ఆర్‌బీఐ, మోదీ టూర్‌పై దృష్టి
ట్రేడింగ్ 3 రోజులకే పరిమితం
- వెలుగులో ఆటో రంగ షేర్లు
- పాలసీ నిర్ణయాలతో ట్రెండ్ నిర్దేశం
- ఈవారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం..
న్యూఢిల్లీ: పరపతి సమీక్షను చేపట్టేందుకు మంగళవారం(30న) సమావేశంకానున్న రిజర్వ్ బ్యాంక్‌పైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిపెడతారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని అంచనా వేశారు. మహాత్మా గాంధీ జయంతి కారణంగా గురువారం, విజయదశమి పర్వదినం కావడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కాగా, ఆపై సోమవారం కూడా బక్రీద్(అక్టోబర్ 6న) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. వెరసి వరుసగా ఈ బుధవారం(అక్టోబర్ 1న) ముగిసే ట్రేడింగ్ మళ్లీ ఆపై మంగళవారం(అక్టోబర్ 7న) ప్రారంభంకానుంది. సెప్టెంబర్ నెలకు ఆటోమొబైల్ విక్రయ గణాం కాలు వెలువడనుండటంతో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
ప్రధాని పర్యటన ఎఫెక్ట్
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విశేషాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. దీంతోపాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడితే ఈ వారం మార్కెట్లు పుంజుకునేందుకు వీలుచిక్కుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ పర్యటన నేపథ్యంలో దేశ ఆర్థిక పురోగతి, సంస్కరణల వంటి అంశాలకు ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. మోదీ అమెరికా పర్యటన పరిణామాలపై కూడా సెంటిమెంట్ ఆధారపడుతుందని మరికొంతమంది నిపుణులు పేర్కొన్నారు.
ప్రోత్సాహానికే చాన్స్
ప్రధాని మోదీ ఐదు రోజుల యూఎస్ పర్యటన దేశీయంగా ప్రోత్సాహాన్నిస్తుందని సియాన్స్ అనలిటిక్స్ వ్యవస్థాపకుడు అమన్ చౌదరి చెప్పారు. ఈ పర్యటన అమెరికా, భారత్‌ల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలకు బూస్ట్‌నిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మరింతమంది అమెరికా ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపేందుకు దోహదం చేస్తుందని వివరించారు.
రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష నిర్ణయాలతోపాటు, హెచ్‌ఎస్‌బీసీ తయారీరంగ సూచీ గణాంకాలను కూడా ఈ వారం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పలువురు నిపుణులు పేర్కొన్నారు. హెచ్‌ఎస్‌బీసీ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. కాగా, గత వారం వెలువడ్డ యూరోజోన్ మందగమన సంకేతాలు, సిరియాపై అమెరికా చేపట్టిన వైమానిక దాడులు, బొగ్గు క్షేత్రాలను మూకుమ్మడిగా రద్దు చేస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వంటి అంశాలు సెంటిమెంట్‌ను వరుసగా దెబ్బకొట్టడంతో మార్కెట్లు డీలాపడ్డాయి.
బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ నికరంగా 464 పాయింట్లు(1.7%) కోల్పోయి 26,626 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 152 పాయింట్లు(1.9%) పతనమై 7,269 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్ క్యాప్(4.5%), స్మాల్ క్యాప్(6%) ఇండెక్స్‌లు మరింత అధికంగా దిగజారడం గమనార్హం. ఇక ఈ వారం యూఎస్‌కు సంబంధించి గృహ విక్రయాలు, వినియోగ, ఉపాధి కల్పన తదితర గణాం కాలు వెల్లడికానున్నాయి. ఇదే విధంగా యూరోజోన్‌కు చెందిన ఆర్థిక, పారిశ్రామిక, వినియోగ సంబంధిత గణాకాలు వెలువడనున్నాయి. యూరోపియన్ కేంద్ర బ్యాంకు పాలసీ సమీక్షను చేపట్టనుంది.