సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ఆలనాపాలనా చూడటంతో పాటు చదువుకు అయ్యే ఖర్చునూ భరించాలని నిర్ణయించారు. మీడియాలో వచ్చిన ప్రత్యూష కథనాలు చూసి ఆయన చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజులుగా ప్రత్యూష దైన్యం తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సీఎం కేసీఆర్ సతీసమేతంగా కలవనున్నారు.