‘క్షమాభిక్ష’ అధికారాలపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత ఆ దోషులకు క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేసే విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలకు సంబంధించిన కీలక విచారణను బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులైన ఏడుగురికి మరణశిక్షను యావజ్జీవశిక్షగా సుప్రీంకోర్టు మార్చిన మర్నాడే.. తమిళనాడు ప్రభుత్వం 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్న ఆ ఏడుగురికి క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దాంతో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై స్పందించాల్సిందిగా జూలై 9న అన్ని రాష్ట్రాలకు నోటీసులను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దోషులకు క్షమాభిక్ష ప్రకటించే నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్రాలను ఆదేశించింది.
అనంతరం బుధవారం ఈ విచారణను ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఇందుకు 2 రోజుల కాలపరిమితిని విధించింది. 2పూర్తి పనిదినాల్లో విచారణ పూర్తికావాలని కోరింది. అయితే, తేల్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందువల్ల రెండు రోజుల్లో విచారణ పూర్తికావడం సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ధర్మాసనానికి విన్నవించారు. బాధితుల హక్కులకు భంగం కలగకపోవడం అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే హక్కు వారికి ఉందా? అనేది ధర్మాసనం తేల్చాల్సి ఉందన్నారు. యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం జైళ్లో గడపడమా? లేక 14 ఏళ్ల జైలుశిక్ష అనంతరం విడుదల చేయమని కోరే హక్కు దోషికి ఉంటుందా? అనే విషయాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేయాలన్నారు. సీబీఐ విచారించిన కేసుల్లోనూ దోషులను విడుదల చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుందా? లేదా? అనేది కూడా విచారించాల్సి ఉందన్నారు.