హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌కు పుష్పగుచ్ఛమిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును పరామర్శించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల అనంతరం ఫామ్‌హౌస్‌లో జారి పడిన కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరగగా, కొద్దిరోజుల నుంచి జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జగన్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఎదురెళ్లి జగన్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాగా కేసీఆర్‌ను పలకరించిన జగన్ పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. అనంతరం కేసీఆర్‌కు జరిగిన ప్రమాదం, సర్జరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తర్వాత ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జగన్ అల్పాహారం, తేనీరు తీసుకున్నారు.
కేసీఆర్‌కు తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా ఆయనకు కేటీఆర్, ఇతర నాయకులు కారు వద్ద వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. జగన్ వెంట ఏపీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.
నాలుగైదు వారాల్లో కేసీఆర్ రికవరీ మరో నాలుగైదు వారాల్లో కేసీఆర్ పూర్తిగా రికవరీ
అవుతారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. జగన్ పరామర్శ అనంతరం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రస్తుతం బెడ్ మీదే రెస్ట్ తీసుకుంటున్నారని, మరో నాలుగైదు వారాల్లో సాధారణ స్థితికి చేరుకుంటారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకే జగన్ వచ్చారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment