'హైదరాబాద్ కంటే మెరుగ్గా బెజవాడలో..'
హైదరాబాద్: హైదరాబాద్ లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి కంటే మెరుగైన ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈఎస్ఐ ఆస్పత్రి గవర్నమెంట్ ఆస్పత్రి కంటే మెరుగ్గా ఉండాలని సూచించారు. దేశ అభివృద్ధిలో కార్మిక శాఖ కీలకమైందన్నారు.
బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్ ఫండ్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. దేశంలో కార్మిక చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
కాగా, విజయవాడలోని గేట్ వే హోటల్లో మహిళా పారిశ్రామిక నేతల సదస్సుకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రత్యేక హోదా కల్పించలేని వెంకయ్యనాయుడు అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో హోటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.