సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రూపొందించిన స్క్రిప్టు ప్రకారమే మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తమ పార్టీపైన, నాయకుడు జగన్‌పైనా విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. జేసీ చేసిన వ్యాఖ్యల్ని వారు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ దుకాణం మూతపడటంతో ఏంచేయాలో పాలుపోక జేసీ చివరకు చంద్రబాబు పంచన చేరుతున్నారని అన్నారు.
టీడీపీలోకి వచ్చే ముందు జగన్‌పై బురద జల్లి రావాలని చంద్రబాబు చేసిన సూచనల మేరకే దివాకర్‌రెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీలో చేరేందుకు జేసీ సోదరులు విశ్వప్రయత్నం చేశారని, వారికి అవకాశం లభించకపోవడంతో అక్కసుతో టికెట్ల కోసం డబ్బు అడుగుతున్నారంటూ చంద్రబాబు చెప్పిన మేరకు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీలో చేరడానికి జేసీ ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ధైర్యసాహసాలు గల నాయకుడని, సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది ఆయన ఒక్కరేనని కొద్ది రోజుల కిందట జేసీ స్వయంగా ఆయన నోటితోనే చెప్పిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలోకి రానివ్వకపోయేసరికి విమర్శలు చేస్తారా.. నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డానికి అసలు జేసీది నాలుకా, తాటిమట్టా అని అన్నారు. జేసీ అన్నివిధాలా రాజకీయ ప్రతిష్ట కోల్పోయిన వ్యక్తి అని, జగన్‌ను విమర్శిస్తే లబ్ధి చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్లుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తాడిపత్రి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పేది ఖాయమన్నారు.
బాబు స్క్రిప్టుతోనే జేసీ ఆరోపణలు
Published Sun, Mar 2 2014 2:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement