సుపరిపాలన దిశగా కొత్త ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిట ఉంచే దిశగా చర్యలు చేపట్టింది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరి సేవకు సిద్ధం అంటున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 532 మంది హాజరయ్యారు.
నెల్లూరు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వారికి మంగళవారం నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో, సర్వోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగాలు సాధించిన 843 మంది అభ్యర్థుల కోసం 17 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 532 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. మిగతా 86 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఆధ్వర్యంలో రోస్టర్, రిజర్వేషన్లు తయారు చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా అభ్యర్థుల అర్హతల పత్రాలను పరిశీలించారు. రద్దీ లేకుండా 50 మందికి ఒక టేబుల్‌ను ఏర్పాటు చేసి అందుకు తగిన సిబ్బందిని నియమించారు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఆయా శాఖల హెచ్‌ఓడీలను అందుబాటులో ఉంచారు. తొలిరోజు విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలకు సంబంధించి సెయింట్ జోసెఫ్ పాఠశాలలో అభ్యర్థుల
ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేశారు. అలాగే వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో ధ్రువపత్రాలను పరిశీలించారు. సర్వోదయ కళాశాలలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి అక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుశీల పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. నిరుద్యోగుల సందేహాలను తీర్చేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. జెడ్పీ కార్యాలయం వద్ద సైతం మరో మెరిట్ లిస్టును, కటాఫ్ మార్కుల వివరాలను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి జెడ్పీ సిబ్బంది అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేశారు. జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి మాట్లాడుతూ గైర్హాజరైన అభ్యర్థులకు ఈ నెల 28న, 30న మరో అవకాశం ఇస్తామని తెలిపారు. అప్పటికీ ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరువాత వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
అపోహలు వద్దు
గ్రామ/వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంత చిన్న సందేహాన్నయినా తీర్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రోస్టర్, మహిళా రిజర్వేషన్లు, దివ్యాంగుల రిజర్వేషన్లు, కటాఫ్ మార్కులు.. ఇవన్నీ అతి తక్కువ సమయంలో తయారు చేయడం అసాధ్యమన్నారు. ఇంత పెద్ద బాధ్యతలో ఏ ఒక్క చిన్న తప్పు జరగకుండా చూస్తున్నామన్నారు.
వదంతులు నమ్మవద్దు
కొంతమంది అవగాహన లేనివారు వాట్సాప్‌ల్లో వచ్చే వదంతులు వ్యాపింపజేయడం సరికాదని పంచాయతీరాజ్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ సుశీల పేర్కొన్నారు. ఎస్టీ కేటగిరిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 43.75 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇచ్చారని వాట్సాప్‌లో పెట్టారన్నారు. ఆ అభ్యర్థి చేస్తున్న ఉద్యోగం కారణంగా ప్రభుత్వం 9 మార్కులు వెయిటేజీ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి ఈ మార్కులు కలిపి మొత్తం 52.75 మార్కులు వచ్చాయన్నారు. ఎస్టీ కాబట్టి రిజర్వేషన్ వల్ల ఆ వ్యక్తికి ఉద్యోగం లభించిందని తెలిపారు. అలాగే ముజాహిద్ అలీ అనే వ్యక్తికి 45.25 మార్కులు వచ్చినా ఉద్యోగం ఎలా ఇచ్చారంటూ ప్రచారం చేయడం కూడా దారుణమన్నారు. ఆ వ్యక్తి దివ్యాంగుడని తెలిపారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని తెలిపారు. సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment