
సర్టిఫికేటుగాళ్లు
♦ గుత్తి కేంద్రంగా సదరం సర్టిఫికెట్ల మాఫియా
♦ వైకల్యం లేకున్నా ధ్రువీకరణపత్రాలకు దరఖాస్తు
♦ దివ్యాంగులను పంపి సర్టిఫికెట్లు పొందుతున్న వైనం
అనంతపురం మెడికల్ : దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిపొందాలంటే ‘సదరం’ సర్టిఫికెట్ తప్పనిసరి. వీరికోసమే డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ప్రతి గురువారం ఆర్థో, బుద్ధిమాంద్యత ఉన్న వారికి వైద్య పరీక్షలు చేస్తారు. కొత్త పింఛన్లు మంజూరు కావాలన్నా, రైలు పాసులు పొందాలన్నా, ఉద్యోగాలకోసమైనా సరదం సర్టిఫికెట్ కీలకంగా మారడంతో కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులిస్తే తాము సర్టిఫికెట్లు అందిస్తామంటూ దందా సాగిస్తున్నారు.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం సదరంలో జరుగుతున్న సడేమియాపై ‘సాక్షి’ వరుస కథనాలిచ్చింది. కొంత వరకు ప్రక్షాళన జరిగినా.. ఇప్పుడు మళ్లీ నకిలీ మాఫియా తెరపైకి వచ్చింది. గుత్తి కేంద్రంగా ఇద్దరు వ్యక్తులు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పామిడి మండలం రామదాసుపల్లికి చెందిన ఓ వ్యక్తితో పాటు గుత్తి మండలం కొత్తపేటకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
వైకల్యం ఉన్న వారే టార్గెట్
ధ్రువీకరణ పత్రాలు పొందడానికి మాయగాళ్లు వైలక్యం ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఇంతకుముందే వారికి సర్టిఫికెట్ ఉన్నా ఇతరుల ఆధార్‌ను ఇచ్చి సదరం శిబిరాలకు పంపుతున్నారు. ఆధార్ జిరాక్స్ ప్రతిలో ముఖం సరిగా కనిపించకపోవడం.. వైద్యులు కూడా వచ్చిన వ్యక్తిని మాత్రమే చూస్తుండడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోంది. ఇందుకోసం శిబిరాలకు వచ్చే వ్యక్తికి రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. దీంతో సకలాంగులకు కూడా సదరం సర్టిఫికెట్లు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఓ సంఘం ఫిర్యాదులో బట్టబయలు
కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందా గురువారం బట్టబయలైంది. అనంత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు గంగాధర్, ఈసీ సభ్యుడు బయపరెడ్డిలు సర్వజనాస్పత్రికి వచ్చి ఇతరుల ఆధార్ కార్డులు తీసుకొచ్చిన ఆరుగురిని గుర్తించారు. ఈ విషయాన్ని వైద్యులు ఆత్మారాం, సతీశ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే సదరం ఇన్‌చార్జ్ లలితకు తెలియజేశారు. ఆమె డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయమ్మలు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పట్టుబడిన ఎర్రిస్వామి (దర్గాహొన్నూరు), వెంకటరాముడు (పామిడి), పక్కీరప్ప (ఈరేపల్లి, పెద్దవడుగూరు మండలం), లక్ష్మన్న (గుత్తి), ఖాజా హుస్సేన్ (గుత్తి), శివ (పెద్దవడుగూరు)లను విచారించారు. డబ్బుకు ఆశపడి తాము వచ్చినట్లు కొందరు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై డీఆర్‌డీఏ అధికారులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దివ్యాంగుడైన ఇతడి పేరు ఖాజాహుస్సేన్. స్వగ్రామం గుత్తి. పెద్దవడుగూరు మండలం చిత్రచేడుకు చెందిన చిన్న మదార్(818145845688) తరఫున సదరం శిబిరానికి వచ్చి అధికారులకు దొరికిపోయాడు. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండడంతో రూ.300 కోసం ఆశపడి ఇలా చేశానని అతడు చెప్పుకొచ్చాడు. ఇలాంటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న సర్టిఫి‘కేటుగాళ్లు’ సకలాంగులకూ సదరం పత్రాలిప్పించేస్తున్నారు.