సేన్‌ శరీరపు పరిమళమే వేస్తుంది. ఆ సుగంధంలో పుష్పాల సౌందర్యమూ, అనంతమైనజీవేచ్ఛా ఉంటాయి.హుస్సేన్‌! ఇప్పుడు  ఇక్కడ నువ్వు లేవు. ఇంకా ఎక్కడో ఉన్నావా? భూమ్యాకాశాల మధ్య సంచరిస్తున్నావా? లేక నీ జీవకణాలను పంచుకు పుట్టిన ఈ నీకుమారుడిలోఉన్నావా? నార్జిస్‌ రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. మెహెదీని ఆప్యాయంగా పెనవేసుకుంది.‘‘అమ్మా! నాకు నిద్రొస్తుంది’’ అన్నాడు మెహెదీ.‘‘నాన్నా! మరికొద్ది సేపే మెలకువగా ఉండు.ఆతర్వాత నిద్రపోదువుగాని. ఇంకాసేపు నాతో మాట్లాడు నాన్నా!’’ నార్జిస్‌ గొంతులో చిన్న కంపం చోటు చేసుకుంది. ‘‘రేపు మావయ్య నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. కథలు చెబుతాడు. బజార్నీ చూపిస్తాడు.వెళ్తావు కదా!’’‘‘తప్పకుండా వెళ్తావమ్మా! నువ్వు కూడా మాతో బజారుకు వస్తావు కదా!’’ మెహెదీ నిద్ర మరచి కూర్చున్నాడు.‘‘నేను మీతో రాలేను నాన్నా!’’‘‘అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా?’’‘ఉండను నాన్నా! నీకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తాను.’’వరండాలో ఏదో శబ్దం వినబడింది. నార్జిస్‌ పైకి చూసింది. వార్డెన్‌ మరియమ్‌ కటకటాలు పట్టుకొని కబుర్లు చెప్పకొంటున్న తల్లీబిడ్డల వైపు చూస్తోంది. ఆమె అశ్రునయనాలతో ఉంది.‘‘మా అమ్మ రేపు నాకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తోంది’’ అంటూ మెహెదీ ఉత్సాహంగా మరియమ్‌తో చెప్పాడు. వాడెప్పుడూ సీతాకోక చిలుకల్ని చూడలేదు. కాని తల్లి వాడికి వాటిని గురించి చాలా కథలు చెప్పింది.


‘‘ఔను రాజా! నువ్వు మీ అమ్మతో ఎక్కువ సేపు మాట్లాడు. ఆమెకు కుప్పలు తెప్పలుగా కౌగిలింతలూ ముద్దులూ ఇవ్వు’’ మరియమ్‌ స్వరం బొంగురుపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.‘‘అమ్మానువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తావు కదా!’’‘‘లేదు నాన్నా! సీతాకోక చిలుకలు చాలా వేగంగా ఎగురుతుంటాయి. నేను వాటిని వెంబడిస్తున్న కొద్దీ మరింత దూరం పోతుంటాయి. కాబట్టి వాటి కోసం నేను చాలా చాలా దూరం పోతాను.’’‘‘అమ్మా! నువ్వు ఎలాంటి సీతాకోకచిలుకల కోసం చూస్తావు?’’నార్జిస్‌ ఒక్క క్షణం ఆగింది. ‘‘నేనా? స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే సీతాకోక చిలుకల కోసం చూస్తాను నాన్నా!’’ ఆమె కుమారుడి జుత్తుని ముద్దుపెట్టుకుంది.నిజానికి వాడికి ఆ మాటలకు అర్థం తెలీదు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏ రంగులో ఉంటాయమ్మా!’’‘‘హరివిల్లుకుండే అన్ని రంగుల్లోనూ ఉంటాయి.’’‘‘హరివిల్లు ఎలా ఉంటుంది?’’‘‘ఈసారి వర్షం కురిసినప్పుడు హరివిల్లుని చూపించమని మావయ్యని అడుగు.’’‘‘అప్పుడు నేను కూడా హరివిల్లు రంగుల సీతాకోక చిలుకల కోసం వెళ్తాను.’’‘‘నువ్వు వెళ్లొద్దు నాన్నా! ఆ సీతాకోక చిలుకలు వాటికవే నీ వద్దకు వస్తాయి. నేను వాటి కోసమే పైకి వెళ్లి వెతుకుతాను. కాబట్టి మరి నువ్వు వెళ్లనవసరం లేదు.’’ నార్జిస్‌లో చిన్న వొణుకు ప్రారంభమైంది. మనఃపూర్వకంగా తీవ్రమైన అనురాగంతో మెహెదీ మురికిపట్టని మెడని గట్టిగా ముద్దుపెట్టుకుంది.ఈ వారంలో మొదటిసారిగా ఆమె కన్నుల్లో నీరు ఉబికి ప్రవహించసాగింది.

