భగీరథుడిగా మారుతా
సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఫిబ్రవరి నాటికి హంద్రీ-నీవా కాలువ ద్వారా తాగు, సాగునీరు అందించి భగీరథుడిగా మారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏడాది తిరక్కుండానే హామీని నెరవేర్చడమే ధ్యేయంగా ఉడుము పట్టుపట్టినట్లు చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. పలు పథకాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రామకుప్పం, శాంతిపురంలో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు.
కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. అందుకే కుప్పం అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తానన్నారు. రాబోయే ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా చేస్తానని సీఎం ప్రకటించారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, కుప్పంతో పాటు జిల్లాలో కరువు తాండవిస్తోందని చెప్పారు. అడవులు ఎండిపోవడంతో తిండి, నీరు లేక ఏనుగులు ఊళ్లలోకి వస్తున్నాయని తెలిపారు.
నీరు-చెట్టు ద్వారా భూగర్భజలాలు పెంచుతామన్నారు. క్రీడాభివృద్ధి కోసం శాంతిపురం మండలం పేరూరు వద్ద స్టేడియం నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తారురోడ్లు, అంతర్గత సిమెంట్‌రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కుప్పాన్ని స్మార్ట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వేసవి నాలుగు నెలల్లో జిల్లాలోని కరువుప్రాంతాలకు ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. పశువులకు సైతం నీళ్లు ఇస్తామన్నారు. ఇందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సీఎం చెప్పారు.
కరువు మండలాలకు సబ్సిడీపై గ్రాసం, దాణా ఇస్తామన్నారు. అనంతపురం కరువు ప్యాకేజీ తరహాలో జిల్లాలో ఐదు ఎకరాలకుపైగా ఉన్న రైతులకు సైతం 90 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తున్నట్లు సీఎం చెప్పారు. కుప్పం కేంద్రంగా అటు కర్ణాటక, తమిళనాడు మీదుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేసి కుప్పాన్ని జంక్షన్ చేస్తామన్నారు. కుప్పం ప్రజలు ఏది అడిగినా చేస్తానని, వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, శంకర్, జెడ్పీ చైర్‌పర్శన్ గీర్వాణీ, మాజీ మంత్రి కుతూహలమ్మ తదితరులు పాల్గొన్నారు.