మోదీ.. ఒబామా కలిసి రాసిన సంపాదకీయం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. వీళ్లిద్దరూ కూడా తమ తమ ఎన్నికల ప్రచారాల్లో సోషల్ మీడియాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకున్నవాళ్లే. ఇప్పుడు తొలిసారి వాళ్లిద్దరూ కలిసి ఓ సంపాదకీయం రాశారు. అమెరికాలోని ఓ దినపత్రికకు వాళ్లిద్దరూ కలిసి సంయుక్తంగా సంపాదకీయం రాశారని, అది రేపు ప్రచురితం అవుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, అందులో విషయం ఏమిటనే దాని గురించి మాత్రం అటు భారత్, ఇటు అమెరికన్ అధికారులు ఎవరూ ఒక్క మాట కూడా చెప్పడంలేదు.
అలాగే ఏ పత్రికకు రాశారో కూడా తెలియజేయడం లేదు. వాళ్లిద్దరూ ముందు డిజిటల్ పద్ధతిలో సంప్రదించుకున్నారని, ఆ తర్వాత ఏం రాయాలో కూడా నిర్ణయించుకుని, పరస్పరం పంపుకొని తుది రూపం ఇచ్చారని అంటున్నారు. భారతదేశానికి చెందిన ఓ నాయకుడు ఇలా అమెరికా అధ్యక్షుడితో కలిసి సంపాదకీయం రాయడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ వాల్ స్ట్రీట్ జర్నల్లో ఓ సంపాదకీయం రాశారు.