మెహెదీ నిద్రపోయిన తర్వాత నార్జిస్‌ వాడిని పైకి ఎత్తి తన గుండెపై పడుకోబెట్టుకుంది. వాడిలో ఆమెకొక ఆశాకిరణం కనబడింది. ఈ ఆశే ఆమెలో హిమాలయమంత ఎత్తుకు ఎగురుతోంది. భవిష్యత్తులో తన జీవ చైతన్యాన్ని వాడు కొనసాగించగలడని, ఒక ఆవిష్కరణా భావం ఆమెకు కలుగుతోంది.చుట్టుపక్కల బ్యారెక్స్‌ నుంచి ప్రార్థనా గీతాలు వినిపించడం మొదలైంది. ఎవరో ఒకామె ‘నూరా రెహమాన్‌’ అంటూ శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈ రోజు బీబీ శాశ్వత నిష్క్రమణం అని వారికి తెలుసు. అందకోసమే ఈ సన్నద్ధత.నార్జిస్‌ గుండెలో ఏదో పోటు మొదలైంది. జైలు ప్రధాన ద్వారం వెలుపల తన సోదరుడు మట్టిలో ధూళిలో కూర్చుని వేచి ఉంటాడు. అతడు స్టాటిస్టిక్స్‌లో పెద్ద డిగ్రీ తీసుకున్నాడు. కాని ఆ గణిత జ్ఞానంతో తన అక్క అస్తమయానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలను లెక్కించవలసి వస్తుందని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. తమ తల్లి కన్న ఇద్దరిలో తనొక్కడే మిగిలిపోతాడని భావించి ఉండడు. తన మేనల్లుణ్ణి పెంచి పెద్దచేసే బరువు బాధ్యతలు తన మీదనే పడతాయని యోచించి ఉండడు.నార్జిస్‌ మనస్సులో చాలా ముఖాలు, ప్రియమైనవీ అప్రియమైనవీ, దయగలవీ క్రూరమైనవీ, బాగా పరిచయమైనవీ కానివీ పరిభ్రమించసాగాయి. తన అంతిమయాత్ర బాధారహితంగా సాగడానికి తమ నిద్రను త్యాగం చేసి ప్రార్థనాగీతాలను ఆలపిస్తున్న వారి పట్ల ఆపుకోలేని ప్రేమాభిమానాలు కలిగాయి. వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది. ఆయా గొంతుల వారితో ఒక వారం క్రితం తనకు కలిసే ఉండేది. కాని వారెప్పుడూ తనని అర్థం చేసుకోలేదు. అంతేకాదు, వారికి తన గురించి ఏమీ తెలీదు.

క్షమాభిక్ష కోసం అర్థించే గడువు దాటిన తర్వాత ఆ వార్త బయటికి పొక్కింది. జైలు అధికారులు ఆమెను బ్యారెక్స్‌ నుంచి ‘మరణక్రమం’లోనికి మార్చడానికి వచ్చారు. పరిసరాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. నార్జిస్‌తో పాటు మెహెదీ కూడా బ్యారెక్స్‌ని వీడేటప్పుడు కొందరు స్త్రీలు తలలు వంచుకుని కళ్లు తుడుచుకోవడం ఆమెకు కనపడింది. ఈ స్త్రీల ఏ చిన్న గడబిడ సన్నివేశానికైనా ఒకర్నొకరు తిట్టుకుంటారు. దుస్తులు చించుకుంటారు. దాంతో వారిని మ్యాట్రన్, వార్డెన్‌ బలవంతంగా విడదీస్తుంటారు. ఈరోజు వారి ప్రవర్తన భిన్నంగా ఉంది.నార్జిస్‌కు ఒక తాత్కాలికమైన నిద్రమత్తు వంటిది ఆవహించింది.ఆమె హృదయం కృంగిపోనారంభించింది. గుండె ఒక తీవ్రమైన అనునాదంతో కొట్టుకుంటోంది. ఈ హృదయ స్పందనే మృత్యు ముఖద్వారం వద్ద ఆమె ఘనవిజయంగా నిలుస్తుంది. ఆమె మరణం తర్వాత జీవిస్తుందా? మరి జీవచైతన్యం అంటే ఏమిటి? శరీరాన్ని వీడిన తర్వాత అది ఎక్కడకు పోతుంది? హుస్సేన్‌ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. లేనే లేడు. అంతా సర్వనాశనమైంది. నాశనమంటే అర్థమేమిటి? ఆ మాటకు భాషాపరమైన అర్థం మాత్రమే ఆమెకు తెలుసు. మరికొద్ది సేపట్లో తనే ఆ అనుభవాన్ని పొందనుంది.‘‘బీబీ’’ మరియమ్‌ కటకటాల వద్దకు వచ్చి మృదువుగా పిలిచింది.

‘‘చెప్పమ్మా!’’‘‘బీబీ! ఆ చిన్నరాజుని పరుపు మీదనే ఉంచండి. వాళ్లు వచ్చేస్తున్నారు.’’ మరియమ్‌ మాట తడబడుతోంది.ఒక్క క్షణం నార్జిస్‌కు తన పాదాల కింద నేల ప్రకంపిస్తున్నట్లు అనిపించింది. కానీ నిలదొక్కుకుంది. తన మెడ చుట్టూ ఉన్న మెహెదీ చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంది. వాడిని ఆ కఠినమైన పరుపు మీదనే వదిలి పెట్టింది. ‘వాడు నా ముఖాన్ని గుర్తుంచుకోలేడు. వాడి జ్ఞాపకాలలో కేవలంనా పేరు, నా ఊహ, నా స్మృతి మాత్రమే మిగులుతాయి.’‘‘నన్ను క్షమించండి బీబీ! కటకటాలకు తాళాలు వేసి తీసే నా ఈ చేతులే నాకు తిండి పెడుతున్నాయి.’ మరియమ్‌ ఊచలపై తలపెట్టుకునిఏడవనారంభించింది.నార్జిస్‌ నులక మంచం మీద నుంచి లేచింది. కటకటాల్లోంచి మరియమ్‌ భుజాల మీద చేతులేసింది. మాటలకు నిర్వచనాలు లేవు.బరువైన అడుగుల చప్పుడు వినపడింది. నార్జిస్‌ మరియమ్‌ మోచేతిని నెమ్మదిగా తట్టింది. మరియమ్‌ తలెత్తి తన కన్నీటి తెరలలోంచే నార్జిస్‌ను చూసింది. తన కళ్లని తెల్లని మస్లిన్‌ దుపట్టాతోతుడుచుకుంది. ‘ఎటెన్షన్‌’లో నిలబడింది.తాళంలో చెవిని తిప్పి వీలైనంత నెమ్మదిగా తలుపు తెరిచింది. జైలు సూపరింటెండెంటు ఇనుప తలుపుని గట్టిగా గోడకు తగిలి పెద్దగా ధ్వని వచ్చేటట్టు తీశాడు.‘‘సర్‌! పిల్లవాడు నిద్రపోతున్నాడు. మేల్కొనగలడు’’ మరియమ్‌ నమ్రంగానే అంది.

‘‘నోర్ముయ్యి! వాడు నీ పిల్లవాడు కాడు’’ సూపరింటెండెంట్‌ అసహనంతో అన్నాడు.‘‘సర్‌! బిగ్గరగా మాట్లాడవద్దు. ప్లీజ్‌’’ యువ మేజిస్ట్రేట్‌ నిద్రపోతున్న మెహెదీ వైపు చూస్తూ, కనుబొమలు తుడుచుకుంటూ అన్నాడు.సూపరింటెండెంట్‌ భృకుటి ముడివేస్తూ చిరాగ్గా చూశాడు. ‘ఈ కొత్త ఆఫీసర్లు తమ గురించి ఏమనుకుంటారు?’ అనుకుంటూ పొంగి వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు. తన అధికారిక విధానాన్ని మెదలుపెట్టాడు. మొదట నార్జిస్‌ని ఫొటోతోనూ పుట్టుమచ్చలతోనూ సరిపోల్చి గుర్తించాడు. యధావిధిగా ఒక పత్రాన్ని తెరిచి, దాన్ని బిగ్గరగా చదివాడు: ‘‘నేను.. క్షేమకరుడూ.. దయామయుడూ అయిన అల్లా పేరున ప్రారంభిస్తున్నాను..’ అని మొదలుపెట్టి ఇలా ముగించాడు. ‘‘మరణం ధ్రువీకరించబడేంత వరకు నేరస్తురాలిని ఉరితియ్యాలి.’’మెడికల్‌ ఆఫీసర్‌ ముందుకు వచ్చాడు. నార్జిస్‌ నాడినీ, గుండె కొట్టుకోవడాన్నీ పరీక్షించాడు. నిశ్శబ్దంగా తల ఊపాడు. సూపరింటెండెంట్‌ అతని చేత కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించాడు. యువ మేజిస్ట్రేట్‌ ఆ సంతకాలను ధ్రువీకరించాడు. సూపరింటెండెంట్‌ గదిని విడిచి వెళ్లాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ మరియమ్‌కు సంజ్ఞ చేశాడు. ఆమె ముఖం కంచులా కఠినంగా ఉన్నట్లనిపించింది. ఆమె కళ్లు నేలవైపు చూస్తున్నాయి. నార్జిస్‌ చేతుల్ని వెనక్కు వంచి ఒక చర్మపు తాటితో కట్టింది. మరియమ్‌ వేళ్ల వెచ్చదనం నార్జిస్‌కు తగిలింది. ఆమె ఒంటరిగా లేదు. లోపలా బయటా చాలామందే ఉన్నారు.సాయుధులైన రక్షకులు బ్యారెక్స్‌ని ఈసరికే కాపలా కాస్తుంటారు ప్రధాన ద్వారం వద్ద పన్నెండు మంది వార్డెన్లు ఈసరికే వారి వారి స్థానాల్లో ఉంటారు ప్రతివారి తుపాకీలోనూ పది బుల్లెట్లు ఉంటాయి నార్జిస్‌ సోదరుడు జైలు గోడల వెలుపల బయలులో కూర్చొని ఉంటాడు.

నార్జిస్‌కు మెహెదీ ముఖం కనపడుతోంది. ఆమె వాడినే కన్నార్పకుండా చూస్తోంది. మేట్రన్‌ నుంచి సంజ్ఞ అందుకుని మరియమ్, నార్జిస్‌ను ‘‘పద బీబీ’’ అంది.నార్జిస్‌ ఒక్క అడుగు ముందుకు వేసింది వెనక్కు తిరిగి మెహెదీ వైపు చూసింది. వాడు నిద్రలోనే కదిలాడు. చిన్నగా మూలిగాడు వాడికేదో పీడకల వచ్చి ఉంటుంది. నార్జిస్‌ గుండెను ఏదో పిండేసినట్లయింది. ఆమె తన కళ్లలో ఉబుకుతున్న కన్నీటిని అతి ప్రయాస మీద ఆపుకుంది. ఆమె తన ఆశల్నీ తనవంటి వారి ఆశయాల్నీ భగ్నం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వారి ముందుంది. కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. ఈ చివరి క్షణాల్లో తాము గెలిచిన సంతృప్తి వారికెందుకివ్వాలి?యువ మేజిస్ట్రేట్‌ కళ్లు ఆమె దృష్టిని వెంబడించాయి. ‘‘ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు?’’ అని మేట్రన్‌ని అడిగాడు. నార్జిస్‌కు తన ఊపిరి తోడివేసినట్లయింది. తన సోదరుణ్ణి అగ్నిపరీక్షకు గురిచేస్తోంది.మేజిస్ట్రేట్‌ కనుబొమలు ముడిపడ్డాయి. నార్జిస్‌ వైపు పరీక్షగా చూశాడు. వరండాలో ఉన్న వార్డెన్‌ను పిలిచాడు. ‘‘సర్‌’’ అంటూ వార్డెన్‌ ముందుకొచ్చాడు.‘‘ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా ఎత్తుకో’’ అన్నాడు.‘‘సర్‌. నేను వాడిని ఎత్తుకోవచ్చా?’’ అంది మరియమ్‌.‘‘సరే, వాణ్ణి బీబీతో పాటు అక్కడి వరకు తీసుకురా...’’‘‘కానీ, సర్‌! జైలు మాన్యువల్‌ అందుకు అంగీకరించదు’’ డిప్యూటీ సూపరింటెండెంట్‌ కలగజేసుకున్నాడు.‘‘నీ జైలు మాన్యువల్‌ తగలబెట్టు’’ అంటూ యువ మేజిస్ట్రేట్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మరియమ్‌ ముందుకొచ్చి మెహెదీని ఎత్తుకుంది. వాడు కదిలాడు. త్వరలోనే తిరిగి గాఢనిద్రలోకి జారుకున్నాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో ఉరి ఖైదీ బిడారు బయల్దేరింది.

ఇద్దరు పోలీసులు దారి చూపుతున్నారు. మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. నార్జిస్‌ మధ్యలో ఉంది. ఆమెకు కుడివైపున ఒక వార్డెన్, రెండోవైపున మరియమ్‌ ఉన్నారు. మరియమ్‌ భుజాన మెహెదీ ఉన్నాడు.నార్జిస్‌ చూపు మెహెదీపై స్థిరంగా ఉంది. అందరూ ముందుకు నడిచారు. ఆరుబయట అందమైన చల్లని రాత్రి నిష్క్రమించనుంది. నింగీనేలా కలసిన సుదూర తీరంలో ఉదయభానుడు ప్రభవించనున్నాడు. వెలిసిపోతున్న వెన్నెలలో వధ్యశిలా వేదిక నార్జిస్‌ కంటబడింది. పైకి దారితీసే మెట్లు కూడా స్పష్టంగా కనపడసాగాయి. మరణం భూమి లోతుల్లోనికి కృంగిపోతోంది. అధఃపాతాళాన్ని చేరడానికి పైవైపు మెట్లని ఎందుకెక్కాలో ఆమెకు అర్థం కాలేదు. ఉరిశిక్ష అమలు చేసే తలారివైపు చూసింది. అతడి పిల్లలు ఈరోజు ఉరివల్ల తండ్రి తెచ్చిన రాబడితో సంతోషిస్తారు. ఒక ఉరికి పది రూపాయలు చెల్లిస్తారు. నిజంగా అది వారికి ఎక్కువ మొత్తమే. ఆ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు.‘‘మరియమ్‌!’’ నార్జిస్‌ గొంతు ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక మెరుపులా మెరిసింది. ‘‘బీబీ! మీ సేవలోనే ఉన్నాను.’’ వార్డెన్‌ మరియమ్‌ గొంతు కన్నీటితో గద్గదమైంది.ఇక్కడ ఈ స్థితిలో యజమాని ఎవరో, సేవకులెవరో చెప్పడం కష్టం. మృత్యువు అందర్నీ ఒకే పంక్తిలో నిలుపుతుంది. నార్జిస్‌ మరియమ్‌ను దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసింది. మరియమ్‌ ముందుకు వంగింది. ఆమె భుజం మీద నిద్రపోతున్న మెహెదీ ఉన్నాడు. నార్జిస్‌ బంధనాలున్న చేతులతోనే మెహెదీని తాకే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతలోనే ఆగిపోయింది.మెహెదీ నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. బహుశా దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడు. నార్జిస్‌ తన జీవనఫలం, తన ప్రతిమ అయిన మెహెదీ వైపు నీరు నిండిన కళ్లతో చూసింది. వాడి నుదుటినీ, బుగ్గల్నీ ముద్దాడటానికి వంగింది.ఒక జీవితం మరో జీవితానికి వీడ్కోలు చెబుతోంది. నార్జిస్‌ వధ్య శిల మెట్లు ఎక్కింది. తలారి ఆమె ముందు వంగాడు. ఆమె కాళ్లను బంధించాడు. ఆమె ఛిద్రమవుతున్న ప్రపంచ దృశ్యాన్ని కడసారి చూపు చూసింది. దాన్ని మనసులోనే పదిలపరచుకుంది.కళ్లు మూసుకుంది. ఆ దృశ్యం ఆమెలో ముద్రించబడింది.చంద్రుడు అస్తమించిపోతున్నాడని ఆమెకు తెలుస్తోంది. ధ్రువనక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తోందని తెలుస్తోంది. మెహెదీ దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడని తెలుస్తోంది. సూర్యుడు ఉదయించబోతున్నాడని తెలుస్తోంది.దేవుడి పవిత్రమైన పేరు మీద నిర్దేశించబడిన నిర్ణయం అమలు కాబోయే క్షణం ఆసన్నమైంది. 
ఉర్దూ మూలం : జహీదా హీనా, పాకిస్తాన్‌
అనువాదం: టి.షణ్ముఖరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement