
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు. కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా అదే రోజు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్డీయే 300 సీట్లుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌లో ప్రజలంతా మోదీ పాలనకు జేజేలు పలికారని, అంకిత భావంతో సుపరిపాలన అందించిన మోదీసర్కార్‌కు సానుకూలంగా ప్రజలు ఓటు వేశారని వెల్లడైందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారంలో పెట్టిన విపక్షాలకు ఎగ్జిట్ పోల్స్ ఓ గుణపాఠమని అన్నారు.
కాగా ఎగ్జిట్ పోల్స్ కట్టుకథలని, మే 23న అసలైన ఫలితాలు రానున్నాయని, ఎగ్జిట్ పోల్స్‌ను తాను విశ్వసించనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఓటర్లు విపక్షం వైపు నిలబడినట్టు స్పష్టంగా వెల్లడవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ తప్పుడు ఫలితాలను అందించాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment