ఇప్పుడే రండి.. లేకపోతే క్యూ పెరిగిపోతుంది
ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశానికి తిరిగి బయల్దేరారు. తన పర్యటన చాలా సంతృప్తికరంగా సాగిందంటూ, అందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. ''థాంక్యూ అమెరికా. ఈ ఐదు రోజుల్లో నేను చాలా సాధించాను. చాలా సంతృప్తితో నేను ఇండియాకు తిరిగి వెళ్తున్నాను'' అని ఆయన చెప్పారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయానికి బయల్దేరే ముందు మోదీ అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ను ఉద్దేశించి మాట్లాడారు. ''మీరంతా ఇప్పుడే రండి. లేకపోతే క్యూ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. అమెరికన్ పెట్టుబడిదారులకు, మరే దేశానికైనా కూడా మంచిచేద్దాం'' అని ఆయన అన్నారు.
పన్నుల ఉగ్రవాదం ముగిసిపోవాలని, పన్నుల పద్ధతి సులభంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఏమాత్రం ఉపయోగకరంగా లేని పన్నుల వ్యవస్థను తీసేయడానికి తానో కమిటీని కూడా నియమించానన్నారు. ఏ ప్రభుత్వానికైనా మూడు నాలుగు నెలల అనుభవం పెద్దగా చాలదని, కానీ ఆర్థికపరంగా మాత్రం భారతదేశం వెనకబడటానికి ఎలాంటి కారణం తనకు కనిపించడంలేదని విశ్లేషించారు. చివర్లో కూడా ఒకసారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు వాషింగ్టన్ డీసీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ బయల్దేరారు.