సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం భద్రతను కుదించలేదని, ఆయనకు పరిమితికి మించే భద్రతను కల్పిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 58 మంది భద్రత సిబ్బందిని ఇవ్వాల్సి ఉండగా, 97 మంది సిబ్బందితో చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఆమోదించింది. ఇదే సమయంలో ప్రధాన భద్రతా అధికారి (సీఎస్‌వో)గా భద్రయ్యనే నియమించాలన్న చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సీఎస్‌వోగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తేల్చి చెప్పింది. అలాగే చంద్రబాబు కాన్వాయ్‌కు జామర్ సదుపాయాన్ని కల్పించాలంది. ఇక చంద్రబాబుకు క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీం (సీపీటీ)ను ఏర్పాటు చేసే విషయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ), రాష్ట్ర భద్రతా విభాగం (ఎస్‌ఎస్‌డబ్ల్యూ) మధ్య భేదాభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో, సీపీటీ బాధ్యత ఎవరిదో గరిష్టంగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌డబ్ల్యూలు ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత దానిని చంద్రబాబుకు తెలియజేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ, మూడు నెలలంటే చాలా ఎక్కువ సమయమని, ఈ లోపే నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆదేశాలు అవసరం లేదని, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తీర్పులో చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగా తనకు భద్రత పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబుకు 97 మందితో భద్రత
Published Thu, Aug 15 2019 5:04 AM | Last Updated on Thu, Aug 15 2019 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment