సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సంద ర్భంగా తెలంగాణలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంధ్ర సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో ఆదివారం ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు వర్గాలంటున్నాయి. ఈ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఖమ్మం నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నిలిపివేయనున్నారు. ఈ రూట్లలో జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, ఈ చెక్‌పోస్టుల నుంచి వెళ్లే వాహనాలను శనివారం రాత్రి 10 గంటల నుంచే నిలిపివేసి.. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత పంపుతామని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరులోని నాగార్జున వర్శిటీ సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించారు. అంటే శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఎలాంటి రవాణా వాహనాలు సరిహద్దులు దాటి వెళ్లవు.
ఏపీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇది జూన్ 8 నుంచి అమల్లోకి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 1 వరకు రాష్ట్రపతి పాలన ఉండటం, ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందున దాన్ని పొడిగించడం తెలిసిందే.