వైఎస్సార్‌సీపీలో చేరిన తోట చంద్రశేఖర్
మాజీ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ నేత తోట చంద్రశేఖర్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ దీక్షా శిబిరానికి వచ్చి ఆయన మద్దతు ప్రకటించారు. చంద్రశేఖర్ అభిమతం మేరకు ఆయన్న జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ అని, అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతున్నానని చెప్పారు.
కొంతమంది సామాజిక న్యాయమంటూ, వ్యక్తిగత లబ్ధి చూసుకొని ప్రజలను నట్టేటముంచారని చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాంటి పరిపాలన మళ్లీ జగన్ వల్లే సాధ్యమవుతుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని, అందుకే ఆయనకు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్టు చంద్రశేఖర్ చెప్పారు.