Dinner meeting
-
ప్రధాని డిన్నర్ పార్టీకి ఆర్జేడీ దూరం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో చిన్నారుల మరణాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఎంపీలకు ఇచ్చే విందును తమ పార్టీ బహిష్కరిస్తుందని ఆర్జేడీ నేత మిసా భారతి పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే డిన్నర్ ఖర్చుతో ప్రభుత్వం చిన్నారులకు వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయవచ్చని ఆ పార్టీ నేత, ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి అన్నారు. కాగా, ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో ఇప్పటివరకూ 140 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపుతోంది. చిన్నారులు చికిత్స పొందుతున్న శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్పత్రిని 2500 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో తక్షణమే 1500 నూతన పడకలను ఏర్పాటు చేయాలని ఆస్పత్రిలో చేరిన వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ధర్మశాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. -
ఎన్డీయే పక్షాలకు అమిత్ షా విందు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు. కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా అదే రోజు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్డీయే 300 సీట్లుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌లో ప్రజలంతా మోదీ పాలనకు జేజేలు పలికారని, అంకిత భావంతో సుపరిపాలన అందించిన మోదీసర్కార్‌కు సానుకూలంగా ప్రజలు ఓటు వేశారని వెల్లడైందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారంలో పెట్టిన విపక్షాలకు ఎగ్జిట్ పోల్స్ ఓ గుణపాఠమని అన్నారు. కాగా ఎగ్జిట్ పోల్స్ కట్టుకథలని, మే 23న అసలైన ఫలితాలు రానున్నాయని, ఎగ్జిట్ పోల్స్‌ను తాను విశ్వసించనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఓటర్లు విపక్షం వైపు నిలబడినట్టు స్పష్టంగా వెల్లడవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ తప్పుడు ఫలితాలను అందించాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
గుక్కెడు నీళ్లు చాలు నాకు!
వైట్‌హౌస్ చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. అమెరికా అధ్యక్షుడు దాదాపు పూర్తి శాకాహార మెనూతో భారీగా డిన్నర్ సిద్ధం చేయించారు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒకవైపు భారత ప్రధాని, మంత్రులు, సీనియర్ అధికారులు కూర్చుంటే మరోవైపు అమెరికన్ దిగ్గజాలు కొలువు తీరారు. అయితే.. ఈ విందు సమావేశానికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ మాత్రం హాజరు కాలేదు. హాలిబట్ అనే ఒక రకం చేప తప్ప మిగిలినవన్నీ పూర్తి శాకాహార వంటకాలే అక్కడున్నాయి. అవకాడో, మేక చీజ్, బేబీ బెల్ పెప్పర్స్, మైక్రో బేసిల్, ద్రాక్ష గింజల నూనె, రోటీ, బాస్మతి బియ్యంతో వండిన అన్నం.. ఇవన్నీ టేబుల్ మీద కొలువుదీరాయి. కాలిఫోర్నియా నుంచి తెప్పించిన రెడ్ వైన్ కూడా ఉంది. అతిథులు వాటిలో చాలా డిష్‌లను రుచి చూస్తున్నారు. కానీ ప్రధాన అతిథి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కేవలం కాస్త గోరువెచ్చటి నీళ్లు మధ్యమధ్యలో తాగుతూ గడిపేశారు తప్ప అక్కడ పెట్టినవాటిలో ఏ ఒక్కదాన్నీ ముట్టుకోలేదు. మోదీ శాకాహారి కాబట్టి.. అన్నీ శాకాహార వంటకాలే సిద్ధం చేయిస్తున్నారని తొలుత కథనాలు వచ్చాయి గానీ, ఎలాగోలా ఒక్క చేప మాత్రం మెనూలోకి దూరిపోయింది. మోదీ ప్రత్యేకంగా తయారుచేయించుకున్న నిమ్మరసం కూడా భారతదేశం నుంచి తెచ్చుకున్నారు. కానీ అమెరికా పర్యటనలో చాలావరకు కేవలం గోరువెచ్చటి నీరు మాత్రమే తాగుతున్నారు. దసరా శరన్నవరాత్రులు కావడంతో ఈ తొమ్మిది రోజులూ మోదీ పచ్చి ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మరసం, అందులో రెండు తేనె చుక్కలు, టీ మాత్రమే తీసుకుంటారు. కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉండటంతో బిజీ షెడ్యూలు ఉన్నా కూడా ఆయనలో ఏమాత్రం అలసట కనిపించడం లేదని, డిన్నర్ సమయంలో కొన్ని వందల మందికి షేక్‌హ్యాండ్ ఇస్తున్నా ఆయన చేతి పట్టు మాత్రం అలాగే సడలకుండా ఉందని అహ్మదాబాద్‌కు చెందిన జాఫర్ సరేష్వాలా అనే వ్యాపారవేత్త చెప్పారు. సోమవారం ఉదయం అమెరికాకు చెందిన పెద్దపెద్ద సీఈవోలతో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో కూడా మోదీ కేవలం గోరువెచ్చటి నీళ్లే తాగారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
సంపాదకులకు చంద్రబాబు విందు
‘సాక్షి’కి అందని ఆహ్వానం హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు, ఆంగ్ల దినపత్రికల సంపాదకులకు విందు ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిధి గృహంలో ఇచ్చిన ఈ విందు భేటీలో సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ దాన కిషోర్లతో పాటు కె. వెంకటేశ్వర్లు (ది హిందూ), జీఎస్ వాసు (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్), కింగ్షుక్ నాగ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), సీహెచ్‌వీఎం కృష్ణారావు (డెక్కన్ క్రానికల్), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), పాటూరి రామయ్య, ఎస్. వెంకట్రావు, తెలకపల్లి రవి (ప్రజాశక్తి), కె. శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర), సత్యమూర్తి (సూర్య), డి. సాయిబాబా (వార్త), డీఎన్ ప్రసాద్, ఉప్పులూరి మురళీకృష్ణ (ఈనాడు) తదితరులు పాల్గొన్నారు. ఈ విందుకు ‘సాక్షి’ సంపాదకులను ఆహ్వానించలేదు. ఇదే విషయంలో విందు సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ‘సాక్షి’ని ఆహ్వానించకపోవడమేంటని పలువురు ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ... పార్టీపరమైన కార్యక్రమాలకు మాత్రమే ‘సాక్షి’ని ఆహ్వానించడం లేదని సమాధానమిచ్చారు. ఈ విందు అధికారిక కార్యక్రమమే కదా దీనికెందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు. సాక్షి సంపాదకులు అందుబాటులోకి రాలేదని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో అధికారికంగా శ్వేతపత్రాలను విడుదల చేసిన సందర్భాల్లో సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అందిన ఆహ్వానం మేరకు సాక్షి ప్రతినిధులు వెళ్లినప్పటికీ భద్రతా సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం. సాధ్యమైనంత త్వరగా పరిపాలనా విభాగాల తరలింపు సాధ్యమైనంత త్వరగా ప్రధానమైన పరిపాలనా విభాగాలన్నీ విజయవాడ తరలిపోతాయని ఈ సందర్భంగా సంపాదకులతో చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.