సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీ గూటికి చేరక ముందే ఆ పార్టీపై పెత్తనం చెలాయించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాను పోటీ చేసే అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకూ తాను సూచించిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఆ మేరకు ఏడుగురి పేర్లతో జాబితాను కూడా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇది నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్న టీడీపీ నేతలను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
జేసీ దివాకర్‌రెడ్డిని అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి.. జేసీ ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి పోటీకి దింపేందుకు చంద్రబాబు అంగీకరించారు. టీడీపీలో చేరేందుకు ముహూర్తాన్ని అన్వేషిస్తోన్న జేసీ సోదరులు.. బల నిరూపణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అనంతపురం లోక్‌సభ పరిధిలో జేసీ దివాకర్‌రెడ్డి.. తాడిపత్రి శాసనసభ స్థానం పరిధిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కలియతిరుగుతూ మద్దతు కూడగట్టేయత్నం చేస్తున్నారు.
భారీ జనసమీకరణతో టీడీపీలో చేరడం ద్వారా.. ఆ పార్టీపై ఆదిలోనే ఆధిపత్యం సాధించాలని జేసీ బ్రదర్స్ ఆరాటపడుతున్నారు. 1989 నుంచి 1994 వరకూ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఆ పునర్‌వైభవం సాధించడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికశాతం తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకోవడం ద్వారా టీడీపీపై పట్టు బిగించాలని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన ఆయన.. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో తాను సూచించిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికల వ్యయాన్ని జేసీ దివాకర్‌రెడ్డి భరించడానికి సిద్ధమైన నేపథ్యంలో.. ఆ ఒత్తిళ్లకు చంద్రబాబు తలొగ్గుతున్నట్లు టీడీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ‘సాక్షి’కి వెల్లడించారు. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, శింగనమల నుంచి కంబగిరి రాముడు, గుంతకల్లు నుంచి వెంకట శివుడుయాదవ్, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వరనాయుడు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, అనంతపురం నుంచి అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డిని బరిలోకి దింపాలని చంద్రబాబును జేసీ దివాకర్‌రెడ్డి కోరినట్లు టీడీపీలో భారీగా చర్చ సాగుతోంది. జేసీ అందించిన జాబితాపై టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో కలకలం..
టీడీపీ అధినేత చంద్రబాబుకు జేసీ దివాకర్‌రెడ్డి అందించిన జాబితా ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉన్నం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ.. జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం పయ్యావుల కేశవ్ అనుచరుడు ఉమామహేశ్వరనాయుడును అక్కడి నుంచి బరిలోకి దింపాలని సూచించడంపై ఉన్నం మండిపడుతున్నారు.
తాడిపత్రిలో జేసీ దివాకర్‌రెడ్డి అనుచరుడైన పులినాయుడుకు ఉమామహేశ్వరనాయుడు సమీప బంధువు. పయ్యావుల కేశవ్‌తో జేసీకి ఉన్న సాన్నిహిత్యం.. పులినాయుడు తన అనుచరుడు కావడంతో ఉమామహేశ్వరనాయుడును ఆయన ప్రతిపాదించడానికి దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణి టికెట్‌ను ఆశిస్తున్నారు. కానీ.. ఆ స్థానం నుంచి తమ అనుచరుడైన మైన్స్ వ్యాపారి కంబగిరి రాముడును బరిలోకి దించాలని జేసీ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.
గుంతకల్లు నియోజకవర్గం నుంచి జేసీ బరిలోకి దించాలని సూచించిన వెంకట శివుడు యాదవ్ సొంతూరు తాడిపత్రి నియోజకవర్గంలోని నందలపాడు. మొదటి నుంచి వెంకట శివుడు యాదవ్ జేసీకి సన్నిహితుడు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి అండదండలు ఉన్న వెంకట శివుడుయాదవ్ పేరును జేసీ ప్రతిపాదించడం ద్వారా.. ఆయనను తన వైపునకు తిప్పుకునే యత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం రాయదుర్గం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయిన దీపక్‌రెడ్డి స్వయాన జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డికి అల్లుడు. ఇప్పుడు రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడి నుంచి ఉషారాణిని బరిలోకి దించాలని మెట్టు కోరుతున్నారు. ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఇటీవల మెట్టుతో అనంతపురంలో రహస్యంగా సమావేశమై దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వం కోసం సహకరించాలని కోరినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురంలో టీడీపీ టికెట్‌ను మహాలక్ష్మి శ్రీనివాస్‌తోపాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌చౌదరి ఆశిస్తున్నారు. ప్రభాకర్‌చౌదరి ఆది నుంచి జేసీని వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరినీ కాదని.. తమకు సన్నిహితుడైన కాాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును జేసీ ప్రతిపాదించడంపై మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్‌చౌదరి మండిపడుతున్నారు.
అక్కడా ఆధిపత్యం కోసం..
అనంతపురం లోక్‌సభకే జేసీ దివాకర్‌రెడ్డి పరిమితం కావడం లేదు. హిందూపురం లోక్‌సభపైనా కన్నేశారు. ప్రస్తుతం ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరదాపురం సూరి, జేసీ దివాకర్‌రెడ్డికి సన్నిహితుడు. 2009 ఎన్నికల్లో ధర్మవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి విజయం కోసం జేసీ దివాకర్‌రెడ్డి కృషి చేశారని అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే అందుకు తార్కాణం. ఇప్పుడు ఆ స్థానం నుంచి గోనుగుంట్ల విజయ్‌కుమార్‌ను బరిలోకి దింపాలని పరిటాల సునీత ప్రతిపాదిస్తున్నారు. కానీ.. జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం ధర్మవరం నుంచి వరదాపురం సూరినే దించాలని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తనతోపాటు టీడీపీలో చేరితే ఏదో ఒక సీటు ఇప్పిస్తానని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి జేసీ దివాకర్‌రెడ్డి హామీ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న వారిని కాదని.. ఇప్పటికీ పార్టీలో చేరని జేసీ మాటే చెల్లుబాటు అవుతోందంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. పయ్యావుల కేశవ్ తాను చేయాల్సిన పనులను జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా చేయిస్తున్నారని పరిటాల సునీత వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో చిక్కిశల్యమైన టీడీపీని జేసీ చేరిక మరింత ఇరకాటంలోకి నెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
..ఇలా మొదలైంది!
Published Fri, Mar 7 2014 3:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement