IGMC Stadium
-
ధర్మ పోరాట దీక్ష ఫలితం
విజయవాడ స్పోర్ట్స్ : అడుగడుగునా ఖాళీ మంచినీళ్ల ప్యాకెట్ల కవర్లు, కరపత్రాలు, చెత్తా చెదారంతో నిండి ఉంది. ఇదేదో డంపింగ్ యార్డు అనుకుంటే పొరపాటే. నిత్యం వందలాది మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే ఐజీఎంసీ స్టేడియం దుస్థితి. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షా ఫలితం ఇది. ప్రభుత్వం నాలుగేళ్లుగా క్రీడల కోసం వినియోగించాల్సిన స్టేడియాన్ని క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించడంతో గ్రౌండ్ అంతా ధ్వంసమై క్రీడాకారుల ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు కన్పిస్తున్నాయి. తాత్కలిక టాయిలెట్లతో స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ట్యాంక్ నిండిపోయి తీవ్ర దుర్ఘంధం వ్యాపిస్తోంది. నేలంతా చిత్తడిగా మారింది. లారీలు తిరగడంతో గ్రౌండ్ ధ్వంసమైంది. మరో రెండు రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభం కానున్న నేపధ్యంలో.. గ్రౌండ్ దుస్థితి క్రీడాకారులను ఆగ్రహానికి గురిచేస్తోంది. పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరి కొద్ది పట్టనుంది. దీక్ష కోసం సుమారు నాలుగు లక్షల ప్యాకెట్లు అందుబాటులో పెట్టినట్లు సమాచారం. దీక్షకు వచ్చిన వారు వాటిని సేవించేందుకు ఆసక్తి చూపకపోవడంతో భారీగా మిగిలిపోయాయి. స్థానికులు కొంతమంది వాటర్, మజ్జిగ ప్యాకెట్ల బస్తాలు తీసుకువెళ్లినా ఇంకా చాలా మిగిలాయంటే ప్రజాధనం ఎంతగా వృథా అయిందో అర్థమవుతోంది. -
ఇందిరాగాంధీ స్టేడియంపై గద్దలు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం (ఐజీఎంసీ)పై కూడా ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేటు సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సంసిద్ధమవుతోంది. దాదాపు రూ.1,350 కోట్లు మార్కెట్ విలువ ఉన్న స్టేడియం భూములను ధారాదత్తం చేసేందుకు పన్నాగం సాగుతోంది. స్టేడియం భూములపై కన్ను విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఐజీఎంసీ క్రీడారంగానికి ఎంతో కీలకమైంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ, ఎల్బీ స్టేడియాల తరువాత ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు, క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో స్టేడియాల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం ప్రాధాన్యం మరింత పెరిగింది. కోట్లాది రూపాయాల నిధులతో ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల శాప్ ప్రధాన కార్యాలయం ఇక్కడే (స్టేడియంలోనే) ఉంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ స్టేడియం భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. శాప్ అధికారులకు కూడా తెలియకుండా ఆ సంస్థ ఎండీ ఎన్.బంగారురాజు ఇచ్చిన ఆదేశాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంస్థ సామగ్రి మొత్తం గుంటూరు బీఆర్ స్టేడియానికి తరలించమని ఆయన ఆదేశించారు. అంటే ఇక్కడ నుంచి శాప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా రూ.6 కోట్లతో ఈ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ఆ ట్రాక్‌ను ముందే వ్యూహాత్మకంగా విశాఖపట్నం తరలించేశారు. తద్వారా ఇక్కడ క్రీడా సదుపాయాలు ఏవీ అభివృద్ధి చేయకుండా కొంతకాలంగా పావులు కదుపుతూ వచ్చారు. తాజాగా ఏకంగా శాప్ కార్యాలయాన్నే తరలించేయాలని నిర్ణయించారు. ఒకసారి స్టేడియాన్ని ఖాళీ చేస్తే తరువాత కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. త్వరలోనే ఆ స్టేడియం భూములను పర్యాటక ప్రాజెక్టుల పేరుతో పీపీపీ పద్ధతిలో తమ బినామీ సంస్థలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి గొడ్డలిపెట్టు వంటి ఈ నిర్ణయంపై క్రీడారంగ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నటరాజు తాండవమాడె..
నటరాజు పరవశించేనా.. మయూరాలు ముచ్చటపడి నర్తించేనా.. అన్నట్టుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఘల్లుమనె గజ్జెల సవ్వళ్లతో మార్మోగిపోయింది. ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నృత్య ప్రదర్శనలు రసజ్ఞులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. విజయవాడ (వన్‌టౌన్) : ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతున్న ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం అంబరాన్నంటింది. ప్రారంభోత్సవం అనంతరం లబ్ధప్రతిష్టులైన కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ప్రేక్షకులను పులకింపజేశాయి. 108 అడుగుల విశాలమైన వేదికపై కళాకారుల నాట్య విన్యాసాలు ఆధ్యాత్మికానందాన్ని కలిగించాయి. రాధేశ్యామ్.. మైమరపించెన్ కూచిపూడి నాట్యానికి సిద్ధేంద్రయోగి సూచించిన సంప్రదాయశైలిలో కూచిపూడి నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్ నాట్యపూర్వరంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. 'అంబా పరాక్.. శారదాంబ పరాక్..' అంటూ సామూహిక గురు ప్రార్థన నిర్వహించారు. స్వప్న‘సుందరం’ 'భామా కలాపం' అంశాన్ని పద్మభూషణ్ స్వప్నసుందరి అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. ప్రవేశ దరువుతో పాటు పంచ చామరాలు, మన్మద విరహ సన్నివేశాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఆరు పదులు దాటినా అలుపెరగక ఆమె ప్రదర్శించిన తీరు అద్భుతంగా సాగింది. ప్రదర్శనను తిలకించిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రామ సుబ్రహ్మణ్యం ఆమెను సన్మానించారు. ‘శోభా’యమానం పద్మశ్రీ శోభానాయుడు అమాయకపు యువతి పాత్రలో చూపించిన నాట్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సిగ్గులొలికే సన్నివేశాలకు ఆమె నాట్యం రక్తికట్టించింది. ఇంకా.. సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు పద్మశ్రీ జయరామారావు, వనశ్రీరావు ‘థిల్లానా’ తదితర అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. నాట్యగురువు ఏబీ బాలకొండలరావు 'కూచిపూడి పద్య నాట్యం' అంశాన్ని ప్రదర్శించారు. డాక్టర్ పద్మజారెడ్డి వివిధ అమ్మవారి శక్తి రూపాలను వివరిస్తూ 'శక్తి' అంశానికి నర్తించారు. అలాగే, నాట్య గురువులు భాగవతుల సేతురామ్, డాక్టర్ జ్వలాశ్రీకళ బృందం, డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, డాక్టర్ జయంతి రమేష్ బృందం, డాక్టర్ పప్పు వేణుగోపాల్, భాగవతుల వెంకటరామశర్మ, అజయ్ బృందం, పసుమర్తి రామలింగశాస్త్రి తదితరుల నృత్యాలు అద్భుతంగా సాగాయి. 'సుజనరంజని–నాట్యమంజరి' సావనీర్ ఆవిష్కరణ ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా డాక్టర్ జుర్రు చెన్నయ్య, డాక్టర్ వాసుదేవసింగ్ ఆధ్వర్యంలో ప్రచురించిన 'సుజనరంజని–నాట్యమంజరి' సావనీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, రామసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
పిల్లల్లో ఊబకాయాన్ని అధిగమిద్దాం
విజయవాడ(లబ్బీపేట) : పిల్లల్లో ఊబకాయంపై అవగాహనకు విజయవాడ ఫిజియోస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ర్యాలీని మాచవరం ఎస్ఐ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ యలమంచిలి కాంప్లెక్స్ వరకు. అక్కడి నుంచి తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఫిజియోస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు సరైన వ్యాయామం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నిద్రలేచిన వద్ద నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పుస్తకాలతోనే సరిపోతుందని చెప్పారు. పాఠశాలల్లో వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపక పోవడంతో పిల్లల్లో ఊబకాయులు పెరిగిపోతున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ఆహార అలవాట్లు ఒబెసిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని వివరించారు. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అధిగమించేందుకు వ్యాయామం తప్పనిసరి అన్నారు. సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యకరమని, ప్రతి రోజూ కనీసం గంటపాటు పిల్లలు సైకిల్ వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో సుమారు 200 మందికిపైగా ఫిజియోలు, ఫిజియో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ సుదీప్తి, డాక్టర్ కీర్తిప్రియ, డాకట్ర్ మనోజ్ పాల్గొన్నారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్: 35 నుంచి 90ఏళ్ల నవయువకుల ఉరకలేసే ఉత్సాహం మధ్య ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల పైబడిన వయసులోనూ పోటీల్లో పాల్గొని గెలవాలనే ఆంక్ష ఉన్న వారంతా నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. 2018లో అమరావతిలో జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావం వల్ల తక్కువ మంది పోటీల్లో పాల్గొన్నట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌ను అభినందించారు. గౌరవ అతిథులుగా ఎమ్యెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాంతాతయ్య, మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు భగవాన్, రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, కార్యదర్శి టి.సుబ్బారావు, పోటీల నిర్వహక కమిటీ కార్యదర్శి ఎన్ఎస్ ప్రసాద్, జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొనగా, సాంకేతిక సహకారాన్ని శాయ్ అథ్లెటిక్స్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు హాజరయ్యారు. -
ఉత్సాహంగా ఎక్సైజ్ ఆటల పోటీలు
విజయవాడ స్పోర్ట్స్ : జిల్లా ఎక్సైజ్ శాఖ ఆటల పోటీలు గురువారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. పోటీలను ఆ శాఖ డెప్యూటీ కమిషనర్ డీవీ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కబడ్డీ, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల నుంచి జనవరి 6వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ఎక్సైజ్ శాఖ ఆటల పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేయనున్నారు. -
ఉత్సాహంగా బీ–డివిజన్ లీగ్ ఫుట్‌బాల్
విజయవాడ స్పోర్ట్స్ : స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న బీ–డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ ఉత్సాహభరితంగా సాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో ఆంధ్ర లయోల కళాశాల జట్టు 6–0 తేడాతో ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై గెలిచింది. కాకతీయ జూనియర్ కళాశాల జట్టు 1–0 తేడాతో లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు పై నెగ్గింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్ ద్వారా పి.జాషువా గోల్ చేసి గెలిపించాడు. మరో మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ కళాశాల జట్టు 4–2 తేడాతో పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ కళాశాల జట్టులో కె.దుర్గారావు రెండు గోల్స్, కె.రాజా, జె.రాజా చెరో గోల్ చేశారు. -
జీవితాంతం ఆడే ఆట టెన్నిస్
విజయవాడ స్పోర్ట్స్ : జీవితాంతం ఆడగల ఆట టెన్నిస్ అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోధవేజీ – ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ అసోసియేషన్ (ఐయిస్టా) టోర్నీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెన్నిస్ ఆడడం ద్వారా చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. రాజధానిలో టెన్నిస్‌కు మంచి ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. మండలానికి ఓ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శారీరక అక్షరాస్యత, యోగా వంటివి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టోర్నీ స్పాన్సర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 8 టోర్నీలు నిర్వహించామని, విజయవాడలోనే 20 టెన్నిస్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. టెన్నిస్‌కు అమరావతి టూరిజం కేంద్రంగా తయారు కావాలన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు, ఐయిస్టా ప్రధాన కార్యదర్శి డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి బుద్దా రాజు, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, రామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు సింగిల్స్ మెయిన్ డ్రా మొదటి రౌండ్ ఫలితాలు – 65+ సింగిల్స్ విభాగంలో డాక్టర్ రామ్మోహన్ 6–2, 6–3 తేడాతో బీఏ ప్రసాద్‌పై, సీబీఎస్ వరప్రసాదరావు 6–3, 3–6, 10–7 తేడాతో ఎంజే సామ్యూల్‌పై, పీకే బాబా 6–4, 6–4 తేడాతో వై.భాస్కరరావుపై, ఏఎస్ఎన్ రాజు 6–2, 6–2 తేడాతో ఆర్టీఆర్ నాయుడుపై, ధావల్ పటేల్ 3–6, 4–2, 10–7 తేడాతో కులకర్ణిపై, పీకే పట్నాయక్ 6–1, 6–0 తేడాతో గౌతం బుద్ధాపై, వైవీ రామకృష్ణ 6–3, 6–3తో ఎస్.నరసింహారావుపై, సీబీ రామచంద్ర 7–6, 6–2 తేడాతో ఎంవీ సత్యమోహన్పై గెలుపొందారు. – 55+ కేటగిరీలో ఏవీ వర్థన్ 6–0, 6–0 తేడాతో యూఆర్ఎస్ జగదీష్‌పై, మెహర్ ప్రసాద్ 6–3, 6–0 తేడాతో జోయల్ కుమార్‌పై, మేఘనాథ్ 6–1, 6–1 తేడాతో కోటయ్యపై, రమేష్‌బాబు 7–5, 1–6, 11–9 తేడాతో ఎస్ఏఎన్ రాజుపై, ఆర్వీ రామరాజు 6–1, 6–1 తేడాతో బలరామయ్యపై, ఎం.సురేష్ 6–0, 6–3 తేడాతో జి.నాగరాజుపై విజయం సాధించారు. – 45+ కేటగిరీలో డి.నీలకంఠ 6–2, 6–1 తేడాతో ఎ.వెంకటేశ్వర్లు, కేవీ కృష్ణారెడ్డి 6–2, 6–2 తేడాతో ఎంఎస్ గోపాలకృష్ణపై, జి.కన్నన్ 6–0, 6–0 తేడాతో బి.కుమార్‌పై, ఎల్.సత్యగోపాల్ 6–4, 6–2 తేడాతో సాంబశివరావుపై గెలుపొందారు. -
అమరవీరుల సంస్మరణకు భారీ ఏర్పాట్లు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబుతోపాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. ఇందుకోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమరవీరుల స్తూపంతో పాటు భారీ వేదికను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను గురువారం రాత్రి సీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. – సాక్షి, విజయవాడ -
బిజీ బిజీగా..
* విజయవాడలో పోలీసు శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం * ఐజీఎంసీ స్టేడియంలో అమరవీరులకు నివాళి * ‘శోధన’‘ వాహనానికి పచ్చజెండా * క్యాపిటల్ పోలీసు కంట్రోల్ రూమ్ ప్రారంభం సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో పాల్గొని స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పలు ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ కార్యక్రమాలతోపాటు గన్నవరంలో జరిగిన రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు బిజీబిజీగా సీఎం పర్యటన సాగింది. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు హుదూద్ బాధితుల కోసం భారీగా విరాళాలు ముఖ్యమంత్రికి అందజేశారు. పోలీసు సంక్షేమ నిధికి రూ. 10 కోట్లు ఉదయం 7.30 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ వచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి నేరుగా విజయవాడ చేరుకున్నారు. ఉదయం 8.10 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రిలకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. అనంతరం పోలీసు శాఖ రూపొందించిన పుస్తకాలను బాబు అవిష్కరించారు. అనంతరం అమరవీరుల సేవలను కొనియాడుతూ మాట్లాడారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విజయవాడ వేదిక కావడం మంచి పరిణామమని, పోలీసు సంక్షేమ నిధికి కార్పస్ ఫండ్‌గా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడుతోపాటు పోలీస్ శాఖలో వివిధ విభాగాల డీజీలు సురేంద్రబాబు, అనూరాధ, గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రతినిధి కూడా హాజరయ్యారు. పలువురు వ్యాపారులు హుదూద్ బాధితుల కోసం సీఎంకు విరాళాలు అందజేశారు. ఆ తర్వాత శోధన పేరుతో విజయవాడ నగర కమిషనరేట్ పోలీసులు రూపొందించిన ప్రత్యేక వాహనాన్ని ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ సమీపంలో క్యాపిటల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు కంట్రోల్ రూమ్‌లోని ప్రత్యేకతలు, అందిస్తున్న సేవల్ని చంద్రబాబుకు వివరించారు. అక్కడ్నుంచి చుట్టుగుంట సెంటర్‌కు చేరుకుని తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత నాగుల్‌మీరా నివాసానికి వెళ్లారు. అనంతరం గన్నవరం బయలుదేరారు. రైతు సాధికార సంస్థ ప్రారంభం ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి గన్నవరంలోని పశువైద్యక్షేత్ర సముదాయానికి చేరుకుని రైతు సాధికార సంస్థను ప్రారంభించారు. వ్యవసాయ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సభకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు. అక్కడ పలువురు తుపాను బాధితుల కోసం విరాళాలు అందజేశారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని తూర్పుగోదావరి జిల్లాకు పయనమయ్యారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ , కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, కేశినేని నాని, గోకరాజు గంగరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, నగర పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, వలభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, నగర మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవనరావు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.