అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే మాఫియాకు విజిలెన్స్ విభాగం సిబ్బంది అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయని, వారి నుంచి లభించే బహుమతుల కారణంగానే విషయం తెలిసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ముఠాలతో చేతులు కలిపిన సిబ్బంది, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను బియ్యం విక్రయానంతరం వచ్చిన లాభంలో వాటా పొందుతున్నట్లు సమాచారం. ఇంతకాలం, బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకుని, అప్పటికప్పుడు డబ్బు వసూలు చేసుకునే విజిలెన్స్ కానిస్టేబుళ్లు నేరుగా స్మగ్లర్లతోనే చేతులు కలపడంపై తోటి కానిస్టేబుళ్ల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కేంద్రంలోనే...
జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన డీలర్ల నుంచి సేకరించిన చౌక బియ్యాన్ని నగరంలోని గుత్తిరోడ్డు సమీపంలో ఉన్న రెండు రైస్ మిల్లుల్లో పాలిష్ పట్టి, రైతుల పేరుతో కర్ణాటకలోని బెంగళూరు, పావగడ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. వారానికి 20 లోడ్ల సరుకు ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రానికి తరలివెళుతున్నట్లు సమాచారం. పౌర సరఫరాల శాఖ అధికారులు వరుస దాడులు నిర్విహ ంచడంతో విజిలెన్స్ కానిస్టేబుళ్ల చీకటి ఒప్పందం వివరాలు బహిర్గతమైనట్లు తెలిసింది.
ఉన్నతాధికారులకు ఎర
దాడుల్లో తమ ముఠాకు చెందిన సభ్యులు పట్టుబడితే వారిని విడిపించేందుకు కానిస్టేబుళ్లే మధ్యవర్తిత్వం వహిస్తారని సమాచారం. మంచి ఇన్‌ఫార్మరనో.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడనో నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుంటారని సమాచారం. దాంతో అధికారి అతనిని వదలిపెడితే, అతని తరఫు నుంచి అధికారులకు భారీగా బహుమతులు ఇప్పిస్తారని, క్ర మేణా అధికారుల బలహీనలను గుర్తించి వాటి ఆసరాతో మామూళ్ల సేకరణకు ఒప్పందం కుదిర్చి పెడతారని సమాచారం.
నాటి సాధరణ కానిస్టేబుళ్లు నేడు లక్షాధికారులు
కొన్నేళ్ల క్రితం సాధారణ వ్యక్తులుగా పోలీసు శాఖలో అడుగు పెట్టిన వ్యక్తులు బియ్యం మాఫియాతో చేతులు కలిపి రూ. కోట్లకు అధిపతులయ్యారు. ప్రస్తుతం ఈ శాఖలో ఉన్నతాధికారి స్థానం ఖాళీగా ఉండడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. కాగా, బియ్యం అక్రమ రవాణాకోసం విజిలె న్స్ సిబ్బందే ఒక కొత్త ముఠాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేషన్ బియ్యం మాఫియాలో విజిలెన్స్ పాత్ర!
Published Mon, Feb 17 2014 3:08 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement