సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్లీ రెండోసారి మోసగించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరి గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మరో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉందన్నారు.
కాని ఆయన ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముందే కేంద్రంతో చర్చలు జరిపి ఉంటే కొద్దిగా అయినా రాష్ట్రానికి న్యాయం జరిగేదని ఆభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోగా బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయించటంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కావాలో, లేక పదవి కావాలో తేల్చుకోవాలని వెంకయ్యను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు.
నూతన రాష్ట్రంలో విమానాశ్రయాలు, ప్రాజెక్ట్‌లు, ఆరులైన్ల రహదారుల నిర్మాణం, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు.. ఇలా అనేకం వస్తాయని చంద్రబాబు చెప్పినా కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. కర్నూలులో కోచ్‌ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి ఉండేదని చెప్పారు. రూ.20 వేల కోట్ల అవసరం ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు కేటాయించడాన్ని చూస్తే దివంగత వైఎస్సార్ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రానికి ఇష్టం లేనట్టుగా ఉందని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంపై బాబు విమర్శలు ప్రజల్నిమోసగించేందుకే
Published Mon, Mar 2 2015 2:38 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement