మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్: 35 నుంచి 90ఏళ్ల నవయువకుల ఉరకలేసే ఉత్సాహం మధ్య ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల పైబడిన వయసులోనూ పోటీల్లో పాల్గొని గెలవాలనే ఆంక్ష ఉన్న వారంతా నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. 2018లో అమరావతిలో జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావం వల్ల తక్కువ మంది పోటీల్లో పాల్గొన్నట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌ను అభినందించారు. గౌరవ అతిథులుగా ఎమ్యెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాంతాతయ్య, మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు భగవాన్, రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, కార్యదర్శి టి.సుబ్బారావు, పోటీల నిర్వహక కమిటీ కార్యదర్శి ఎన్‌ఎస్ ప్రసాద్, జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొనగా, సాంకేతిక సహకారాన్ని శాయ్ అథ్లెటిక్స్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు హాజరయ్యారు.