పిల్లల్లో ఊబకాయాన్ని అధిగమిద్దాం
విజయవాడ(లబ్బీపేట) : పిల్లల్లో ఊబకాయంపై అవగాహనకు విజయవాడ ఫిజియోస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ర్యాలీని మాచవరం ఎస్‌ఐ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ యలమంచిలి కాంప్లెక్స్ వరకు. అక్కడి నుంచి తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఫిజియోస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నారులకు సరైన వ్యాయామం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నిద్రలేచిన వద్ద నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పుస్తకాలతోనే సరిపోతుందని చెప్పారు. పాఠశాలల్లో వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపక పోవడంతో పిల్లల్లో ఊబకాయులు పెరిగిపోతున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ఆహార అలవాట్లు ఒబెసిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని వివరించారు. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అధిగమించేందుకు వ్యాయామం తప్పనిసరి అన్నారు. సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యకరమని, ప్రతి రోజూ కనీసం గంటపాటు పిల్లలు సైకిల్ వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో సుమారు 200 మందికిపైగా ఫిజియోలు, ఫిజియో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ సుదీప్తి, డాక్టర్ కీర్తిప్రియ, డాకట్ర్ మనోజ్ పాల్గొన్నారు.