Paramarsha
-
కేసీఆర్‌కు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును పరామర్శించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల అనంతరం ఫామ్‌హౌస్‌లో జారి పడిన కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరగగా, కొద్దిరోజుల నుంచి జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఎదురెళ్లి జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాగా కేసీఆర్‌ను పలకరించిన జగన్ పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. అనంతరం కేసీఆర్‌కు జరిగిన ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తర్వాత ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జగన్ అల్పాహారం, తేనీరు తీసుకున్నారు. కేసీఆర్‌కు తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా ఆయనకు కేటీఆర్, ఇతర నాయకులు కారు వద్ద వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. జగన్ వెంట ఏపీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. నాలుగైదు వారాల్లో కేసీఆర్ రికవరీ మరో నాలుగైదు వారాల్లో కేసీఆర్ పూర్తిగా రికవరీ అవుతారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. జగన్ పరామర్శ అనంతరం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రస్తుతం బెడ్ మీదే రెస్ట్ తీసుకుంటున్నారని, మరో నాలుగైదు వారాల్లో సాధారణ స్థితికి చేరుకుంటారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకే జగన్ వచ్చారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. -
సత్తా చూపిద్దాం.. హోదా సాధిద్దాం
రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * ప్రాణాలు తీసుకోవద్దు.. కలసికట్టుగా పోరాడుదాం * ప్రత్యేకహోదాపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు * ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు ఏపీని తాకట్టుపెట్టారు * ఢిల్లీ వెళ్లిన బాబు ఆ గంటన్నర సమయం ఏం చేశారు? * ప్రత్యేకహోదాపై కేంద్ర కేబినెట్‌కే సర్వాధికారాలున్నాయి * 14వ ఫైనాన్స్ కమిషన్‌ను సాకుగా చూపిస్తున్నారంతే * ప్రత్యేకహోదా రాకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది * అందుకే బంద్‌ను విజయవంతం చేసుకుందాం * బంద్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తే బాబు చరిత్ర హీనులౌతారు * లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ * ఆయన కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రాణం ఎంతో విలువైంది... ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దు... కలసికట్టుగా పోరాడుదాం... మన సత్తా చూపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదాను సాధించుకుందాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పేలా రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై పోరాడే ధైర్యం చంద్రబాబుకు లేకపోయినా.. లక్ష్మయ్యలాంటి సామాన్యులు తమ ప్రాణత్యాగంతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి త్యాగాన్ని చంద్రబాబు గుర్తించడా? లక్ష్మయ్య కుటుంబాన్ని కనీసం ఆదుకునేందుకు ఇప్పటివరకూ ఎవ్వరూ రాకపోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. లక్ష్మయ్య త్యాగాన్ని గుర్తించి వారి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు లక్ష్మయ్య మృతికి కారణాలేమిటో తెలిసినా ప్రభుత్వం తెలియనట్లుగా మభ్యపెట్టి చూపే ప్రయత్నాలు చేస్తోంది. లక్ష్మయ్య కొడుకు వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. సరైన ఉద్యోగం లేదు. రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువతను అడిగినా... ప్రత్యేకహోదావల్ల రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుందో, ఎన్ని ఉద్యోగావకాశాలు వస్తాయో చెప్తారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ప్యాకేజీవల్లనే లాభమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడంకోసం చంద్రబాబు బీజేపీతో కలిసి చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? రాష్ట్ర విభజనవల్ల 95 శాతం సర్వీస్ సెక్టార్, 75 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీకి లేకుండా పోతుందని, అందుకు పరిహారంగా ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు తామే మొదట ఓటేశామంటూ టీడీపీ ఎంపీలు బయటకొచ్చి రెండువేళ్లు చూపించారు. అలా అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టారు. ఒక్క హామీ నెరవేర్చారా? ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి. నిరుద్యోగభృతి రావాలంటే బాబు రావాలి. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ కావాలంటే చంద్రబాబు రావాలి అని గోడలమీద రాశారు, టీవీలో ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రత్యేకహోదా గురించి అడక్కుండా... సాకులు వెతుకుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడుతో గంటన్నరసేపు సమావేశమయ్యారు. బయటకొచ్చాక చంద్రబాబుకానీ, అరుణ్జైట్లీకానీ ప్రత్యేకహోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదు. అంటే చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అడగలేదనే కదా అర్థం. తర్వాత వెంకయ్యనాయుడుతో కలిసి చంద్రబాబు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వద్దకెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రత్యేకహోదా గురించి 14 ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని చేతులెత్తేశారు. ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి హోదాకు బదులుగా ప్యాకేజీ కోసం తనవంతు ప్రయత్నిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పటం ఎంతవరకు న్యాయం? ప్రత్యేకహోదా ఇచ్చే అధికారం 14 ఫైనాన్స్ కమిషన్‌కు లేదు. అయినా ఇటువంటి అబద్ధాలు చెప్పటం ధర్మమేనా? ప్రత్యేకహోదా ఇచ్చే సర్వాధికారాలు కేంద్రకేబినెట్కు, ప్రధానమంత్రికి ఉంటాయి. నాటి కేబినెట్ తీర్మానం ఏమైంది..? ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని గత కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని మోదీ కేబినెట్ ఎందుకు అమలు చేయట్లేదు? ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు నిలదీయడంలేదు? ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్‌నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు? ఒక్కటే కారణం... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయారు. పట్టిసీమ, కాంట్రాక్ట్ పనుల నుంచి, లంచాలు తీసుకుని సంపాదించిన అవినీతి డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్ల నల్లధనాన్ని ఖర్చుచేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా దొరికారు. ఓటుకు కోట్లు కేసులో ఎక్కడ జైల్లో పెడతారోననే భయంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను, హోదాను ఫణంగా పెట్టారు. ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టే యత్నాలు... రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోతుందని, అందుకు పరిహారంగా పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు, రహదారులు వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టం చేశారు. ప్రస్తుతం వాటి కోసమే కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. వాటినే కలిపి కొత్తగా ప్యాక్‌చేసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటూ కేంద్రం మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే బాబు వంత పాడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టించే యత్నంచేస్తున్నారు. బంద్‌తో సత్తా చూపిద్దాం ప్రత్యేకహోదాకోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న రాష్ట్ర బంద్‌ను అడ్డుకునేందుకు, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బంద్‌ను కేంద్రానికి చూపించి ప్రత్యేకహోదా ప్రకటించే విధంగా కృషిచేయాలి. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రజలు క్షమించరు. ప్రత్యేకహోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. చంద్రబాబు అడ్డుతగిలినా బంద్‌ను విజయవంతం చేసేందుకు యువత, విద్యార్థులు కలిసిరావాలి.మన సత్తా కేంద్రానికి చూపించాలి. చంద్రబాబు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధించుకోవాలి. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, సీజేసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మీకు అండగా నేనుంటా ‘‘అధైర్యపడకండి. మీకు అండగా నేనుంటా. మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందేలా కృషిచేస్తా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మయ్య కుటుంబానికి హామీ ఇచ్చారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్న ఆయన వేదాయపాళెంలో కేశువులునగర్లోని లక్ష్మయ్య నివాసానికి చేరుకున్నారు. ముందుగా లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మయ్య భార్య విజయమ్మ, కుమారుడు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మతో ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్మయ్య ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య సోదరి బుజ్జమ్మ వైఎస్ జగన్‌ను పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. తన బిడ్డలకు దిక్కెవరని రోదించారు. జగన్ ఆమెను ఓదార్చి... ‘‘లక్ష్మయ్య మరణం నన్ను కలచివేసింది. మీకు అండగా నేనుంటా. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కోసం కృషిచేస్తాను. అధైర్యపడకండి’’ అని ధైర్యం చెప్పారు. -
చంద్రబాబు ప్రతీ మాటలో మోసం
పెనమలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ మాటలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని, చివరకు రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రజలను మరోసారి మోసం చేశాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యాయత్నం చేసిన కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చావలి సుబ్బారావును పోరంకి బొప్పన ఆస్పత్రిలో ఆయన మంగళవారం పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సుబ్బారావు భార్య సుజాత, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి, దాని నుంచి బయటపడటానికి కేంద్రంపై ఒత్తిడి చేయలేక రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. దీంతో ప్రత్యేకహోదా రాదన్న ఆందోళనతో యువత ఇలాంటి బలిదానాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ధైర్యంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా లేకపోతే గ్రాంట్లు 30శాతం, రుణాలు 70శాతంగా ఉంటాయని చెప్పారు. ప్రత్యేకహోదా వస్తే గ్రాంట్లు 90శాతం, రుణాలు 10శాతంగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి అప్పుల బాధ తప్పుతుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్నుల్లో రాయితీలు ఇవ్వడంవల్ల కొత్త పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకువస్తారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు?: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు ఏం సాధించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘మోదీని కలిసిన తరువాత కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో మీడియా ముందుకు వచ్చి ఒక్కమాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, వెంకయ్యను కలసిన తరువాత ఆర్థిక సంఘం అభ్యంతరాల కారణంగా హోదాపై ఇబ్బం దులున్నాయని ప్రకటించారు. అంటే ప్రత్యేకహోదా ఇవ్వమనేగా అర్థం. పార్లమెంటు సాక్షిగా ప్రధాని చేసి న ప్రకటనను అమలు చేయకపోతే ప్రజలు ఎవర్ని నమ్మాలి? హోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదంటే అసలు ప్రధానిని చంద్రబాబు అడగలేదనేగా? హోదా సాధించలేకపోయినప్పుడు టీడీపీ మంత్రులు కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారు?’’ అని ప్రశ్నించారు. చట్టంలో రాష్ట్రానికి ఇచ్చినవాటినే కొత్తగా ప్యాక్ చేసి ప్రత్యేకప్యాకేజీ అని మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హోదా కోసం 29న తాము పిలుపునిచ్చిన బంద్‌ను అడ్డుకుంటే చంద్రబాబు చరిత్రహీనుడవుతాడని హెచ్చరించారు. -
ఈరన్నకుటుంబానికి వైఎస్జగన్ పరామర్శ
-
నేటి నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత ‘రైతు భరోసా యా త్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. రుణాల మాఫీ జరగక, కొత్త అప్పులు పుట్టక, వ్యవసాయం చేసుకోలేక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరాశా నిసృ్పహల్లో ఉన్న రైతుల బలవన్మరణాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో.. రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. తాజాగా మంగళవారం నుంచి కల్యాణదుర్గం నియోజకవర్గంలో మూడో విడత యాత్రను ప్రారంభించనున్నారు. జగన్ తొలి రోజు పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం పత్రికలకు విడుదల చేశారు. శెట్టూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం ఆయన కైరేవు గ్రామానికి వెళతారు. -
21 నుంచి ‘అనంత’లో జగన్ రైతు భరోసా యాత్ర
-
21 నుంచి ‘అనంత’లో జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: గడచిన ఏడాది కాలంలో అప్పులబాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మొదలుపెట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో విడత పర్యటనను ఈ నెల 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారని పార్టీ పోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వైఎస్ జగన్ రెండు విడతలుగా అనంతపురం జిల్లాలోనే రైతు భరోసా యాత్ర నిర్వహించడం తెలిసిందే. -
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
-
ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం
నేడు సతీసమేతంగా పరామర్శించనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ఆలనాపాలనా చూడటంతో పాటు చదువుకు అయ్యే ఖర్చునూ భరించాలని నిర్ణయించారు. మీడియాలో వచ్చిన ప్రత్యూష కథనాలు చూసి ఆయన చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజులుగా ప్రత్యూష దైన్యం తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సీఎం కేసీఆర్ సతీసమేతంగా కలవనున్నారు. నేను అండగా ఉంటా: పోసాని ప్రత్యూష పరిస్థితి చూసి తన హృద్రయం ద్రవించిపోయిందని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె సంరక్షణ బాధ్యతను చూసేందుకు ప్రభుత్వం, బంధువులెవరూ ముందుకు రాకపోతే...ఆ బాధ్యతను తాను తీసుకుంటానని శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ప్రత్యూషను అక్కున చేర్చుకునేందుకు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి, ఆంధ్రమహిళా సభ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూషకు హాస్టల్ వసతితో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి. -
సాగరమంత సానుభూతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రెండోరోజు గురువారం షర్మిల నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల రాకతో పరామర్శకు వెళ్లిన గ్రామాలతో పాటు నియోజకవర్గమంతా సందడి నెలకొంది. తమ అభిమాన నేత కుమార్తె షర్మిలను చూసేందుకు, ఆమెను పలకరించేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. పొలం పనులు చేసుకుంటున్న వారు కూడా షర్మిల కాన్వాయ్‌ను చూసి రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలికారు. వరినాట్లు వేస్తున్న కూలీలు తినే అన్నాన్ని పక్కనపెట్టి షర్మిలను కలిసేందుకు పరుగులుపెట్టడం వైఎస్ కుటుంబంపై జిల్లా ప్రజానీకానికి ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. రెండో రోజు యాత్ర సాగిందిలా.... గురువారం ఉదయం 9:30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరారు. తొలుత నేరుగా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడ స్థానికులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వెంకటనర్సయ్య భార్య రంగమ్మతోపాటు ఇతర కుటుంబసభ్యులు ఆమెకు కష్టసుఖాలు తెలియజేశారు. ఆ తర్వాత షర్మిల అనుముల మండలంలోని గరికేనాటితండాకు వెళ్లారు. బాణావత్ బోడియా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ బోడియా కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా షర్మిల మాట్లాడారు. వారి కుటుంబసభ్యులు తమ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల వారితో ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలే కాకుండా రైతులు, ఇతర గ్రామస్తుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి కోటమైసమ్మ దేవాలయం సమీపంలో భోజనం పూర్తి చేసుకున్న త్రిపురారం వెళ్లారు. అక్కడ మైల రాములు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాములు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె తమ కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. అయితే, రాములు భార్య ధనమ్మ పరిస్థితిని చూసి స్పందించిన షర్మిల ఆమెకు అవసరమైన వైద్యసాయం చేస్తానని మాట ఇచ్చారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడినుంచి షర్మిల మిర్యాలగూడ వెళ్లారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిస్తారు. రైతుల సమస్యలంటే ఎంత ఆసక్తో! దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి రైతులు, రైతుకూలీలంటే ఎంత ప్రేమో ఆయన తనయ షర్మిలకు కూడా ఆ వర్గాలంటే అంతే ప్రేమ ఉందని తెలియజెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా గరికేనాటితండాలో బాణోతు బోడియా నాయక్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన పెద్దకుమారుడు బిచ్చానాయక్ మాట్లాడుతూ ఈ యేడు కాలం కాలేదని, వానలు లేక ఆలస్యంగా సాగు చేశామని చెప్పారు. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని వాపోయాడు. ‘మీ నాన్న పాలించినప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడేమో అంతా దివాళా తీశారు. ఇంకో ఏడాది ఇదే పరిస్థితి ఉంటే ఉన్నది అమ్ముకోవాల్సిందేనమ్మా.’ అని వివరించారు. అప్పుడు షర్మిల మాట్లాడుతూ పంటలు సరిగా వేయలేదు.. వేసిన పంటకు మద్దతు ధర లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా కట్టలేదన్న బిచ్చా సమాధానానికి ఆమె స్పందిస్తూ మరి కొత్త రుణం ఇచ్చారా అని ఆరా తీశారు. కొత్త రుణం ఇవ్వలేదని, ప్రభుత్వం అసలు మినహాయించకుండా వడ్డీ చెల్లించడంతో రుణం ఇవ్వలేదని చెప్పారు. అదేంటి ప్రభుత్వమే వడ్డీ చెల్లించినా మీకు రుణం ఇవ్వడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లో అందరికీ పింఛన్లు వస్తున్నాయా అని కూడా షర్మిల ప్రశ్నించారు. మా బాధ సగం తీరిందమ్మా! బోడియానాయక్ కూతురు కమల, చిన్నకోడలు పద్మ మాట్లాడుతూ ‘మాకు ఒకపక్క చాలా సంతోషంగా ఉంది. మరోపక్క సంతోషంగా బాధగా ఉంది. మీ మా దగ్గరకు వస్తే మా బాధ సగం తీరిందమ్మా! మీరు మా ఇంటి మనిషే అనిపిస్తోంది. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాతయినా వచ్చినందుకు ఎంతో కతజ్ఞతలు. మా నాన్న మీ నాన్నను నమ్ముకున్నందుకు మాకు వచ్చిన అవకాశం ఇది. మీ నాన్న ఈ విధంగా కూడా మాకు సాయం చేశాడు.’ అని చెప్పడంతో షర్మిల ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు. మా అమ్మను కాపాడండమ్మా! ఇక, త్రిపురారంలోని మైల రాములు కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నప్పుడు ఆ ఇంటిల్లిపాది కన్నీటిపర్యంతమయ్యారు. నాన్న ఎలా చనిపోయారని అడిగి తెలుసుకున్న షర్మిల పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. రాములు కుమార్తె సంధ్య తాను డిగ్రీ చదువుతున్నానని చెప్పగా, ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఇంటర్‌సెకండియర్ చదువుతున్న శ్రీకాం త్‌కు కూడా అదే సలహా ఇచ్చారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ కుమారుడు సుతారి పని చేసి కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న షర్మిల కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాములు భార్య ధనమ్మకు ఆరోగ్యం బాగాలేదని పిల్లలు షర్మిల దష్టికి తీసుకెళ్లడంతో ఆమె చలించిపోయారు. వెంటనే ధనమ్మకు అవసరమైన వైద్యసాయం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని, తాను అండగా ఉంటానని చెప్పారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిల్లా నాయకులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, నాగార్జునసాగర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి మల్లు రవీందర్‌రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి ఎం.డి.సలీం, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పరామర్శ కోసం..
నేడు జిల్లాకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. * సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ * వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిద్ధార్థరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సోమవారం జగన్మోహన్రెడ్డి వరంగల్‌కు చేరుకుంటారని తెలిపారు. ఉద యం 11.30 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధినేత జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అక్కడి నుంచి హన్మకొండకు వచ్చి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నాయకులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వై. వెంకటరత్నం బాబు, నల్ల సూర్యప్రకాష్, హెచ్ఏ.రహ్మన్, ఎం.దయానందం, జి.నాగిరెడ్డి, మునిగాల విలియం, సుజాత మం గీలాల్, శివ వస్తారని వివరించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, మునిగాల కల్యాణ్‌రాజ్, మహిపాల్‌రెడ్డి, శంకరాచారి, కాయిత రాజ్‌కుమార్, జలంధర్ పాల్గొన్నారు.