ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం | cm KCR will meet pratyusha | Sakshi
Sakshi News home page

ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం

Published Sat, Jul 18 2015 2:22 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం - Sakshi

ప్రత్యూష బాధ్యతలు నావే: సీఎం

నేడు సతీసమేతంగా పరామర్శించనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష బాధ్యతలను పూర్తిగా స్వీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆమె ఆలనాపాలనా చూడటంతో పాటు చదువుకు అయ్యే ఖర్చునూ భరించాలని నిర్ణయించారు. మీడియాలో వచ్చిన ప్రత్యూష కథనాలు చూసి ఆయన చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను బంధువులు ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం ఆవేదన చెందారు.

సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజులుగా ప్రత్యూష దైన్యం తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. ప్రత్యూషకు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సీఎం కేసీఆర్ సతీసమేతంగా కలవనున్నారు.
 
నేను అండగా ఉంటా: పోసాని
ప్రత్యూష పరిస్థితి చూసి తన హృద్రయం ద్రవించిపోయిందని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె సంరక్షణ బాధ్యతను చూసేందుకు ప్రభుత్వం, బంధువులెవరూ ముందుకు రాకపోతే...ఆ బాధ్యతను తాను తీసుకుంటానని శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ప్రత్యూషను అక్కున చేర్చుకునేందుకు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి, ఆంధ్రమహిళా సభ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూషకు హాస్టల్ వసతితో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement