
లండన్: ఐదేళ్ల తెలుగు బాలుడు 3,200 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొని అక్షరాలా రూ.3.7 లక్షలు సేకరించాడు. భారత్‌లో కరోనా మహమ్మారిపై పోరాటానికి తనవంతు సాయం అందించేందుకు ఈ బాలుడు చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాల బ్రిటన్‌లోని మాంచెస్టర్ సిటీలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.
‘లిటిల్ పెడలర్స్ అనీశ్ అండ్ ఫ్రెండ్స్’ పేరిట మేలో సైకిల్ క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఇందులో అతడితోపాటు 60 మంది బాలురు పాల్గొన్నారు. మొత్తం 3,200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ప్రజల నుంచి రూ.3.7 లక్షల విరాళాలు సేకరించారు. బ్రిటన్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా నేషనల్ హెల్త్ సర్వేకు సాయం చేసేందుకు క్రికెట్ చాంపియన్‌షిప్ కూడా అనీశ్వర్ ప్రారంభించాడు. ఐదేళ్ల అనీశ్వర్ యూకేలో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.