ఆడపిల్లని తెలిస్తే.. అబార్షన్!
ఆడపిల్లంటే మరో అమ్మ.. సృష్టికి మూలం.. ఇంటికి దీపం. కానీ, ఆడపిల్లను చిన్నచూపు చూస్తోంది నేటి సమాజం. సాకలేక, పెళ్లి చేయలేక భారంగా భావిస్తోంది. కడుపులో ఉండగానే ఉసురుతీస్తోంది. క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో భ్రూణ హత్యలు నిత్యకృత్యమైనా పట్టించుకునే నాథుడే లేడు. భువనగిరి డివిజన్‌లో వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం.
భువనగిరి, న్యూస్‌లైన్
జిల్లాలోని భువనగిరి డివిజన్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆడ శిశువుల మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. స్కానింగ్‌లో ఆడపిల్లని తేలితే వెంటనే అబార్షన్ చేయిస్తున్నారు. గత వారంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఆడ శిశివుల మృతదేహాలు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరి డివిజన్‌లో భ్రూణ హత్యలు ని త్యకృత్యమయ్యాయి.ఆస్పత్రులతో పాటు క్లిన్‌క్‌లలోనూ పెద్ద ఎత్తున అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పత్రికల్లో వచ్చినప్పుడే హడావుడి
ఆడి శిశవుల మరణాలపై పత్రికల్లో వచ్చినప్పుడే అధికారులు హడావుడి చేసి ఆ తరువాత మిన్నకుండా ఉంటున్నారనే విమర్శలున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రుల్లో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. తూతూ మంత్రంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వెళ్లిపోతున్నారనే కానీ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. చీకటిమాటున జరుగుతున్న భ్రూణహత్యలను నిలువరించి ఆడపిల్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే కాకుండా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలపైనా ఉంది.
కారణం ఏమంటే...
పేదరికంతో పాటు నిరక్షరాస్యత భ్రూణ హత్యలకు కారణమని తెలుస్తోంది. ఆడపిల్ల పుడితే సాకాలి, పెళ్లి చేయాలనే దురాలోచనలో కొందరు, వంశోద్ధారకుడి కోసం మరికొందరు మహిళలకు అబార్షన్లు చేయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టిన తర్వాత అమ్మకానికి పెడుతున్నారు. గతంలో తుర్కపల్లి, బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్ తండాల్లో అబార్షన్లు జరిగిన సంఘటనలు వెలుగుచూడగా తాజాగా భువనగిరి పట్టణంలో వెలుగు చూడడం చర్చనీయాంశమైంది. డివిజన్‌లోని మరికొన్ని గ్రామాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం.
రూ.10 వేల నుంచి రూ.20వేలు..
అనుభవం ఉన్న ఆర్‌ఎంపీలు గ్రామాల్లో ఆస్పత్రులు, క్లినిక్‌లు ఏర్పాటు చేసి మహిళలకు నిబంధనలకు విరుద్ధంగా స్కానిం గ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రజల అమాయకత, నిరక్షరాస్యత, పేదరికాన్ని వీరు ఆసరా చేసుకొని లక్షలు గడిస్తున్నారు. ఒక్కో అబార్షన్‌కు రూ.10 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.