వికేంద్రీకరణ కుదరదు.. అన్నీ ఒకచోటే: చంద్రబాబు
రాష్ట్ర రాజధాని విషయంలో అధికార వికేంద్రీకరణ కుదరదని, ప్రధాన కార్యాలయాలు అన్నీ ఒకచోటే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బద్దలుకొట్టేశారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు.
''కొన్ని సూచనలిచ్చారు. ఇంకా కొంతమంది ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. అవి పనికొస్తాయనుకుంటే పాజిటివ్గా పరిశీలిస్తాం. వ్యవసాయ భూముల సేకరణ వల్ల ఇబ్బంది అవుతుందని కొందరు ప్రస్తావించారు. ఎక్కడైనా వ్యవసాయ భూములు తీసుకుంటే ఎకరా భూమికి నీరు ఆదా అయితే వేరేచోట రెండెకరాలకు నీరు ఆదా అవుతుంది. వికేంద్రీకరణ చేయాలని కొంతమంది అన్నారు. ఎక్కడైనా పనుల మీద వచ్చినవాళ్లు వేర్వేరు చోట్లకు తిరగడం కుదరదు. అందుకని అధికార వికేంద్రీకరణ కుదరదు. డిజిటల్ ఏపీ అయినా.. వాటిని నడిపించేది మనుషులే. ఒక్కో ఊళ్లో ఒక్కో కార్యాలయం పెట్టాలంటే ప్రజలకు సౌకర్యంగా ఉండదు. రైతులను కోరుతున్నా.. మంచి రాజధాని కడదాం, మీకు కూడా లాభసాటిగా ఉండేలా తయారుచేద్దాం. అందరి సహకారం అవసరం.
విశాఖపట్నంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే దాన్ని మరింత బలోపేతం చేసి మరింత ట్రాఫిక్ పెంచాల్సి ఉంటుంది. లాండ్ పూల్ సిస్టంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తిరుపతిలో నా ఇంటి ముందే పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ రాజధాని కావాలని నాకూ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ లాంటివి కట్టింది నేనే. సైబరాబాద్ నగరాన్ని కట్టింది నేనే. విశాఖలో ఐఐటీ కావాలన్నారు. ఒక ఐఐటీ ఇప్పటికే కేటాయించారు. రెండోది వస్తే అక్కడ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం. అరకు, లంబసింగి లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం'' అన్నారు.