
చంద్రబాబు సిగ్గు, శరం ఉందా: గట్టు శ్రీకాంత్ రెడ్డి
గుంటూరు : చంద్రబాబు నాయుడు జీవితమంతా వెన్నుపోట్లేనని తెలంగాణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి, మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ ఆడియో టేపుల్లో బుక్కయ్యారన్నారు. అయినా చంద్రబాబు ఇంకా సిగ్గు లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సిగ్గు, లజ్జ విడిచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిసే శక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌కే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంతకాలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.