చెత్త కుప్పలతో నిండిన స్టేడియం గ్రౌండ్
విజయవాడ స్పోర్ట్స్ : అడుగడుగునా ఖాళీ మంచినీళ్ల ప్యాకెట్ల కవర్లు, కరపత్రాలు, చెత్తా చెదారంతో నిండి ఉంది. ఇదేదో డంపింగ్ యార్డు అనుకుంటే పొరపాటే. నిత్యం వందలాది మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే ఐజీఎంసీ స్టేడియం దుస్థితి. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షా ఫలితం ఇది. ప్రభుత్వం నాలుగేళ్లుగా క్రీడల కోసం వినియోగించాల్సిన స్టేడియాన్ని క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించడంతో గ్రౌండ్ అంతా ధ్వంసమై క్రీడాకారుల ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు కన్పిస్తున్నాయి. తాత్కలిక టాయిలెట్లతో స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ట్యాంక్ నిండిపోయి తీవ్ర దుర్ఘంధం వ్యాపిస్తోంది.
నేలంతా చిత్తడిగా మారింది. లారీలు తిరగడంతో గ్రౌండ్ ధ్వంసమైంది. మరో రెండు రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభం కానున్న నేపధ్యంలో.. గ్రౌండ్ దుస్థితి క్రీడాకారులను ఆగ్రహానికి గురిచేస్తోంది. పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరి కొద్ది పట్టనుంది. దీక్ష కోసం సుమారు నాలుగు లక్షల ప్యాకెట్లు అందుబాటులో పెట్టినట్లు సమాచారం. దీక్షకు వచ్చిన వారు వాటిని సేవించేందుకు ఆసక్తి చూపకపోవడంతో భారీగా మిగిలిపోయాయి. స్థానికులు కొంతమంది వాటర్, మజ్జిగ ప్యాకెట్ల బస్తాలు తీసుకువెళ్లినా ఇంకా చాలా మిగిలాయంటే ప్రజాధనం ఎంతగా వృథా అయిందో అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment