సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారంటూ కొన్ని పత్రికలు రోజూ ఊదరగొడుతున్నాయని, కొంతయినా వాస్తవాలు రాస్తే బాగుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబుపై కొన్ని పత్రికాలు, టీవీ ఛానళ్లు రాస్తున్న కథనాలను చూస్తే తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. మే 23న వెలువడే ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని, చంద్రబాబును ఎవరూ పిలువకపోయినా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోమవారం ఆయన లోటస్‌పాండ్‌లో మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు సర్వనాశం చేశారని తమ్మినేని ఆరోపించారు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పే ధైర్యంకూడా ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు.. కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో చంద్రబాబును ఏ పార్టీ నమ్మే పరిస్థితిలో లేదని, ఉద్దేశపూరితంగానే ఈవీఎంలు టాంపరింగ్ అయ్యాయని ఆరోపిస్తున్నారని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందన్న విషయాన్ని దాచిపెట్టి.. కేంద్రంలో మోదీ ఓడిపోతున్నారని విష ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
కేంద్రంలో చంద్రబాబును ఏ పార్టీ నమ్మే పరిస్థితిలో లేదు
Comments
Please login to add a commentAdd a comment