అగ్రిగోల్డ్‌: న్యాయ విచారణపై వెనకడుగు | Chandrababu Back Step on legal proceedings about Agrigold Issue | Sakshi
Sakshi News home page

న్యాయ విచారణపై వెనకడుగు

Published Wed, Nov 21 2018 4:56 AM | Last Updated on Wed, Nov 21 2018 11:32 AM

Chandrababu Back Step on legal proceedings about Agrigold Issue - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ భూములను కారుచౌకగా కొట్టేశారనే ఆరోపణలపై జ్యుడీషియల్‌ కమిటీతో న్యాయ విచారణ జరిపిస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోకుండా బాధితులను గాలికి వదిలేసింది. విచారణ కమిటీ ఏర్పాటైతే ప్రభుత్వంలో కొనసాగుతున్న వారి భూ దందాలు వెలుగులోకి వస్తాయనే భయంతో దీనిపై వెనక్కి తగ్గిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సాక్ష్యాధారాలతో సభ దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేత
అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో బుధవారం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైన బాధితులు.. హాయ్‌ల్యాండ్‌ను కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2016, 2017 బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం తెలిసిందే. ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు అగ్రిగోల్డ్‌ భూములను కాజేసి డిపాజిటర్ల పొట్టకొట్టేందుకు ప్రయత్నించటాన్ని ఆయన సాక్ష్యాధారాలతో సభకు వివరించారు. మంత్రులు, సీఎం, స్పీకర్‌ కూడా అడుగడుగునా ప్రతిపక్షనేత ప్రసంగానికి అడ్డుపడినప్పటికీ బాధితుల తరపున చట్టసభలో పోరాడారు. 

అటాచ్‌మెంట్‌కు నెల ముందు భూములు కొన్న మంత్రి భార్య...
అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని 2016 మార్చి 28వ తేదీన వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం చేపట్టాలని, సీఐడీ విచారణతో బాధితులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. విలువైన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడలోని భూములను అటాచ్‌మెంట్‌ నుంచి మినహాయించి కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను అసెంబ్లీలో ఎండగట్టారు. అటాచ్‌మెంట్‌కు కేవలం నెల ముందు అగ్రిగోల్డ్‌ భూములను మంత్రి భార్య వెంకాయమ్మ కొనుగోలు చేశారని వెల్లడించారు. 

20 నిమిషాలు టైమిస్తే ఆధారాలతో నిరూపిస్తానన్న ప్రతిపక్ష నేత..
2017 మార్చి 23న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కూడా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌ గట్టిగా ఒత్తిడి తెచ్చారు. అగ్రిగోల్డ్‌ అనుబంధ సంస్థ హాయ్‌ల్యాండ్‌ సీఈగా, డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఉదయ దినకర్‌ నుంచి 14 ఎకరాల భూమిని మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ తక్కువ ధరకు కొనుగోలు చేశారని, అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా సీఐడీ నిర్లక్ష్యం వహిస్తోందని సభ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేయాలంటూ వాయిదా తీర్మానం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ కమిటీ నియమించాలని  కోరారు. 

బాధితులకు రూ. 1,182 కోట్లు ఇస్తే 13,83,574 మంది డిపాజిటర్లకు ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. మంత్రి ప్రత్తిపాటి భార్య అగ్రిగోల్డ్‌ భూములను కొనుగోలు చేయటానికి సంబంధించి 20 నిముషాలు సమయం ఇస్తే ఆధారాలన్నీ బయట పెడతానని ప్రతిపక్షనేత సభలో పేర్కొన్నా స్పీకర్‌ అందుకు అనుమతి ఇవ్వలేదు. 

జ్యుడీషియల్‌ కమిటీపై వెనక్కి
ఈ సమయంలో సీఎం చంద్రబాబు శాసన సభలో మాట్లాడుతూ విపక్ష నేత మంత్రిపై చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో మంత్రి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలపై జ్యుడీషియల్‌ విచారణ కోసం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీలో ఎలా స్పందిస్తుందో చూశాక విచారణ కమిటీపై నిర్ణయం తీసుకుంటామని, షరతులకు వారు (విపక్షం) అంగీకరించినా అంగీకరించకున్నా జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటుపై ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే గత ఏడాది మార్చి 23వ తేదీన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన ప్రకటనను అనంతరం సీఎం విస్మరించారు. ఏడాదిన్నర దాటినా జ్యుడీషియల్‌ కమిటీ ఊసే మరిచారు. ఈ కమిటీ ఏర్పాటైతే మంత్రి ప్రత్తిపాటి భార్య కొనుగోలు చేసిన భూముల వ్యవహారమే కాకుండా హాయ్‌ల్యాండ్, యారాడలోని విలువైన భూములను కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు వెలుగు చూస్తాయనే భయంతో వెనక్కి తగ్గారు. ‘అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తే దానికి కట్టుబడి ఉండాలి. అసెంబ్లీలో చెప్పిన మాటకే విలువ లేకపోతే ఇక అసెంబ్లీకి విలువేమిటి?’ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

హాయ్‌ల్యాండ్‌ను కాజేసే ఎత్తుగడ..
రాజధానికి అత్యంత సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ భూములు అత్యంత విలువైనవి. వీటిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితుడైన పోలీస్‌  ఉన్నతాధికారి ద్వారా అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీఐడీ విచారణకు మోకాలడ్డుతూ వచ్చారు. చివరకు హైకోర్టు ఆగ్రహించడంతో అగ్రిగోల్డ్‌ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో హాయ్‌ల్యాండ్‌ ఎండీ ఆలూరు వెంకటేశ్వరరావుతో ప్రభుత్వ పెద్దలే హైకోర్టులో వ్యూహాత్మకంగా అఫిడవిట్‌ దాఖలు చేయించినట్లు ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్‌కు,  హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదని అఫిడవిట్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ పెద్దల వ్యూహం బెడిసికొట్టింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌దేనని ప్రకటనలు ఇప్పించారని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.  

భూముల కొనుగోలు నిజమేనని ఒప్పుకున్న ప్రత్తిపాటి
ప్రతిపక్ష నేత ప్రకటించినట్లుగా అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకల్‌ నుంచి తన భార్య భూములు కొనుగోలు చేయడం నిజమేనని మంత్రి పుల్లారావు కూడా అంగీకరించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో ఇవ్వడానికి నెల ముందు ఈ భూములను కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను కీలక వ్యక్తులు కొనుగోలు చేసిన తరువాత అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడం గమనార్హం. సీఐడీ విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్‌కు 16,857 ఎకరాలతో పాటు 82,707 ఇళ్ల స్థలాలు ఉన్నాయని గుర్తించినట్లు  2016 మార్చిలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ఆస్తులు వేలం వేస్తామన్నారు. ఇప్పుడు విలువైన భూములు మాయం కావడం వెనుక రహస్యం ఏమిటో ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement