ఆస్పత్రిలో సుబ్బారావును పరామర్శిస్తున్న వైఎస్ జగన్
పెనమలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ మాటలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని, చివరకు రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రజలను మరోసారి మోసం చేశాడని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యాయత్నం చేసిన కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చావలి సుబ్బారావును పోరంకి బొప్పన ఆస్పత్రిలో ఆయన మంగళవారం పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సుబ్బారావు భార్య సుజాత, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి, దాని నుంచి బయటపడటానికి కేంద్రంపై ఒత్తిడి చేయలేక రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. దీంతో ప్రత్యేకహోదా రాదన్న ఆందోళనతో యువత ఇలాంటి బలిదానాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ధైర్యంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేకహోదా లేకపోతే గ్రాంట్లు 30శాతం, రుణాలు 70శాతంగా ఉంటాయని చెప్పారు. ప్రత్యేకహోదా వస్తే గ్రాంట్లు 90శాతం, రుణాలు 10శాతంగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి అప్పుల బాధ తప్పుతుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్నుల్లో రాయితీలు ఇవ్వడంవల్ల కొత్త పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకువస్తారని తెలిపారు.
ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు?: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు ఏం సాధించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘మోదీని కలిసిన తరువాత కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో మీడియా ముందుకు వచ్చి ఒక్కమాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, వెంకయ్యను కలసిన తరువాత ఆర్థిక సంఘం అభ్యంతరాల కారణంగా హోదాపై ఇబ్బం దులున్నాయని ప్రకటించారు. అంటే ప్రత్యేకహోదా ఇవ్వమనేగా అర్థం.
పార్లమెంటు సాక్షిగా ప్రధాని చేసి న ప్రకటనను అమలు చేయకపోతే ప్రజలు ఎవర్ని నమ్మాలి? హోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదంటే అసలు ప్రధానిని చంద్రబాబు అడగలేదనేగా? హోదా సాధించలేకపోయినప్పుడు టీడీపీ మంత్రులు కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారు?’’ అని ప్రశ్నించారు. చట్టంలో రాష్ట్రానికి ఇచ్చినవాటినే కొత్తగా ప్యాక్ చేసి ప్రత్యేకప్యాకేజీ అని మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హోదా కోసం 29న తాము పిలుపునిచ్చిన బంద్‌ను అడ్డుకుంటే చంద్రబాబు చరిత్రహీనుడవుతాడని హెచ్చరించారు.