‘సాక్షి’కి అందని ఆహ్వానం
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు, ఆంగ్ల దినపత్రికల సంపాదకులకు విందు ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిధి గృహంలో ఇచ్చిన ఈ విందు భేటీలో సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ దాన కిషోర్‌లతో పాటు కె. వెంకటేశ్వర్లు (ది హిందూ), జీఎస్ వాసు (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్), కింగ్‌షుక్ నాగ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), సీహెచ్‌వీఎం కృష్ణారావు (డెక్కన్ క్రానికల్), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), పాటూరి రామయ్య, ఎస్. వెంకట్రావు, తెలకపల్లి రవి (ప్రజాశక్తి), కె. శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర), సత్యమూర్తి (సూర్య), డి. సాయిబాబా (వార్త), డీఎన్ ప్రసాద్, ఉప్పులూరి మురళీకృష్ణ (ఈనాడు) తదితరులు పాల్గొన్నారు.
ఈ విందుకు ‘సాక్షి’ సంపాదకులను ఆహ్వానించలేదు. ఇదే విషయంలో విందు సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ‘సాక్షి’ని ఆహ్వానించకపోవడమేంటని పలువురు ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ... పార్టీపరమైన కార్యక్రమాలకు మాత్రమే ‘సాక్షి’ని ఆహ్వానించడం లేదని సమాధానమిచ్చారు. ఈ విందు అధికారిక కార్యక్రమమే కదా దీనికెందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు. సాక్షి సంపాదకులు అందుబాటులోకి రాలేదని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో అధికారికంగా శ్వేతపత్రాలను విడుదల చేసిన సందర్భాల్లో సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అందిన ఆహ్వానం మేరకు సాక్షి ప్రతినిధులు వెళ్లినప్పటికీ భద్రతా సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం.
సాధ్యమైనంత త్వరగా పరిపాలనా విభాగాల తరలింపు
సాధ్యమైనంత త్వరగా ప్రధానమైన పరిపాలనా విభాగాలన్నీ విజయవాడ తరలిపోతాయని ఈ సందర్భంగా సంపాదకులతో చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సంపాదకులకు చంద్రబాబు విందు
Published Tue, Sep 16 2014 12:54 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement