ఛాన్స్ ఎవరికి?
- అయ్యన్నా ...బండారా?
- జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో
- అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుతారని అంచనాలు
- అర్ధరాత్రి వరకు బాబు నుంచి ఫోన్ల కోసం ఆశావహుల ఎదురుచూపు
- ధీమా సడలని గంటా వర్గీయులు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్‌స నెలకొంది. శనివారం అర్థరాత్రికే పదవి లభించే నేతలకు ఫోన్ వస్తుందని భావించినా అది జరగలేదు. సీనియర్ నేతలు అయ్యన్న,బండారు సత్యనారాయణ మూర్తి, ఎన్నికల ముందు పార్టీలో చేరిన గంటా శ్రీనివాసరావులలో ఇద్దరికి ఛాన్స్ రావచ్చని ఊహగానాలు వెలువడుతున్నాయి. తొలివిడత అయ్యన్న, బండారులలో ఒకరికి మాత్రమే పిలుపురావచ్చని తెలుస్తోంది.
ఒకే సామాజికివర్గానికి చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. శనివారం రాత్రికే పదవులపై స్పష్టత వస్తుందని నేతలంతా ఆశించారు. తమకు బాబు నుంచి ఫోన్ వస్తుందని అయ్యన్న, బండారు ఎదురు చూశారు. అలాంటి కాల్ రాలేదు. దీంతో సస్పెన్షన్ వీడలేదు. సీనియర్‌తోపాటు గతంలో అనేక పదవులు చేపట్టినందున తనకే అవకాశం ఉంటుందని అయ్యన్న విశ్వసిస్తున్నారు.
పార్టీ పెద్దల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనకు పంచాయతీరాజ్‌శాఖ దక్కవచ్చని అంచనా వేసుకుంటున్నారు. విశాఖ నగర పరిధిలో భీమిలి నుంచి గంటాకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిటీ పరిధిలో బండారుకు అవకాశం లేదని,గ్రామీణ జిల్లాలో తనకే పదవి వస్తుందని అయ్యన్న భావిస్తున్నారు. బండారు సైతం అంతే ధీమాతో ఉన్నారు. అయ్యన్నతో పోల్చితే తాను సౌమ్యు డినని విశ్లేషిస్తున్నారు.
గంటాకు విస్తరణలో... : కాపు సామాజికవర్గం కింద గంటాకు డిప్యూటీసీఎం పదవి వరిస్తుందని ఆయన వర్గీయులు భావించినా అనుహ్యంగా ఈ పదవి అదే సామాజికవర్గానికి చెందిన నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు ఇవ్వడానికి బాబు నిర్ణయించుకోవడంతో ఆశలు గల్లంతయ్యాయి. మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు.
ఒకసారి పార్టీనుంచి వెళ్లిపోయి మళ్లీ కొత్తగా వచ్చిన నేపథ్యంలో వెంటనే ఈయకు పదవిస్తే పార్టీ క్యాడర్,నేతలకు వేరే సంకేతాలు వెళ్తాయనే సంశయంతో అధిష్ఠానం కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మలివిడతలో ఛాన్స్ ఇద్దామనే ధోరణితో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. గంటా మాత్రం తనకు మొదటివిడతలో పదవి వస్తుందని క్యాడర్‌తో చెబుతున్నారు. అయ్యన్న,బండారు ఇద్దరిలో అంతిమంగా చంద్రబాబు అయ్యన్నవైపే మొగ్గుచూపుతారని పార్టీ కీలక నేతల ద్వారా తెలుస్తోంది.