ఇదేం ఆర్థిక క్రమశిక్షణ బాబూ?!
తాత్కాలిక కార్యాలయంలో సీసీ కెమెరాలకు రూ. 1.08 కోట్లు
లేక్‌వ్యూ అతిథిగృహంలో ఏర్పాటుకు నేడో, రేపో ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హైటెక్కు పాలన ఇంకా మరిచిపోలేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే వరకు క్రమశిక్షణ పాటించాల్సిందేనంటూ జీవోలిచ్చిన టీడీపీ సర్కారు.. స్వీయ ఆచరణలో మాత్రం ఇవేవీ కానరావడం లేదు. చెట్ల కింద కూర్చొనైనా పాలన సాగిస్తామని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు తన కార్యాలయానికి హంగుల కోసం ఏకంగా కోట్లు కుమ్మరించేస్తున్నారు. తన తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటున్న లేక్‌వ్యూ అతిథిగృహానికి కేవలం సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తమే ఏకంగా రూ. 1.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందుకు ఆర్థికశాఖ ఆమోదం కూడా పూర్తయింది. నిధుల మంజూరు వ్యవహారం ఆర్ అండ్ బీకి చేరింది.
ఇందుకు సంబంధించి మంగళ, బుధవారాల్లో జీవో విడుదల కానుంది. రెండు నెలల్లో ఏపీ పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని అటు మంత్రులు, ఇటు సీఎం సైతం ప్రకటనలు చేస్తున్నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసినట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వ విభాగాధిపతులు తమ కార్యాలయాల్ని తరలించాలని ఉన్నత స్థాయిలోనే సూచనలు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలలు తాత్కాలిక కార్యాలయం కోసం ఇంత మొత్తంలో నిధుల వెచ్చింపుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.