సాక్షి, అమరావతి: యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ) ఆహ్వానం మేరకే తాను అమెరికా పర్యటనకు వెళ్లానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆహ్వానం లేకుండా వెళ్లానని విమర్శిస్తున్నా రంటూ.. యూఎన్‌ఈపీ ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్)లో భాగం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం తన అమెరికా పర్యటన గురించి వివరించారు. బీజేపీ నాయకులు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శిస్తున్నారనే ఆహ్వానపత్రాన్ని ఇచ్చామని, దాన్ని చూశాక కూడా ప్రశ్నించడమేంటని ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తాను అమెరికా వెళితే వాళ్లకు ఎందుకంత బాధ, కడుపుమంటని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అనేక దేశాలు తిరిగి ఏం సాధించారు? వృద్ధిరేటులో ఏమైనా సాధించారా? ఎందులో ఏమి చేశారు? నేను ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి వెళితే విమర్శిస్తున్నారు’’ అని అసహనం వెలిబుచ్చారు. వంద దేశాల్లో ఒక దేశంగా వెళ్లి మాట్లాడడం కాదని, ఒక కాన్సెప్ట్‌పై వెళ్లి దానిగురించి చెప్పడం గొప్పని, తాము అదే చేశామని అన్నారు. తన అమెరికా పర్యటన ప్రపంచానికే ఒక అవగాహన కల్పించిందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్‌ఎఫ్–ప్రకృతి సేద్యం)పై తొలిసారి ఐక్యరాజ్యసమితిలో చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జెడ్‌బీఎన్‌ఎఫ్‌ను బెస్ట్ ప్రాక్టీస్‌గా ఐక్యరాజ్యసమితి గుర్తించి అభినందించిందని, ఇది నమ్మశక్యం కాదని అందరూ ఆశ్చర్యపోయారని, చాలా దేశాలవారు తాము వచ్చి చూస్తామన్నారని చెప్పారు. సేంద్రీయ సేద్యానికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అమరావతిలో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారని, ఇది రాష్ట్రానికి పెద్ద విజయమని చెప్పారు. పాలేకర్ అన్ని రాష్ట్రాల్లో సేంద్రీయ సేద్యాన్ని ప్రారంభించినా, కేవలం మన రాష్ట్రంలోనే అమలవుతోందని చెప్పారు.
విమర్శల్లోనే బీజేపీ ఫస్ట్..
బీజేపీ దేశానికి ఏవిధమైన గుర్తింపును తీసుకొచ్చిందని సీఎం ప్రశ్నిస్తూ.. తాము టూరిజం, హౌసింగ్, నరేగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అన్నింట్లోనూ ఫస్ట్‌లో ఉన్నామని, బీజేపీ విమర్శల్లో ఫస్ట్ ఉందని ఆరోపించారు. సాధించినదేంటో గర్వంగా చెప్పుకునే పరిస్థితి వారికి లేదని, అసూయ తప్ప మరొకటి కనిపించట్లేదన్నారు. రాఫెల్ గురించి ఇప్పటివరకు ప్రధాని నోరు విప్పట్లేదన్నారు. తన విశ్వసనీయతే తన బలమని, తన కేరక్టరే తనకున్న ఆస్తి అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే తనపై దాడులు చేయడానికి పూనుకుంటారా? అని ప్రశ్నించారు. 24 గంటలూ తనపై బురద వేయాలని చూస్తున్నారని, తనపై దాడులు మొదలుపెట్టారని, దానికి ఇక్కడ విపక్షాలు మద్దతు పలుకుతున్నాయని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తిని కేంద్రం కాపాడుతోందంటూ పరోక్షంగా ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలపై ఆయన సమాధానం దాటవేశారు.
పవన్ తన సమస్య చెబితే సెక్యూరిటీ కల్పిస్తాం
పవన్ కల్యాణ్ ప్రాణహాని ఉందని చెబుతున్నారని, ఆయన తన సమస్యను చెబితే సెక్యూరిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. తాము నేరచరిత్రకు బలయ్యాం తప్ప ఎప్పుడూ నేరచరితులను పార్టీలో ప్రోత్సహించలేదన్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపు చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవమేంటో వేచి చూద్దామన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమని నక్సల్స్ చంపడం దారుణమన్నారు. ఈ హత్యలు శాంతిభద్రతల వైఫల్యమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. శాంతిభద్రతలు బాగానే ఉన్నా ఇలాంటి కొన్నింటిని కంట్రోల్ చేయాల్సిన అవసరముందన్నారు. నక్సలిజం, టెర్రరిజాన్ని తానే కంట్రోల్ చేశానని చెప్పారు.
ఈ హత్యల వెనుక ప్రతిపక్షం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని, రాజకీయం కోసమే ఇవి చేయించారని కొందరు అంటున్నారని చెప్పారు. వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని, పరిపాలన గురించి వారికేం తెలుసని వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేశారు. కాగా, అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో మంత్రులు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికినవారిలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment