
సాక్షి, అమరావతి : కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయకుండా చివరి వరకూ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఆయన టీడీపీ అభ్యర్థులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చివరిదాకా ఓపిగ్గా ఉండే వారినే ఏజెంట్లుగా పెట్టాలని సూచించారు.
కౌంటింగ్‌కు ముందస్తు ప్రిపరేషన్ అతి ముఖ్యాంశమని, ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక బృందాలు ఏర్పడాలని చెప్పారు. గతంలో కౌంటింగ్ అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలని, ఒక అడ్వకేట్, ఒక ఐటీ నిపుణుడు బృందంలో ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, ఇందుకోసం టీడీ జనార్దన్, సాయిబాబు తదితరులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.