గుక్కెడు నీళ్లు చాలు నాకు!
వైట్హౌస్ చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. అమెరికా అధ్యక్షుడు దాదాపు పూర్తి శాకాహార మెనూతో భారీగా డిన్నర్ సిద్ధం చేయించారు. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒకవైపు భారత ప్రధాని, మంత్రులు, సీనియర్ అధికారులు కూర్చుంటే మరోవైపు అమెరికన్ దిగ్గజాలు కొలువు తీరారు. అయితే.. ఈ విందు సమావేశానికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ మాత్రం హాజరు కాలేదు. హాలిబట్ అనే ఒక రకం చేప తప్ప మిగిలినవన్నీ పూర్తి శాకాహార వంటకాలే అక్కడున్నాయి. అవకాడో, మేక చీజ్, బేబీ బెల్ పెప్పర్స్, మైక్రో బేసిల్, ద్రాక్ష గింజల నూనె, రోటీ, బాస్మతి బియ్యంతో వండిన అన్నం.. ఇవన్నీ టేబుల్ మీద కొలువుదీరాయి. కాలిఫోర్నియా నుంచి తెప్పించిన రెడ్ వైన్ కూడా ఉంది. అతిథులు వాటిలో చాలా డిష్లను రుచి చూస్తున్నారు. కానీ ప్రధాన అతిథి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కేవలం కాస్త గోరువెచ్చటి నీళ్లు మధ్యమధ్యలో తాగుతూ గడిపేశారు తప్ప అక్కడ పెట్టినవాటిలో ఏ ఒక్కదాన్నీ ముట్టుకోలేదు.
మోదీ శాకాహారి కాబట్టి.. అన్నీ శాకాహార వంటకాలే సిద్ధం చేయిస్తున్నారని తొలుత కథనాలు వచ్చాయి గానీ, ఎలాగోలా ఒక్క చేప మాత్రం మెనూలోకి దూరిపోయింది. మోదీ ప్రత్యేకంగా తయారుచేయించుకున్న నిమ్మరసం కూడా భారతదేశం నుంచి తెచ్చుకున్నారు. కానీ అమెరికా పర్యటనలో చాలావరకు కేవలం గోరువెచ్చటి నీరు మాత్రమే తాగుతున్నారు.
దసరా శరన్నవరాత్రులు కావడంతో ఈ తొమ్మిది రోజులూ మోదీ పచ్చి ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మరసం, అందులో రెండు తేనె చుక్కలు, టీ మాత్రమే తీసుకుంటారు. కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉండటంతో బిజీ షెడ్యూలు ఉన్నా కూడా ఆయనలో ఏమాత్రం అలసట కనిపించడం లేదని, డిన్నర్ సమయంలో కొన్ని వందల మందికి షేక్హ్యాండ్ ఇస్తున్నా ఆయన చేతి పట్టు మాత్రం అలాగే సడలకుండా ఉందని అహ్మదాబాద్కు చెందిన జాఫర్ సరేష్వాలా అనే వ్యాపారవేత్త చెప్పారు. సోమవారం ఉదయం అమెరికాకు చెందిన పెద్దపెద్ద సీఈవోలతో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో కూడా మోదీ కేవలం గోరువెచ్చటి నీళ్లే తాగారు.